Published On: Tue, Nov 17th, 2020

90శాతం హామీలు పూర్తి చేశాం…

* స‌మీక్ష‌లో సీఎం జగన్‌ మోహన్ రెడ్డి

* వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంటరుణాల పథకం కింద రూ.510 కోట్ల వడ్డీ రాయితీ విడుద‌ల‌

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: సకాలంలో పంట రుణాలు చెల్లిస్తేనే రైతులకు మొత్తం వడ్డీ తిరిగి వస్తుందన్నభరోసా కలుగుతోందని సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంటరుణాల పథకం కింద  రూ.510 కోట్ల వడ్డీ రాయితీని సీఎం జ‌గ‌న్ మంగ‌ళ‌వారం ఉద‌యం తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యం నుండి ‘వైయస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం’ తో పాటు, ఈ ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి అక్టోబరు నెలలో సంభవించిన పంటల నష్టంపై పెట్టుబడి సహాయం (ఇన్‌పుట్‌ సబ్సిడీ) చెల్లించారు. ఆన్‌లైన్‌ విధానంలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం వైయస్‌ జగన్ ‌కంప్యూట‌ర్‌లో బ‌ట‌న్ నొక్కి విడుదల చేశారు. కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మంత్రులు కుర‌సాల కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పేర్ని నాని, అవంతి శ్రీనివాస్, ఏపీ అగ్రి మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖకు చెందిన సీనియర్‌ అధికారులు, బ్యాంకుల ప్రతినిధులు, పలువురు రైతులు హాజర‌య్యారు. 14.58 లక్షల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుందని తెలిపారు. 2019 ఖరీఫ్ రుణాలకు సంబంధించి పంట రుణాలు సహా గత ప్రభుత్వం హయాంలో పెండింగ్‌లో ఉన్న వడ్డీలేని రుణాల బకాయిలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి జగన్ మోహ‌న్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల హామీలు దాదాపు 90శాతం పూర్తి చేశామని వెల్లడించారు. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించడంతో పాటు బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లిస్తే వడ్డీని కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకే జమచేస్తున్న ప్రభుత్వం తమదేన‌ని గర్వంగా చెప్పగల‌మ‌ని పేర్కొన్నారు. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్‌ ముగిసేలోగానే పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఈరోజు నిజంగా మరో ఘట్టం. రైతులకు మంచి చేసే విషయం ఎంతో సంతోషం కలిగించింది. రైతులకు ఎంత చేసినా తక్కువే. రైతులకు చేస్తున్న ఈ కార్యక్రమం, రైతులకు సకాలంలో పంట రుణాలు చెల్లించడం అలవాట‌వుతుంది. సకాలంలో రుణాలు చెల్లిస్తే ప్రభుత్వం వడ్డీ కడుతుందన్న నమ్మకం కలుగుతుంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా భరోసా ఇవ్వలేదు. మొదటిసారిగా ప్రభుత్వంపై విశ్వసనీయత కలుగుతోంది, ఆ నమ్మకం ఇవ్వగలుగుతున్నాం అని సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు జిల్లాల రైతుల‌తో సీఎం జ‌గ‌న్ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడారు.  

Just In...