Published On: Thu, Feb 13th, 2020

వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆంగ్లమాధ్యమ బోధనకు శ్రీకారం…

* ఆంగ్ల విద్యతో పేద వర్గాలకు మేలు

* రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఇంగ్లీష్ విద్యకు మద్దతుగా తల్లిదండ్రుల కమిటీలు తీర్మానాలు

* ఇప్పటివరకు 67,145 మంది ఉపాధ్యాయులకు ఆంగ్లవిద్యలో శిక్షణ

* ఉపాధ్యాయులకు శిక్షణ అందించడం నిరంతర ప్రక్రియ

* ప్రతి పాఠశాలల్లో  ఇంగ్లీష్ లాబోరేటరీలు ఏర్పాటు

* మంత్రి ఆదిమూలపు సురేష్

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వపాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ బోధనను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం పరిపూర్ణంగా సమాయత్తంగా ఉందని  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయం 3వ బ్లాక్ ఎదురుగా ఉన్న పార్కు ఆవరణలో తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతితో కలిసి మంత్రి  పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఆంగ్లమాధ్యమ బోధనకు సంబంధించిన పలు విషయాలను మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం ఆంగ్లమాధ్యమ బోధనపై నిర్ణయం ప్రకటించాక జరిగిన పరిణామాలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాబోయే విద్యాసంవత్సరంలో (2020-2021) రాష్ట్రవ్యాప్తంగా 43వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి  తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ మద్దతుగా తల్లిదండ్రుల కమిటీల తీర్మానాలు వచ్చాయని వివరించారు. ఇంగ్లీష్ మీడియంలో బోధన జరగాలని పేరెంట్స్ కమిటీలు స్వాగతిస్తూ తీర్మానాలు పంపడం సంతోషంగా ఉందన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి నూటికి నూరు శాతం మద్దతిస్తూ తీర్మానాలు వచ్చాయని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. చదువు వచ్చినవారు స్వంత దస్తూరితో తీర్మానాలు పంపగా, రానివారు వేలిముద్రలతో మద్దతు తెలుపుతున్నట్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారన్నారు. ఎంఈవో, డీఈవో ద్వారా తమకు మద్దుతు తీర్మాన పత్రాలు అందాయని,  దేశ చరిత్రలో ఒక అంశంపై ఇన్ని తీర్మానాలు రావడం తొలిసారి అని వెల్లడించారు. ఆంగ్లమాధ్యమ బోధన విషయంలో ముఖ్యమంత్రి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం అనంతరం పలు పరిణామాలు జరిగాయని ఈ నేపథ్యంలో వాటిని రాష్ట్ర ప్రజలకు వివరించాలన్న ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేశామని వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ ఉన్నత ఆశయాలతో ముందుకెళ్తున్నారని ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నిర్ణయాలను రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారని మంత్రి వెల్లడించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం, ఉచితంగా  నాణ్యమైన విద్యను అందించడం ప్రపంచంలోనే ఎక్కడాలేదని మంత్రి తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి దూరదృష్టితో దార్శానికుడిగా వ్యవహరించారని కొనియాడారు. ఇంగ్లీష్ మీడియం ద్వారానే నైపుణ్యం దొరుకుతుందని భావించి సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్ ఆంగ్లమాధ్యమంతోనే సాధ్యమవుతుందని నమ్మారు కాబట్టే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తీర్మానాలు పంపడం జరిగిందన్నారు. తల్లిదండ్రుల మనోభావాలు తెలుసుకునేందుకు కమిటీలు ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు. తల్లిదండ్రుల కమిటీల సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. నూతనంగా ఎన్నుకోబడిన తల్లిదండ్రుల కమిటీలకు అనేక బాధ్యతలు, హక్కులు కల్పించామన్న విషయాన్ని మంత్రి వివరించారు. పాఠశాలలకు సంబంధించి ప్రభుత్వం  ఏ కార్యక్రమం చేపట్టినా తల్లిదండ్రుల కమిటీ వేదికగా మారిందన్నారు.