Published On: Mon, Jul 6th, 2020

జగన్మాత దుర్గమ్మకు తెలంగాణ నుంచి బంగారు బోణం సమర్పణ

* శాకాంబ‌రి దేవిగా ద‌ర్శించుకుని ఉప్పొంగిన భ‌క్తులు

* కరోనా మహమ్మారిని నిర్మూలించేలా శక్తిని ప్రసాదించాలని దుర్గ‌మ్మ‌కు వేడుకోలు

ఇంద్రకీలాద్రి, సెల్ఐటి న్యూస్‌: శ్రీ శార్వ‌రి నామ సంవత్సర శాకంబరి ఉత్సవాలను పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై శాకబంరి దేవి అలంకారంలో ఉన్న జగన్మాత క‌న‌క‌దుర్గమ్మకు తెలంగాణాలోని భాగ్యనగర్ శ్రీమహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు బంగారు బోనాన్ని సంప్రదాయ పద్దతిలో ఆదివారం సమర్పించారు. భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో అమ్మవారికి పసుపు, కుంకుమ, పట్టువస్త్రాలు, మిఠాయిలతో సారెను తీసుకువ‌చ్చి దేవస్థానం వైదిక కమిటీ సభ్యులకు  అందజేశారు. దారిపొడవున నగర వాసులు ఆసక్తిగా బోనాల ఊరేగింపును తిలకించారు. మునుపెన్న‌డూ చూడ‌ని విధంగా దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైర‌స్ మహమ్మారిని నిర్మూలించేలా జగన్మాత దుర్గమ్మ శక్తిని ప్రసాదించాలని ఈ ఏడాది తెలంగాణ నుంచి అమ్మ‌వారికి సారె తీసుకువ‌చ్చిన భ‌క్తులు వేడుకున్నారు. హైదరాబాద్‌లోని పాతబస్తీ నుంచి దశాబ్ద కాలంగా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సంప్రదాయ పద్ధతుల్లో పోతురాజు వేషాలు, బాజా భజంత్రీలతో 500 మంది తమ కమిటీ నుంచి విజయవాడ వచ్చి బోనాలు సమర్పిస్తున్న‌ట్లు కమిటీ అధ్యక్షుడు జనగామ మధుసూధనగౌడ్ తెలిపారు. ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కేవలం 50మంది మాత్రమే ఉభయ తెలుగు రాష్ట్రాల అనుమతితో బోనాలు తీసుకువచ్చినట్లు చెప్పారు. దేవస్థానం ఈవో సురేష్‌బాబు, పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, వైదిక కమిటీ సభ్యులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి బంగారు బోనాన్ని స్వీకరించారు.

Just In...