Published On: Sat, Aug 8th, 2020

దిగ్విజయంగా ఆగష్టు 15 వేడుకలను నిర్వహిస్తాం

* కోవిడ్ మార్గదర్శకాలకు లోబడి ఏర్పాట్లు చేయాల‌ని సీఎం ఆదేశం

* మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

విజ‌య‌వాడ, సెల్ఐటి న్యూస్‌‌: ఆగష్టు 15 వేడుకలను విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న‌ట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిస్తార‌ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరాపు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఇందిరాగాంధీ స్టేడియంలో వేడుకల ఏర్పాట్లను శుక్రవారం ప్రజాప్రతినిధులు, ఉన్నతస్థాయి అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. అనంత‌రం మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో మార్గదర్శకాలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరిస్తారు తెలిపారు, ఈ నేపథ్యంలో ఏర్పాటు పరిశీలించడం జరిగిందని ఉన్నతస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు తగు సూచనలను చేయడం జరిగిందన్నారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలు, ప్రదర్శించే శకటాల విషయంలో ప్రోటోకాల్, కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తొలిసారిగా ఏర్పాటు విషయంపై క్షేత్రస్థాయిలో చర్చించడం జరిగిందనీ మరో దఫా  ఉన్నతస్థాయి అధికారులతో ఈ నెల 13, 14 తేదీలలో పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ఆగష్టు 15వ తేదీన నిర్వహించే వేడుకల ప్రత్యక్ష ప్రసారం ద్వారా రాష్ట్రంలోని ప్రజలందరకూ తిలకించేందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
జిల్లా కలెక్టరు ఏ.ఎం.డి.ఇంతియాజ్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఆహ్వానితులను పరిమిత స్థాయిలోనే ఆహ్వానిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కరోనా నేపధ్యంలో చేపట్టిన కార్యక్రమాలను ప్రతిబింబించే విధంగా వాటిపై రూపొందించిన శకటాల ప్రదర్శనను పరిమితం చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా కవాతుల ప్రదర్శన సందర్భంగా కూడా భౌతిక దూరాన్ని పాటించడం జరుగుతుందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనల విషయంలో కరోనా నేపథ్యంలో కష్టసాధ్యమని ఆయన తెలిపారు. పోలీసు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం వివిధ శాఖల అధికారులు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో చేపట్టాల్సిన పనులు, ప్రొటోకాల్ కార్యక్రమాలను, ఆహ్వానితుల వచ్చేందుకు మార్గాలు తదితర అంశాల
రూట్‌మ్యాప్‌పై చర్చించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, శాసనసభ్యులు జోగి రమేష్, మునిసిపల్ కమీషనరు ప్రసన్న వెంకటేష్, నగర పోలీసు కమీషనరు బత్తిన శ్రీనివాసులు, డిసిపి హర్షవర్ధన్ రాజు, విక్రాంత్ పాటిల్, సమాచార శాఖ జెడి పి.కిరణ్‌కుమార్, స్థానిక నాయకులు దేవినేని అవినాష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Just In...