Published On: Fri, Jul 31st, 2020

కోవిడ్‌ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలపై దృష్టి

* సూక్ష్మస్థాయిలో ఎస్‌ఓపీ

* డిజిటిల్‌ పద్ధతుల్లో ఆ ఆస్పత్రుల్లో బెడ్ల వివరాలు

* ఆస్పత్రి వెలుపల బోర్డులోనూ ప్రకటన

* ప్రతి రెండు గంటలకోసారి అప్‌డేషన్‌

* ప్రతి కోవిడ్‌ ఆస్పత్రిలో హెల్ప్‌ డెస్క్‌

* ప్లాస్మా ఇచ్చే వారికి రూ.5 వేల ప్రోత్సాహకం

* అందుబాటులో అత్యవసర మందులు

* కోవిడ్‌పై సమీక్షా సమావేశంలో సీఎం వైయస్ జగన్‌

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: కోవిడ్‌ సోకిన వారికి మరింత మెరుగైన చికిత్స, సేవలపై దృష్టి పెట్టాలని సీఎం వైయస్ జగన్‌ అధికారులను ఆదేశించారు. కోవిడ్‌ చికిత్స కోసం ఎంపిక చేసిన 138 ఆస్పత్రుల్లో సూక్ష్మస్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆయన కోరారు. చికిత్స, మందులు, ఆహారం, పారిశుద్ధ్యం.. ఈ నాలుగు అంశాలపై గట్టి పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆస్పత్రుల్లో భర్తీ అయిన బెడ్లు, ఖాళీ అయిన బెడ్ల వివరాలను ఆస్పత్రి వెలుపల బోర్డు ద్వారా తెలియజేయాలన్నారు. అంతేకాక ఆ వివరాలను డిజిటిల్‌ పద్ధతుల్లో అన్ని కోవిడ్‌ ఆస్పత్రులకూ అందుబాటులో ఉంచాలన్నారు. కొన్నిపరిస్థితుల్లో కోవిడ్‌ సోకిన వ్యక్తి ఆస్పత్రికి వచ్చినప్పుడు బెడ్లు అందుబాటులో లేకపోతే, అక్కడే ఉన్న హెల్ప్‌డెస్క్‌ బాధ్యత తీసుకుని సమీప ఆస్పత్రిలో బెడ్‌ను కేటాయించాలని, దీని కోసం కోవిడ్‌ ఆస్పత్రుల్లో హెల్ప్‌ డెస్క్‌లను మరింత బలోపేతం చేయాలన్నారు. ఆరోగ్యమిత్రలను హెల్స్‌
డెస్క్‌లో ఉంచాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్లాస్మా థెరఫీ కారణంగా సానుకూల ఫలితాలు వస్తుంటే, దాన్ని ప్రోత్సహించాలన్న సీఎం, ప్లాస్మా ఇచ్చే వారికి రూ.5 వేలు ఇవ్వాలని ఆదేశించారు. కోవిడ్‌ నివారణా చర్యల్లో భాగంగా సీఎం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష చేశారు. ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఆ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి తదితర అధికారులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌విస్తృతి, నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు, ముఖ్యమంత్రికి వివరించారు. దేశవ్యాప్తంగా మరణాల రేటు 2.21 శాతం ఉంటే… రాష్ట్రంలో 0.98 శాతం ఉందని వివరించారు. పాజిటివిటీ రేటు కూడా దేశ వ్యాప్తంగా 8.71 శాతం అయితే, రాష్ట్రంలో 6.91 శాతం ఉందని వెల్లడించారు. రానున్న రోజుల్లో మరణాల రేటును మరింత తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైరస్‌ వ్యాప్తి, మరణాలు అధికంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఆయా జిల్లాలపై నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు ఇతరత్రా అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని సీఎంకు అధికారులు వివరించారు. రాష్ట్రంలో కోవిడ్‌ కారణంగా