Published On: Sat, Aug 1st, 2020

ఏపీ ప్రజలను మరోసారి మోసం చేస్తున్న బిజెపి

* సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శ

విజ‌య‌‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: ఏపి రాజధాని అమరావతి విషయంలో బిజెపి గోడమీద పిల్లి వైఖరి అవలంభిస్తుంద‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయ‌న శ‌నివారం ఒక ప్రకటన  విడుదల చేశారు. ఏపికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో బిజెపి రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. ఇప్పుడు అమరావతి విషయంలో మరోసారి మోసానికి తెరతీసింది. గతంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అంశాల విషయం పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు ఎవీకి 19 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని బిజెపి కోరింది. 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా నరేంద్రమోదీ తిరుపతిలో ప్రసంగిస్తూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. తదనంతర కాలంలో అదే బిజెపి నేతలు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చెప్పారు. అమరావతి రాజధానికి ప్రధాని మోదీ శంఖుస్థాపన చేసినప్పుడు రాష్ట్రంలో టిడిపి, బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది. అప్పుడు అమరావతిని రాజధానిగా అంగీకరించి, రూ.1500 కోట్లు విడుదల చేసిన కేంద్రం ఇప్పుడు అమరావతిని రాజధానిగా కొనసాగించేందుకు ఎందుకు జోక్యం చేసుకోదని ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం 3 రాజధానుల ప్రకటనతో మొదలైన అమరావతి ఉద్యమంలో రాష్ట్రానికి చెందిన బిజెపి నాయకులు ప్రత్యక్షంగా పాల్గొని మదతు తెలిపారు. కానీ.. ఢిల్లీలో మాత్రం అమరావతి రాజధాని అంశంపై కేంద్రం జోక్యం చేసుకోదని కప్పదాటు వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇది బిజెపి రెండు నాల్కల ధోరణికి తార్కాణం. ఏ రాష్ట్రాల్లోనైనా తాము అధికారంలోకి వచ్చే అవకాశాలంటే ఎన్ని కుట్రలు, కుయుక్తులు చేసైనా అక్కడి ప్రభుత్వాల్ని కూల్చేందుకు శాయశక్తులా కృషిచేసే బిజెపి నాయకత్వం అభివృద్ధిలో మాత్రం నోరు విప్పకుండా గోడమీద పిల్లిలా వ్యవహరించడం దుర్మార్గం. పైగా ఎపీలో ‘మేమే ప్రత్యామ్నాయం’ అంటూ బిజెపి, జనసేన కలిసి అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. బిజెపి ఏపీలో కుట్రకు తెరలేపుతోంది. బిజెపి కుటిల నాటకాలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కనీసం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగేటట్లు చూడాల‌ని లేని పక్షంలో బిజెపి కూడా ప్రజాగ్రహానికి గురికాక తప్పద‌ని హెచ్చ‌రించారు.

Just In...