పిల్లల మనోభావాలు తెలుసుకునే కమిటీగా పేరెంట్స్ కమిటీ తయారైందని తెలిపారు. ఇప్పటికే జనవరి నెలలో కమిటీ వారోత్సవాలు నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. తల్లిదండ్రుల కమిటీలు పంపినవి ట్రంక్ పెట్టెలు కాదు అవి వారి ఆకాంక్షలు అని మంత్రి తెలిపారు. పేరెంట్స్ కమిటీకి విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు.
రాబోయే విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ విద్య ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. జీవో నంబర్ 85,89 ద్వారా వచ్చే విద్యా సంవత్సరం (2020-2021) నుంచి తెలుగు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ, స్థానిక, రెసిడెన్షియల్ తదితర పాఠశాలల్లో కార్పొరేట్ తరహా ఆంగ్లవిద్యను అందించడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని వివరించారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పరిరక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం చేపట్టామని మంత్రి తెలిపారు. అమ్మఒడి పర్యవేక్షణకు ఒక ఐఏఎస్, ఇంగ్లీష్ మీడియం బోధనను ఒక ఐఏఎస్ పర్యవేక్షిస్తారని తెలిపారు. ఇంగ్లీష్ బోధన విషయంలో సవాళ్లున్న మాట వాస్తవమేనన్నారు. సవాళ్లను ఎదుర్కొనేలా  పకడ్భందీ ప్రణాళిక రూపకల్పన చేశామన్నారు. 1 నుండి 3వ తరగతి వరకు ఇంటెన్సివ్ లెర్నింగ్, 4వ తరగతి నుండి 5వ తరగతి వరకు బ్రిడ్జి కోర్సులు ప్రవేశపెట్టానున్నామని న్నారు. ఏప్రిల్, మే నెలలో ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలవుతుందని వెల్లడించారు. కరికులమ్ పై ప్రధానంగా దృష్టిసారించామన్నారు. ఇప్పటికే ఆక్స్ పర్డ్, కేంబ్రిడ్జ్, చికాగో వర్సిటీలతో పాటు శ్రీలంక, బ్రిటీష్ దేశాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ పై అధ్యయనం చేశామన్నారు. టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, హ్యాండ్ బుక్స్ లు విడిగా ప్రింట్ చేస్తున్నామన్నారు. టెక్స్ట్ బుక్స్ తరగతి గదిలో, వర్క్ బుక్స్ ఇంట్లో, హ్యాండ్ బుక్స్ ఉపాధ్యాయులకు అందించనున్నామన్నారు. పట్టణప్రాంతాల్లో తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా హ్యాండ్ బుక్స్ ఇచ్చే ఆలోచన చేశామన్నారు. అదే విధంగా ప్రతి పాఠశాలల్లో  ఇంగ్లీష్ లాబోరేటరీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు.ముఖ్యమంత్రి నాయకత్వంలో క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరీక్షించామని తెలిపారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి జగనన్న విద్యా కానుక కిట్ అందించనున్నామని కిట్ లో భాగంగా ప్రతి విద్యార్థికి పుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటు మూడు జతల యూనిఫామ్స్, రెండు జతల బూట్లు, బెల్ట్ అందిస్తామన్నారు. ఇంగ్లీష్ మీడియంలో బోధన, విద్యాకానుక, పాఠశాలకు మౌలికవసతులు కల్పించే దిశగా విద్యాశాఖలో ఈ తరహా సంస్కరణలు, మార్పు తేవాలంటే చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అలాంటి విప్లవాత్మక నిర్ణయాలను తమ  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై ముఖ్యమంత్రి ప్రధానంగా దృష్టిసారించారని, కేవలం విద్యాశాఖకే బడ్జెట్ లో 16 శాతం కేటాయింపులు, 33వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చారన్న విషయం గుర్తుచేశారు.
