Published On: Fri, Jul 31st, 2020

విద్యార్థుల ముంగిట్లో విద్యా వారధి

* విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్

* లాంఛనంగా విద్యావారధి వాహనాల ప్రారంభం

* వారిధి వర్కుబుక్స్, గ్రంథాలయ మార్గదర్శకాల పుస్తకాల ఆవిష్కరణ

విజ‌య‌వాడ, సెల్ఐటి న్యూస్‌: కరోనా మహమ్మారి విద్యావ్యవస్థ ప్రణాళిక మొత్తాన్ని చిన్నాభిన్నం చేసిందని, ఆ లోటును తీరుస్తూ విద్యార్థులను చదువు వైపు మొగ్గు చూపేలా ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ప్రభుత్వం ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. శుక్రవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎస్ సీఈఆర్టీ) మరియు రాష్ట్ర విద్యా పరిపాలన శిక్షణా సంస్థ (సీమ్యాట్) సంయుక్తంగా నిర్వహించిన విద్యావారధి వాహనాలను ప్రారంభోత్సవ కార్యక్రమానికి విద్యాశాఖామంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో పాఠశాల విద్యా ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, ఆంగ్ల మాధ్యమ ప్రత్యేక అధికారిణి కె.వెట్రిసెల్వి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా.బి.ప్రతాప్ రెడ్డి, సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్.మధుసూదనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి  ఆదిమూలపు సురేష్ ప్రసంగిస్తూ… ‘‘కోవిడ్ మహమ్మారి ఉధృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో విద్యాసంస్థలన్నీ తెరవలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈ విద్యా క్యాలెండరును, విద్యా వ్యవస్థను ఏదో విధంగా ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత రాష్ర్ట ప్రభుత్వం,
విద్యాశాఖ మీద ఉందన్నారు. అందులో భాగంగా ఆన్ లైన్ విద్య, డిజిటల్ విద్య బోధన ప్రక్రియను ఆసరాగా తీసుకుని ముఖ్యంగా ఉన్నత పాఠశాల విద్యార్థులు విద్యకు దూరం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో పాఠశాలలు మూతప‌డినా, ఉపాధ్యాయులు పాఠశాలలకు రాకపోయినా కూడా మనకు అందివచ్చినటువంటి  సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మాధ్యమాల ద్వారా ముందుకు సాగుతున్నామని అన్నారు.
పిల్లలు ఇంట్లోనే ఇంట్లో కూర్చుని చదువుకోవడం, నేర్చుకోవడం వంటి ప్రక్రియలతో ముందుకు తీసుకుపోవాలనే ఒక అవసరాన్ని గుర్తించామన్నారు. అందుకోసం విద్యావారధి, విద్యామృతం, విద్యాకలశం, అభ్యసన వంటి కార్యక్రమాలకు ప్రారంభించామని, ఆ కార్యక్రమాలకు విద్యార్థుల నుండి, తల్లిదండ్రుల నుండి మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు.

లక్షా 18 వేల మంది విద్యార్థులకు అందుబాటులో…
పట్టణ ప్రాంతాల్లో విద్యార్థులకు మొబైల్ లేదా టీవీ వంటి  సాంకేతిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. పల్లె ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలన్నా అన్ని సౌకర్యాలు ఉండవు. మన రాష్ట్రంలో దాదాపు లక్షా 18వేల మంది విద్యార్థులకు ఎలాంటి సాంకేతిక సౌకర్యాలు లేవని అన్నారు. విద్యాభివృద్ధికి ఇదొక అడ్డంకిగా మారిందన్నారు. మొబైల్ లేదా టీవీ వంటి  సాంకేతిక సౌకర్యాలు ఉన్నవిద్యార్థులను హైటెక్, లోటెక్ విద్యార్థులుగా, ఏమీ లేనివారిని నోటెక్ విద్యార్థులుగా గుర్తించడం జరిగిందన్నారు. టీవీలు, వాట్సప్, యూట్యూబ్ వంటి సాంకేతిక మాధ్యమాలు ఎన్ని ఉన్నా  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం వంటి జిల్లాల్లోని సౌకర్యాలు లేని మారుమూల ప్రాంతాల్లో గుర్తించి ఈ ‘విద్యావారధి’ మొబైల్ వ్యాన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నామని అన్నారు. వీటి ద్వారా రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు రూ.1.20 లక్షల ఖర్చుతో వాహనాలు సిద్ధం చేశామని తెలిపారు. ఈ వాహనాలు గ్రామాలకు వెళ్లి బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటిస్తూ విద్యార్థుల స్థాయిని అనుసరించి విద్యా వారధి పాఠాలు ప్రదర్శించడం జరుగుతుందన్నారు.
పాఠశాలలు పున:ప్రారంభం అయ్యేంతవరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.

ఒకటి నుండి పదో తరగతి వరకు పాఠ్యాంశాలు…
విద్యావారధి మొబైల్ వ్యానులో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలు పొందుపరచడం జరుగుతుందన్నారు. ప్రతి జిల్లాకు విద్యావారధి మొబైల్ వ్యానుతో పాటు ఒక ఉపాధ్యాయుడు, ఒక గ్రంథాలయం జోడిస్తామని తెలిపారు.  దీనిని విద్యార్థులు విస్తృతంగా వినియోగించుకోవాలని, తల్లిదండ్రులు కూడా తమ తమ పిల్లలను ప్రోత్సహించాలని కోరారు.

సెప్టెంబరు 5 పాఠశాలలు పున:ప్రారంభం…
కోవిడ్ లాక్‌డౌన్ వల్ల పదో తరగతి, ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు వంటివి నిర్వహించలేకపోయామని అన్నారు. విద్యా వ్యవస్థ అభివృద్ధి చాలా పనులు చేయాలనుకున్నా అన్ని కోవిడ్ వల్ల వాయిదాలు వేయవలసి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో సీఎం వై.యస్.జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబరు 5న పాఠశాలలు పున:ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు పాఠ్య పుస్తకాలు సిద్ధం చేసి, క్షేత్రస్థాయి పంపించి మిగిలిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.  అలాగే ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న విద్యాకానుక’  పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. అనంతరం ‘విద్యార్థులకు ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్లు’, ‘విద్యావారధి వర్కుషీట్లు’,  కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ  – పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం వారు విడుదల చేసిన ‘గ్రంథాలయ నిర్వహణ నిధిపై మార్గదర్శకాలు & పాఠశాలల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడం’ తెలుగు అనువాద పుస్తకాన్ని విద్యాశాఖామాత్యులు ఆవిష్కరించారు. అనంతరం పుస్తకాలు గురించి మాట్లాడుతూ  ఒక మంచి పుస్తకం గురువులాంటిదని, మనిషి జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులు ఎదుర్కోవడంలో, జీవన శైలి మార్పులో, ఉన్నతిలో ఎంతో తోడ్పడుతుందని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయడానికి పుస్తకాల అవసరం ఉందన్నారు. అందుకు ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట వేయడానికి పాఠశాల గ్రంథాలయం నిర్వహిస్తోందని, దీనిని విద్యార్థులు సక్రమంగా వినియోగించుకునేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అనునిత్యం ప్రోత్సహించాలని కోరారు.

 

Just In...