Published On: Tue, Nov 19th, 2019

మారుతున్న కాలానికి అనుగుణంగా “ఆంగ్ల విద్య అభివృద్ధి”

* శాస్త్రీయ పద్దతితో కూడిన ఆంగ్ల విద్యా బోధన

* అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం

* ప్రతిపక్షాల ఆరోపణలు అర్థరహితం… దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం

* రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ప్రపంచంతో పోటీ పడాలంటే ఆంగ్ల మాధ్యమంపై పట్టు సాధించాల్సిన అవసరం ఆధునిక సమాజంలో ఎంతైనా ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సోమవారం వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం నిర్వహించిన మనబడి నాడు-నేడు కార్యక్రమం విజయవంతమైందన్నారు. ఈ బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉపన్యసించిన విధానం చారిత్రాత్మకమైందన్నారు. ఆంగ్లమాధ్యమ బోధనపై క్షుణ్ణంగా, శాస్త్రీయంగా, సున్నితంగా కలుగుతున్న ప్రయోజనాలను ముఖ్యమంత్రి ఉపన్యసించిన తీరును ప్రస్తావించారు. ప్రపంచ అవసరాలకు అనుగుణంగా నేటి విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించి వారిని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంకల్పించిన విధానాన్ని వివరించిన తీరు ఆకట్టుకుందన్నారు. భవిష్యత్తులో ఆంగ్ల విద్య వల్ల ప్రపంచ స్థాయిలో పోటీ పడే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆటోడ్రైవర్ కుమార్తె అయిన ఒక విద్యార్థిని ముఖ్యమంత్రి వద్దకు వచ్చి మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ విద్యనభ్యసిస్తున్న తమకు ఆంగ్ల బోధన దూరమైందన్న విషయం బాలిక గుర్తుచేసి ఆంగ్ల విద్య ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన విషయాన్ని ప్రస్తావించారు. గతంలో ఆంగ్ల మాధ్యమం ప్రభుత్వ పాఠశాలల్లో లేకపోవడం వల్ల విద్యావ్యవస్థలో పేద విద్యార్థులు పడుతున్న సమస్యను ప్రస్తుత ప్రభుత్వం గుర్తించిందన్నారు. 2006-08 సంవత్సరాల మధ్య కాలంలో అప్పటి ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంగ్ల విద్యకు రాష్ట్రంలో బీజం వేశారని మంత్రి గుర్తుచేశారు. దానిని అమలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పేదరికం అనుభవిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కొన్ని ఉన్నతవర్గాల పేదలకు తమ తమ పిల్లలకు ఆంగ్ల విద్యను అందించేందుకు జగనన్న అమ్మఒడి పథకాన్ని అమల్లోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. పేద విద్యార్థులు అభివృద్ధి చెందడానికి ఆంగ్ల మాధ్యమం బోధన తప్పనిసరి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ తీసుకున్న సంచలన నిర్ణయంతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు.
కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వం ఆంగ్ల విద్య అమలుకు చర్యలు చేపట్టిందని మంత్రి వెల్లడించారు. ప్రైవేట్ విద్యా సంస్థలను తాము తప్పుపట్టడం లేదని కానీ లక్షల రూపాయలను విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర తీసుకొని ఆంగ్ల విద్య నేర్పించడం తగదన్నారు. ఇందువల్ల పేద విద్యార్థులకు ఆంగ్లబోధన అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ ఆంగ్ల విద్యలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు చర్యలు చేపట్టిందన్నారు.
విద్యా సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 6వ తరగతి వరకు ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా పాఠ్యాంశాలను మార్పు చేస్తామన్నారు. రాష్ట్రంలోని 1,85,000 ఉపాధ్యాయులకు గాను 68వేల మంది ఉపాధ్యాయులకు జనవరి నుంచి 5 నెలల పాటు ఆంగ్ల మాధ్యమంలో తర్ఫీదునిస్తామన్నారు. అందుకగనుణంగా శిక్షణా కేంద్రాలను (ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్)లను ఏర్పాటు చేస్తామన్నారు. ఉపాధ్యాయ విద్యను అభ్యసించే నాటి నుండే డైట్ కాలేజీల్లో ఆంగ్ల భాషను ఛాత్రోపాధ్యాయులకు నేర్పిస్తామన్నారు. తద్వారా భవిష్యత్ లో ఉపాధ్యాయ వృత్తిలో ఎంపిక అవ్వడం ద్వారా బోధన సులవవుతుందన్నారు. ఇప్పటికే ఇప్లూ తరహా లాంటి సంస్థలతో ఒప్పందం(ఎంవోయూ) చేసుకున్నామన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలని, అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విద్యార్థుల సామర్థ్యాలను ప్రపంచ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు సమర్థవంతమైన నైపుణ్యాలు విద్యార్థులకు అందజేయడం చారిత్రాత్మక అవసరముందన్నారు. గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రపంచస్థాయి పోటీని తట్టుకునేలా తీర్చిదిద్దేందుకే ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం కొనసాగుతుందన్నారు. ఇంగ్లీష్ పై పట్టులేక ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని