Published On: Sat, Feb 1st, 2020

నిరంతరం వేగంగా మార్పు చెందేదే టెక్నాలజీ…

* టెక్నాలజీని అందిపుచ్చుకుంటేనే ముందడుగు వేయగలం

* యువతతోనే భారతావని భవిత

* విద్యార్థులు సులభంగా ఉద్యోగాలు పొందేలా సంసిద్ధం చేయాలనేదే సీఎం తపన

* నైపుణ్య శిక్షణతో ప్రపంచంతో పోటీ పడేలా యువతని నిలబెడతాం

* నెల్లూరు జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులతో మంత్రి మేకపాటి ముఖాముఖి

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: నైపుణ్యశిక్షణతో యువతను ఉద్యోగాలు పొందే అస్త్రశస్త్రాలుగా సిద్ధం చేయాలనేదే ముఖ్యమంత్రి తపన అని పరిశ్రమలు,వాణిజ్య, ఐ.టీ,జౌళి, నైపుణ్యాభివృద్ధి,శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను మంత్రి సందర్శించారు. కళాశాల విద్యార్థినీ, విద్యార్థులతో మంత్రి స్వయంగా ముఖాముఖి మాట్లాడారు. ఇంజినీరింగ్ చదివిన విద్యార్థుల కన్నా ఇపుడు ఐటీఐ చదివిన వారికే ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్నాయని మంత్రి అన్నారు. అయినా పాలిటెక్నిక్ చదివే విద్యార్థుల సంఖ్య తగ్గుతుండడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో టెక్నాలజీ వేగవంతంగా మారుతోందని, అందుకు తగ్గట్లుగా ఆంధ్రప్రదేశ్ యువతని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే నైపుణ్యాభివృద్ధి, శిక్షణకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అధిక ప్రాధాన్యమివ్వనుందని మంత్రి స్పష్టం చేశారు. అంతకు ముందు కళాశాలని పరిశీలించారు. ప్రయోగశాలల్లో ఉన్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని యువతకు అప్రెంటి షిప్ కార్యక్రమాలను నిర్వహించి, అన్ని సదుపాయాలు అందించి యువతను ప్రంపంచంలో ఎక్కడైనా నైపుణ్యంతో పనిచేసేలా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు. టెక్నాలజీని అందిపుచ్చుకుని అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాలలో ఏ రంగంలోనైనా రాణించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతని తయారు చేసి తీరుతామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆటోమేటెడ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి కోర్సులను నేర్పించి విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించేందుకు కృషి చేస్తానని మంత్రి విద్యార్థులతో ముఖాముఖిలో మాటిచ్చారు. ఇక ఉపన్యాసం చివర్లో యువతే భావిభారతానికి భవిత అని మంత్రి మేకపాటి అనడంతో విద్యార్థుల కేరింతలతో కళాశాల వాతావరణం మారుమోగింది. చివరిలో విద్యార్థుల ద్వారా తన దృష్టికి వచ్చిన కళాశాల వసతుల సమస్యపై మంత్రి మేకపాటి సానుకూలంగా స్పందించారు. తన నియోజకవర్గం కాకపోయిన, సంబంధిత శాఖ మంత్రి అవకపోయినా సోదరుడిలాంటి నెల్లూరు ఎమ్మెల్యే, జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌తో మాట్లాడి త్వరలోనే ఆ సమస్యలు పరిష్కరించేలా తన దృష్టికి తీసుకువెళతానని మంత్రి గౌతమ్ రెడ్డి విద్యార్థులకు మాటిచ్చారు.

Just In...