Published On: Sat, Aug 1st, 2020

భూములిచ్చిన రైతులకు ముఖ్య‌మంత్రి సమాధానం చెప్పాలి

* నేటి నుండి మహిళా జెఏసీ నిరసన కార్యక్రమాలు

* ముందు నుండి వైసిపి, వెనుక నుండి బిజేపి వెన్నుపోటు పొడిచాయి

* అమరావతి పరిరక్షణ సమితి మహిళా జెఏసీ నేత‌లు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు సమాధానం చెప్పిన తరువాతే రాజధానిని తరలించాలని అమరావతి పరిరక్షణ సమితి మహిళా జెఏసీ కన్వీనర్, సిపిఐ కృష్ణాజిల్లా కార్యదర్శి అక్కినేని వనజ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని డిమాండ్ చేశారు.

         విజయవాడలోని అమరావతి పరిరక్షణ సమితి జెఏసీ కార్యాలయంలో శనివారం మహిళా జెఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా వనజ మాట్లాడుతూ మహిళలకు ఇష్టమైన వరలక్ష్మీ వ్రతం రోజున‌ గవర్నర్ రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఆమోదం తెలపడం చీకటి రోజు అన్నారు. కర్నూలుకు హైకోర్టు ఇచ్చినంత‌ మాత్రాన రాయలసీమ అభివృద్ధి జరగదని రాయలసీమ ప్రజలు ఈ నిర్ణయాన్ని ఆహ్వానించడం లేదన్నారు. విశాఖపట్నంలో కొత్తగా అభివృద్ధి చేయాల్సింది ఏమి లేదని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్దతు ఇచ్చి ఇప్పుడు రాజధానిని చంపుతారా అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు రెండు నాల్కోల ధోరణలో మాట్లాడి అమరావతి రైతులను అయోమయంలోకి నెట్టందని, కేంద్ర ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏమి చేయదలిచారో బహిర్గతం చేయాలని కోరారు. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానికి రాజధాని తరలించమని ఆఫీడివిట్ ఇచ్చి బిల్లును ఆమోదించడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

         కన్వీనర్, కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ ప్రజలను వైసీపీ ముందు నుండి ద్రోహం చేస్తే వెనుక నుండి బీజేపీ, జనసేన వెన్నుపోటు పొడిచాయని ఆరోపించారు. ప్రధాని శంఖుస్థాపన చేసిన అమరావతికే ఈ దుస్థితి వస్తే అయోధ్యలో రామ మందిరానికి శంఖుస్థాపన చేస్తే ఇంకెలా ఉంటుందోన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయోధ్యలో రామమందిరం శంఖుస్థాపనకు వెళ్ళేముందు అమరావతి రాజధానిగా ఉంటుంద‌ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. జగన్ విశాఖలో అడుగు పెడితే విశాఖ శ్మ‌శానం అవ్వడం ఖాయమ‌ని ఇక విశాఖ ప్రజలను ఆ దేవుడే కాపాడాలని అన్నారు.

         తెదేపా నాయకురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ మనకు అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టడం రాష్ట్రానికి మంచిది కాదని, అమరావతి 5 కోట్ల ప్రజల కళ అని, ఇందుకోసం 33 వేల ఎకరాలను రైతులు వారి భూములను త్యాగం చేశారన్నారు. అమరావతి రాజధానిగా ఉండాలని పవన్ కళ్యాణ్, సోము వీర్రాజు ప్రకటించారని ఇప్పుడు అందరం కలిసి ప్రభుత్వంపై పోరాటం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేవినేని అపర్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గెలిపించినందుకు ఈ విధంగా కక్షపురితంగా వ్యవహరించడం సబబేనా అని ప్ర‌శ్నించారు. మీరు రాజధాని పెట్టుకోవాలంటే ఒక్కచోట పెట్టుకోండి.. మూడు రాజధానులు అని చెప్పి ప్రజలను మోసం చేయవద్దు అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వం కాలయాపన చేయడానికే వికేంద్రీకరణ అనే నాటకం ఆడుతున్నారు. కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. మహిళా సభ్యులు లోక్‌సత్తా నాయకురాలు నార్ల మాలతి, యార్లగడ్డ సుచిత్ర మాట్లాడుతూ విశాఖపట్నం రాజధాని అన్నప్పుడు నుండి అశుభాలు జరుగుతున్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వెళితే విశాఖపట్నం మొత్తం నాశనం అవుతుందన్నారు. అనంతరం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని.. డౌన్ డౌన్ సియం అని నినాదాలు చేశారు.

నేటి నుండి మహిళా జెఏసీ ఆధ్వర్యంలో నిరసనలు…
మహిళా జెఏసీ ఇచ్చే పిలుపు మేరకు కోవిడ్ నిబంధనలు పాటించి 13 జిల్లాలోని మహిళలు తమ నిరసనను జయప్రదం చేయాలని కోరారు. ఆదివారం ఉదయం నిరసనలు, సోమవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా బిజేపి, జనసేన, వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలకు, నాయకులకు రాఖీలు కట్టి తమ నిరసన తెలపాలని కోరారు.

Just In...