Published On: Mon, Jul 6th, 2020

ఇంద్ర‌కీలాద్రిపై ముగిసిన శాకంబ‌రి ఉత్స‌వాలు

* చివ‌రి రెండు రోజులు బంగారు వాకిలి ద‌ర్శ‌నం

* పెరిగిన వీఐపీల తాకిడి

* దుర్గ‌మ్మ సేవ‌లో న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్

ఇంద్ర‌కీలాద్రి, సెల్ఐటి న్యూస్‌: (కొంకిమ‌ళ్ళ శంక‌ర్‌-సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌)
‌ఇంద్రకీలాద్రిపై మూడు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ శార్వ‌రి నామ సంవత్సర శాకంబరి ఉత్సవాలు పూర్ణాహుతితో ఆదివారం ముగిశాయి. ఈ సంద‌ర్భంగా యాగశాలలో వైదిక కమిటీ సభ్యులు శివప్రసాద శర్మ, శ్రీనివాసశాస్త్రి పర్యవేక్షణలో రుత్వికులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సప్తశతి హవనం, శాంతి పౌష్టిక హోమం, అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య రుత్వికులు పూర్తిచేశారు. కలశ ఉద్వాసన, ఆశీర్వచన కార్యక్రమాలు నిర్వహించారు. మూడు రోజుల పాటు దుర్గమ్మ ప్రధాన ఆలయంతో పాటు ఉపాల‌యాలను వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో స‌ర్వాంగ సుంద‌రంగా అలంకరించారు. చివరిరోజు ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు 10 వేల మంది దర్శించుకున్నారు. దేవ‌స్థానం ఆన్‌లైన్‌లో తొలి రోజున కేవలం ముఖమండప దర్శనం రూ.100. ఉచిత దర్శనం టిక్కెట్లు మాత్రమే విక్రయించారు. తరువాత రెండు రోజులు వీఐపీల తాకిడి కూడా పెరగడంతో బంగారు వాకిలి దర్శనం పేరుతో రూ.300 టిక్కెట్లు కూడా దేవస్థానం ఆన్‌లైన్‌లో విక్రయించింది. షూట్ రోడ్డు నుంచి కూడా వీఐపీలతో పాటు తెలంగాణ నుంచి బోనాలు తీసుకువచ్చిన భక్తబృందం, రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నాయకులు ద్వారకానాథ్, పాలకమండలి సభ్యురాలు వరలక్ష్మి సంప్రదాయబద్ధంగా అమ్మవారికి సారె సమర్పించారు. విజ‌య‌వాడ నగర పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం పాలకమండలి చైర్మన్ సోమినాయుడు, ఈవో సురేష్‌బాబు వారికి ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి ప్రసాదాలను అందజేశారు.

Just In...