Published On: Tue, Jul 7th, 2020

డిమాండ్‌కు అనుగుణంగా ర‌వాణాను పెంచండి

* ద‌.మ. రైల్వే జీఎం గ‌జాన‌న్ మాల్య‌

* ‘రౌండ్ ట్రిప్ ట్రాఫిక్’ కింద తొలిసారి భారతీ సిమెంట్స్ లోడ్ చేసిన వైనం

* యర్రగుంట్ల ప్లాంట్ నుండి శ్రీలంకకు క్లింకర్ ఎగుమతి

* తిరుగు ప్రయాణంలోనూ కృష్ణపట్నం పోర్ట్ నుండి పెట్‌కోక్ దిగుమతి

* స‌రుకు ర‌వాణాలో దూసుకుపోతున్న ద‌.మ‌. రైల్వే

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ప్రారంభించిన రౌండ్ ట్రిప్ ట్రాఫిక్ పథకాన్ని మొదటి సారి యర్రగుంట్ల లోని భారతీ సిమెంట్స్ సైడింగ్ వినియోగించుకున్నది. ఈ పద్ధతిలో సిమెంట్ కంపెనీ యర్రగుంట్ల నుండి కృషపట్నం పోర్ట్ (శ్రీలంకకు ఎగుమతి కోసం) క్లింకర్‌ని లోడ్ చేసింది. అలాగే తిరుగు ప్రయాణంలో కృష్ణపట్నం పోర్ట్ వద్ద యర్రగుంట్ల భారతీ సిమెంట్స్ కోసం పెట్ కోక్ ని దిగుమతి చేసుకుంది. ఇటీవలే సరుకు రవాణా అభివృద్ధికై రైల్వే ‘రౌండ్ ట్రిప్ ట్రాఫిక్’ అనే వినూత్న ఆలోచన ప్రవేశపెట్టి, రోడ్డు మార్గం ద్వారా రవాణా ట్రాఫికను రైల్వే రవాణా వైపు ఆకర్షించడమే ఈ ఆలోచన ముఖ్య ఉద్దేశ్యం. ఈ పద్ధతి ప్రకారం రవాణా వినియోగదారుడు (కన్ సైనర్) తిరుగు ప్రయాణంలో బయలుదేరిన స్టేషన్ కి సరుకు రవాణాకు సమ్మతిస్తే అనగా చేరిన గమ్యస్థానం నుండి గాని లేదా అక్కడి నుండి 200 కి.మీ. దూరంలోని మరో స్టేషన్ నుండైనా – రాకపోకల చార్జీలు ఆయా తరగతిని బట్టి తగ్గించడం జరుగుతుంది. ఇది తిరుగు ప్రయాణం రేక్ 24 గంటలలోగా లోడింగ్ అయిన పక్షంలోనే షరతుకు లోబడి వర్తిస్తుంది. రౌండ్ ట్రాఫిక్ పద్దతి రైల్వేలకు మరియు సురుకు రవాణా వినియోగదారులకు ఇద్దరికీ ప్రయోజనం కలిగిస్తుంది. ఎందుకంటే, సరుకు రవాణా వినియోగదారులకు రవాణా ఖర్చులు తగ్గుతాయి మరియు రైల్వేలకు తిరుగు ప్రయాణం ద్వారా కూడా ఆదాయం సమకూరుతుంది. ఈ నూతన పథకాన్ని వినియోగించుకొని యర్రగుంట్లలోని భారతీ సిమెంట్స్ సైడింగ్ నుండి క్లింకర్‌ని లోడ్ చేసుకొని కృష్ణపట్నం పోర్ట్ కి రవాణా చేసింది. తిరుగు ప్రయాణంలో ఈ కంపెనీ యుఎస్ఏ నుండి వచ్చిన పెట్ కోక్ ని దిగుమతి చేసుకుంది. తత్ఫలితంగా ఈ కొత్త పద్ధతి ద్వారా రవాణా వినియోగదారునికి రూ.8.7 లక్షల లాభం చేకూరింది. అదే సమయంలో రైల్వేకి కూడా రేర్లు ఖాళీగా రాకుండా లోలో రావడం వల్ల రూ. 5 లక్షల ఆదాయం ఆర్జించింది. కడప ప్రాంతం పరిసరాలలో 2 ప్రధానమైన సిమెంట్ క్లస్టర్లు ఉన్నాయి. ఈ కంపెనీలు సాధారణంగా సిమెంట్ మరియు క్లింకర్ ని ఓడరేవులకు రవాణా చేసి అదే సమయంలో రేవుల నుండి బొగ్గు దిగుమతి చేసుకునేవి. నూతన పథకంలో ప్రవేశ పెట్టిన నూతన రాయితీల వల్ల, ఈ ప్రాంతంలోపల బయట గల రవాణా వినియోగదారులు తమకు రైల్వేకి ఉభయులకు ప్రయోజనం చేకూర్చే పద్ధతిని అనుసరించేందుకు శ్రద్ధ కనపరుస్తున్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ఈ వినూత్న ఆలోచనా విధానం పట్ల సరుకు రవాణా వినియోగదారులకు అవగాహన కల్పించి సరుకు రవాణా విభాగానికి అదనపు ఎగుమతుల దిగుమతుల అవకాశాలను అందుకునేలా చేయడంలో కృషిచేసిన గుంతకల్లు డివిజన్ అధికారులు మరియు సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అభినందించారు. ఈ పద్ధతిని చక్కగా వినియోగించుకోవాలని సరుకు వినియోగదారులకు సూచించారు. వ్యాగన్ల డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ పద్ధతి ఎంతో మేలైనదని ఆయన అన్నారు.

Just In...