మరణించిన వారి ఆరోగ్య పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న తర్వాత రెండు మూడు రోజులుగా జ్వరం ఉండి, శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న వారిని పరీక్షలతో లేకుండా నేరుగా వారిని ఆస్పత్రిలో చేర్పించడానికి నిర్ణయించామని, దీన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్టుగా వివరించారు. అలాగే నిర్దేశించుకున్న ఆస్పత్రుల్లో సిబ్బంది పెంపు చర్యలు చేపట్టామన్నారు. సమీక్ష సందర్బంగా ముఖ్యమంత్రి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్‌ చికిత్స కోసం నిర్దేశించుకున్న ఆస్పత్రులు, వాటిలో బెడ్లు, ఖాళీలు తదితర అంశాలపై సీఎం అధికారుల నుంచి సమాచారాన్ని తెలుసుకున్నారు. మొత్తం 138 ఆస్పత్రుల్లో 36,778 బెడ్లు ఉన్నాయని, ఇందులో 14,450 బెడ్లలో చికిత్స పొందుతున్నారని వివరించారు. 70,446 యాక్టివ్‌ కేసులు ఉండగా, ఇందులో 14042 మంది ఆస్పత్రుల్లోనూ, 18,753 మంది కోవిడ్‌ కేర్‌ సెంటర్లలోనూ (క్వారంటైన్‌ సెంటర్లు), 35,660 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని అధికారులు వివరించారు. ఆక్సిజన్‌ లేదా వెంటిలేటర్‌ తరహా చికిత్స పొందుతున్న వారు 3,541 మంది అని వివరించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్‌ కేసుల్లో గురువారం ఒక్క రోజే 1436 మంది డిశ్చార్జి అయ్యారని సీఎంకు
తెలిపారు. ఆక్సిజన్‌ బెడ్ల వివరాలను కూడా సీఎం ఆరా తీశారు. మొత్తంగా 28,911 బెడ్లను సిద్ధం చేస్తున్నామని అధికారులు చెప్పారు.
ఆస్పత్రుల్లో బెడ్ల కేటాయింపు, భర్తీ అయినవి, ఖాళీగా ఉన్నవాటి విషయంలో మెరుగైన విధానాన్ని పాటించాలని సీఎం ఆదేశాలు
జారీ చేశారు. కోవిడ్‌ కోసం నిర్దేశించిన మొత్తం ఆస్పత్రుల్లో డేటా అంతా డిజిటిల్‌ పద్ధతుల్లో ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు ఈ డేటాను అప్‌డేట్‌ చేస్తూ అన్ని ఆస్పత్రుల్లోని హెల్ప్‌ డెస్క్‌లకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అంతేకాక ప్రతి కోవిడ్‌ ఆస్పత్రి వెలుపల బ్లాక్‌ బోర్డుపై భర్తీ అయిన బెడ్లు, ఖాళీ అయిన బెడ్ల వివరాలను ఒక బ్లాక్‌ బోర్డులో వెల్లడించాలన్నారు. ఎవరికైనా బెడ్‌ అందుబాటులో లేదంటే సమీపంలోని ఆస్పత్రిలో బెడ్‌ను అక్కడే ఉన్న హెల్ప్‌ డెస్క్‌ ద్వారా జరగాలని సీఎం ఆదేశించారు. దీని కోసం హెల్ప్‌ డెస్క్‌లను బలోపేతం చేయాలని, ఆరోగ్యమిత్రలను అక్కడ పెట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వారికి ఓరియంటేషన్‌ ఇవ్వడం, ఓపికతో వ్యవహరించేలా చూడాలన్నారు. హెల్ప్‌ డెస్క్‌ ప్రభావవంతంగా పని చేస్తే చాలా వరకు సమస్యలు సమసిపోతాయని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోవిడ్‌ ఆస్పత్రుల్లో అందించే సేవల్లో మెరుగైన యాజమాన్య పద్ధతులు అవలంబించాలని సీఎం ఆదేశించారు.