జీవనోపాధికి ఇంగ్లీష్ భాష ఎంతో ఉపయోగమని ఆంగ్లమాధ్యమం వల్ల కలిగే లబ్ధిని, ఉపయోగాలను మంత్రి వివరించారు. జీవనోపాధి భాషగా, నైపుణ్య భాషగా ఇంగ్లీష్ మారిన నేపథ్యంలో దానికి తగ్గ కార్యాచరణ ప్రణాళిక ఉందా అనే సవాళ్లు వచ్చాయని ఆ దిశగా తాము రూపకల్పన చేశామని చెప్పారు. గ్రామీణ విద్యార్థులు, ఉపాధ్యాయులు అర్థం చేసుకునేలా 4వ తరగతి నుండి 7వ తరగతి వరకు బ్రిడ్జ్ కోర్సులు, ఎర్లీలెర్నింగ్ రాపిడ్ కోర్సులను ప్రవేశపెట్టామన్నారు. 30 మంది స్టేట్ లెవల్ రిసోర్స్ పర్సన్స్ కు కీ రిసోర్స్ పర్సన్స్ తో శిక్షణ ఇచ్చామని అనంతరం 260 మంది వారం పాటు, ప్రతి మండలంలో నలుగురు చొప్పున 2700 మందికి  పది రోజుల పాటు శిక్షణ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.
మొత్తంగా ఇప్పటివరకు ఇంగ్లీష్ విద్యపై రెండు దశల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామని మొదటి దశలో భాగంగా 33,508 మందికి, రెండవ దశలో 33,637 మందికి మొత్తం 67,145 మంది టీచర్లకు  శిక్షణ ఇచ్చామని వివరించారు. అంతేగాక సెల్ఫ్ అసెస్ మెంట్ యాప్ ను కూడా తయారుచేశామని మంత్రి చెప్పారు. ఈ  యాప్ వల్ల ఉపాధ్యాయులు ఏమేర తర్ఫీదు పొందారో తెలుసుకోవచ్చన్నారు.  కెపాసిటీ బిల్డింగ్, కాంప్రహెన్సివ్ లెర్నింగ్ వంటి కార్యక్రమాలను కలెక్టర్ల నేతృత్వంలో నిర్వహించామన్నారు. ప్రతి జిల్లాలో టీచర్ ట్రైనింగ్ ను కలెక్టర్లు పర్యవేక్షించారని తెలిపారు. స్వయంగా తాను ప్రకాశం, కడప జిల్లా శిక్షణాకార్యక్రమంలో పాల్గొన్నట్లు వెల్లడించారు. ఉపాధ్యాయులకు శిక్షణ అందించడం నిరంతర ప్రక్రియగా మంత్రి వెల్లడించారు. త్వరలోనే అప్రెంట్ షిప్ కోర్సులు ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల్లోని ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన శిక్షణ అందిస్తామన్నారు. ప్రతి జిల్లాల్లో ఉండే ప్రభుత్వ డైట్ కాలేజీలను శాశ్వత ప్రాతిపదికన టీచర్ ట్రైనింగ్ కాలేజీలుగా మార్పు చేస్తామన్నారు. త్వరలోనే టీచర్ ట్రైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు విషయమై ఆలోచిస్తున్నామన్నారు. గతంలో 1998,2008,2012, 2018 డీఎస్సీలకు సంబంధించిన కొన్ని న్యాయపరమైన ఇబ్బందులున్నాయని వీలైనంత త్వరగా వాటి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఉపాధ్యాయ ఖాళీలు గుర్తించి గత డీఎస్సీ అపాయింట్ మెంట్స్ కు  ఇబ్బంది కలగకుండా భర్తీ చేస్తామన్నారు.  తెలుగును గుర్తించాం కాబట్టే 12వేల మంది తెలుగు పండిట్స్ కు స్కూల్ అసిస్టెంట్ లుగా పదోన్నతులు కల్పించామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి మాట్లాడుతూ కులం, మతం, ప్రాంతం, రాజకీయాలతో సంబంధం  లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. ఆంగ్లమాధ్యమంలో బోధన వల్ల బడుగు, బలహీన, మధ్య, పేద తరగతి విద్యార్థులకు మంచి భవిష్యత్ లభిస్తుందన్నారు. విద్య. వైద్యం, వ్యవసాయం మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి తమ ముఖ్యమంత్రి ఆరోగ్యసమాజం కోసం పాటుపడుతున్నారన్నారు. మాతృభాషను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తుంటే హర్షించాల్సింది పోయి కొందరు పనిగట్టుకొని విమర్శలు చేయడం సరికాదన్నారు. ఏ తరగతికైనా మాతృభాష తప్పనిసరని తమ సీఎం చెప్పారన్న విషయాన్ని గుర్తుచేశారు.తమ ముఖ్యమంత్రివి ఆదర్శవిధానాలని కొనియాడారు. నాణ్యమైన విద్యనందించి విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఎంత అభినందించినా తక్కువేనన్నారు. కార్య‌క్ర‌మంలో సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

  

Just In...