Published On: Thu, Jan 23rd, 2020

రోడ్డు నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి

* డిటిసి ఎస్.వెంకటేశ్వరరావు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: డ్రైవింగ్‌లో నైపుణ్యం ఉన్న కూడా సిగ్నల్స్, రోడ్డుపై ఏర్పాటుచేసిన సైన్ బోర్డులపై అవగాహన లేకపోవడంతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు నియమాలను ప్రతి ఒక్కరూ తెలుసుకొని పాటించినప్పుడే ప్రమాదాలను తగ్గించగలమని డిటిసి ఎస్.వెంకటేశ్వరరావు అన్నారు. విజ‌య‌వాడ‌లోని స్థానిక డిటిసి కార్యాలయ ప్రాంగణంలో బుధవారం నాడు సేఫ్టీ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో 31వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమమును నిర్వహించారు. డిటీసీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అధిక శాతం రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, అజాగ్రత్తగా ఉండటం, రోడ్డు నిబంధనలపై అవగాహన లోపం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, డ్రైవింగ్ పై నైపుణ్యం పెంచుకుంటేనే సరిపోదని, రోడ్డు భద్రత పై కూడా పూర్తి అవగాహన పెంచుకోవాలని డి టి సి అన్నారు. ద్విచక్ర వాహనాలను నిర్లక్ష్యంగా నడపడం వల్ల పాదచారులు కూడా ప్రమాదాలకు గురవుతున్నారని, రోడ్డు నిబంధనలకు అనుగుణంగా వాహనాలను నడపాలన్నారు. ప్రతిఒక్కరు ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో తమ వంతు సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని రోడ్డు నిబంధనలను పాటించకుండా హెల్మెట్/సీట్ బెల్ట్ దరించపోవడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చెయ్యడం, త్రిబుల్స్ డ్రైవింగ్ చెయ్యడం, వన్ వే లో డ్రైవింగ్ చెయ్యడం వంటి వాహనాలను ఫోటో తీసి వాట్సాప్ నెంబర్ 9542800800కు పంపించాలని అని కోరారు. ఈ సందర్భంగా వాట్సాప్ నెంబర్‌ను అందరి దృష్టి ఆకర్షించేలా ప్రదర్శించారు. కార్యక్రమంలో ఆర్టీఓ జగదేశ్వరరాజు, మోటారు వాహన తనిఖీ అధికారి నారాయణస్వామి, కార్యాలయ పరిపాలన అధికారులు ప్రభాకరలింగం, శ్రీనివాసరావు, కవిత, రాజుబాబు, ప‌లువురు ఉద్యోగులు పాల్గొన్నారు.  

Just In...