అందుకే తొలి విడతలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నామన్నారు. దీని ఫలాలు భవిష్యత్ లో 2041వ సంవత్సరం నాటికి అంటే నేటి విద్యార్థులు ఉద్యోగాలకు అర్హత పొందడానికి ఉపకరిస్తుందన్నారు. పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ ఆలోచనను అంచెలంచెలుగా అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. అక్టోబరు నెలలో విద్యార్థుల నమోదు పరిశీలిస్తే 62 శాతం మంది విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో విద్యనభ్యసిస్తున్నారన్నారు. మిగిలిన 38 శాతంను సామాజికవర్గాల వారీగా పరిశీలిస్తే వెనకబడిన వర్గాలు 62 శాతం, షెడ్యూలు కులాల వారు 49.61 శాతం, షెడ్యూలు తెగలు 33.23 శాతం, ఇతర వర్గాల వారు 82.62 శాతం ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పేద పిల్లల తల్లులకు జగనన్న అమ్మఒడి పథకం వర్తించేలా తీసుకున్న నిర్ణయం లబ్ది చేకూరుస్తుందని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని మంత్రి గుర్తుచేశారు. విద్యా సంస్కరణల్లో భాగంగానే ఈ ప్రక్రియ చేపడుతున్నామన్నారు. నూతన విద్యావిధానంలో రైట్ టూ ఎడ్యుకేషన్ అమలవుతుండగా దానిని సీఎం జగన్ మోహన్ రెడ్డి 45 రోజుల్లో రైట్ టూ ఇంగ్లీష్ ఎడ్కుకేషన్ గా అమల్లోకి తెచ్చినందుకు ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారన్నారు. ఆర్టీజీఎస్ విధానం ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ జగనన్న అమ్మఒడి పథకాన్ని వర్తింపజేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమం విషయంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. ఆంగ్ల మాధ్యమంపై ఎవరికైనా సందేహాలుంటే రాష్ట్రప్రభుత్వం చర్చించేందుకు సిద్ధమన్నారు. రాజన్నరాజ్యం తేవాలన్నదే జగనన్న ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఆంగ్లంలో ప్రావీణ్యం సాధించడం ద్వారా భవిష్యత్తులో ఉపాధ్యాయ, ఉద్యోగ నియామకాల్లోనూ అవకాశాలు మెండుగా ఉంటాయని తెలిపారు. విద్యార్థులందరూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దేందుకు ఆంగ్ల మాధ్యమంలో బోధన తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ప్రతిపక్షాలకు తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేసేందుకు రెండు అంశాలే కనబడుతున్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు. ఒకటి ఇసుక, మరొకటి ఆంగ్లమాధ్యమంలో విద్య…ఇప్పటికే ఇసుక కొరత సమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు. ఇక మిగిలిన ఆంగ్ల విద్యపై లేని సమస్యను అడ్డంపెట్టుకొని దానికి కులం, మతం రంగు పులమడం ద్వారా రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని ప్రతిపక్షాలు కుట్ర పన్నాయన్నారు.
గ్లోబల్ విలేజ్ గా ప్రపంచం మారిన నేపథ్యంలో ప్రతిపక్షాలు కొత్త అంశాన్ని తెరమీదికి తెచ్చాయని మంత్రి అన్నారు. ఆంగ్ల భాషను మతానికి ఆపాదించడం సరికాదని హితవు పలికారు. మారుతున్న కాలానికి, సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా ఇప్పటికే ప్రపంచంలోని కొన్ని దేశాలు ఆంగ్ల భాషను తప్పనిసరి చేశాయన్నారు. ఆంగ్ల భాషను నేర్చుకున్న వారిలో ఎంత మంది మతాలను మార్చుకుంటున్నారని ప్రశ్నించారు. మన రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు వెళ్లిన వారిలో ఎంత మంది మతమార్పిడి చేసుకున్నారో తెలపాలని నిలదీశారు. ఆంగ్ల మాధ్యమం అన్ని ప్రశ్నలకు సమాధానమని భావించామని, ఇది ప్రతిపక్షాలకు నచ్చక విమర్శలు చేస్తున్నాయని తెలిపారు. పేద విద్యార్థులు ఆంగ్లం అభ్యసిస్తే తమ రాజకీయ ఉనికి ప్రశ్నార్థకమవుతుందని భావించిన ప్రతిపక్షం గోబెల్స్‌ ప్రచారానికి తెరతీసిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుపై కొందరు వ్యక్తులు, కొన్ని పత్రికలు, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు పనిగట్టుకొని చేస్తున్న ప్రచారం అవాస్తవమని మంత్రి కొట్టిపారేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు పనులు, పదవులు, రాజకీయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం అవకాశం కల్పించిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ విషయాలు గిట్టని కొందరు అదే పనిగా దుష్ప్రచారానికి తెరతీసి ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే పనిలో నిమగ్నమయ్యారని తదనుగుణంగానే అవాస్తవ కథనాలు వెలువడుతున్నాయన్నారు. పత్రికల అభిప్రాయాలను ప్రజలు, ప్రభుత్వ నిర్ణయాలపై రుద్దడం సరికాదని హితవు పలికారు. ప్రతిపక్షం నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తామన్నారు. అంతేకానీ అర్థరహిత ఆరోపణలు, వ్యాఖ్యలు చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Just In...