Published On: Fri, May 22nd, 2020

ప్రముఖ నాస్తికోద్యమ నేత డాక్ట‌ర్ విజయం ఆకస్మిక మరణం..

విజయవాడ, సెల్ఐటి న్యూస్‌: ప్రపంచ నాస్తికోద్యమ నేతలు గోరా, సరస్వతి గోరాల రెండో కుమారుడు డాక్ట‌ర్ విజయం(84) స్వల్ప కాలిక అస్వస్థతతో శుక్రవారం ఉదయం 5 గంటలకు స్థానిక నాస్తిక కేంద్రంలో మరణించారు. నాస్తిక కేంద్రం కార్యనిర్వాహక సంచాలకులు, సంస్కర్త, సాంఘికోద్యమ నేత, పర్యావరణ శాస్త్రవేత్త అయిన విజయం గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు సమాజానికి అందించిన సేవలు మరువలేనివి. ఆయన మరణాంతరం ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందంర్శనార్ధం నాస్తిక కేంద్రంలో ఉంచారు. ప్రముఖ పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని), ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సిపిఐ నేత పి.మధు, సిపియం నేత బాబూరావు, కమ్యూనిస్ట్ నాయకులు అక్కినేని వనజ, ఇతర నాయకులు, వైద్యులు, ఇతర పుర ప్రముఖులు, నాస్తికులు తమ నాస్తిక కేంద్రానికి విచ్చేసి తమ నివాళులు అర్పించారు. భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంకయ్య నాయుడు, లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ‌, డిజిపి గౌతమ్‌సవాంగ్, నగర పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమలరావు, సినీ నటుడు జగపతిబాబు తమ సందేశాలతో డాక్ట‌ర్ విజయానికి నివాళులర్పించారు. ఆయన భౌతికకాయాన్ని శుక్రవారం సాయంత్రం చినకాకాణీలోని ఎన్.ఆర్.ఐ. మెడికల్ కాలేజీకి అందజేశారు.

Just In...