సూక్ష్మస్థాయిలో అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, దీని కోసం రూపొందించిన ఎస్‌ఓపీని కచ్చితంగా పాటించేలా చూడాలన్నారు. ఈ ఆస్పత్రుల్లో సమస్యలపై హెల్ప్‌లైన్‌ ద్వారా ఎవరైనా నివేదిస్తే దాన్ని పాజిటివ్‌గా తీసుకుని వాటిని పరిష్కరించాలన్నారు. బెడ్లు, వైద్యం, మందులు, ఆహారం, పారిశుద్ద్యం బాగుందా? లేదా? అన్నది ఎప్పటికప్పుడు రిశీలించాలన్నారు. జీజీహెచ్‌ లాంటి ఆస్పత్రుల్లో ఈ అంశాలపై మరింత శ్రద్ధ పెట్టాలన్నారు. ఈ ఆస్పత్రుల్లో సమర్థవంతమైన సిబ్బందిని పెట్టాలని, జేసీలు
దీనిపై ఫోకస్‌ పెట్టాలని సీఎం ఆదేశించారు. ఇంకా రాబోయే రోజుల్లో కాల్‌ సెంటర్స్‌ పని తీరు, కోవిడ్‌ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలపై దృష్టి
పెట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని, దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం ఆదేశించారు.
పోస్టర్లు, హోర్డింగులు, టీవీల్లో దీనిపై అవగాహన కలిగించేలా, ప్రజల్లో భయాందోళన పోగొట్టేలా ప్రచారం నిర్వహించాలన్నారు. కోవిడ్‌ నివారణా చర్యలు, అందుతున్న వైద్యం, చికిత్సలపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు ఇస్తే.. ఎప్పటికప్పుడు వాటిని ఖండించాలని ముఖ్యమంత్రి అన్నారు. లేకుంటే వీటిని ప్రజలు నిజం అనుకునే అవకాశాలుంటాయని పేర్కొన్నారు. అందుకనే వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలన్నారు. ఒకవేళ వచ్చిన కథనాల్లో వాస్తవాలు ఉంటే.. వాటిని సానుకూలంగా తీసుకుని ఆ సమస్యలను పరిష్కరించాలని, ఒక వేళ తప్పుడు కథనాలు ఉంటే వెంటనే ఖండించాలని ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని, ప్లాస్మా థెరఫీతో మంచి ఫలితాలు ఉంటే, దానిపై అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. బాగా ఉపయోగపడితే.. దీన్ని ప్రోత్సహించాలని, ప్లాస్మా ఇచ్చే వారికి రూ.5 వేలు ఇవ్వాలన్నారు. మంచి భోజనం, ఇతరత్రా ఆరోగ్యపరమైన అవసరాల కోసం ఈ ప్రోత్సాహకం ఉపయోగపడుతుందన్నారు.
సెప్టెంబరు 5 నుంచి స్కూళ్లు తెరిచే ప్రయత్నాలు చేస్తున్నామని, విద్యాకానుకతో పాటు.. పిల్లలకు మాస్కులు కూడా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. మాస్కులు ఎలా వాడాలన్న దానిపై వారికి అవగాహన కూడా కల్పించాలన్నారు. సమీక్షా సమావేశం ముగిసిన తర్వాత ప్రజారోగ్య రంగం బలోపేతానికి చేపడుతున్న నాడు–నేడు కార్యక్రమాలపై సీఎం సమీక్షించారు. కోవిడ్‌ లాంటి విపత్తులను భవిష్యత్తులో ఎదుర్కోవాలంటే.. ప్రజారోగ్య వ్యవస్థ బలంగా ఉండాలన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్, ఇతర ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమం పురోగతిపై సీఎం సమీక్షించారు. మూడేళ్లలో కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం పూర్తి కావాలని సీఎం అధికారులకు నిర్దేశించారు. ఉన్న కాలేజీల్లో నాడు–నేడు కోసం, వీటితో పాటు కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో టెండర్లు పిలుస్తున్నట్టు అధికారులు తెలిపారు. వీటి నిర్మాణాల కోసం స్థలాల గుర్తింపు పూర్తి చేయాలని ఆదేశించారు.

 

Just In...