Published On: Sun, Aug 9th, 2020

కరోనా కట్టడిలో ప్ర‌భుత్వం విఫలం…

* ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరపాలి

* ఇతర ఎజెండాలు పక్కన పెట్టి కరోనాపై మాత్రమే దృష్టి కేంద్రీకరించాలి

* సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరపాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా ఇతర ఎజెండాలను పక్కన పెట్టి కరోనా నియంత్రపట్ల కేంద్రీకరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయ‌న ఆదివారం ప్రకటన విడుదల చేశారు. కరోనా విపత్తును నియంత్రించడానికి, కరోనా రోగులకు సమగ్ర వైద్యాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ చేపట్టిన చర్యలు మందకొడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు రోగులు లక్షలాది రూరపాయలు వెచ్చించి ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్ ను ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి లీజుకు తీసుకున్న కోవిడ్ కేర్ సెంటర్‌లో ఈ రోజు తెల్లవారుఝామున అగ్ని ప్రమాదం సంభవించి 10 మంది మరణించగా మరో ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఇది హృదయ విదారకమైన సంఘటన.
మృతులకు సిపిఐ తరఫున ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలుపుతున్నాం. ఈ హోటలను నిబంధనలకు విరుద్ధంగా కోవిడ్ ఆస్పత్రిగా మార్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ వైద్యం కోసం రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు అనుమతినిస్తూ వైద్యానికి రేట్లను నిర్ణయించింది.. దీంతో విజృంభించిన కార్పొరేట్ ఆసుపత్రులు ఒకొక్క కరోనా రోగి నుండి రూ.10 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. అదేమంటే ప్రభుత్వ వైద్యానికి, తమ వైద్యానికి తేడా ఉందనే సాకు ప్రైవేటు ఆసుపత్రులు చూపుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులలో హెల్త్ కార్డులు, ఈఎన్ఏ, ఆరోగ్యశ్రీ పథకాలు వర్తింప చేయకుండా పేషెంట్ల నుండి విపరీతంగా డబ్బు వసూలు చేస్తున్నారు. స్వర్ణ ప్యాలెస్కు ఫైర్ సేఫ్టీ అనుమతులు లేవని అధికారులు చెబుతున్నారు. దీనిని బట్టి అధికారుల నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి కారణంగా ఉంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నాము. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విపరీతంగా పెరిగిపోతోంది. భారతదేశంలోనే 3వ స్థానంలోకి వచ్చింది.
ప్రతిరోజూ 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ వైద్యానికి నెలకు రూ.350 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెబుతున్నప్పటికీ రోగులకు, క్వారంటైన్‌లో ప్రజలకు సరైన ఆహారం, వైద్యం అందడం లేదు. స్వయంగా అధికారపార్టీ ఎమ్మెల్యేలే కోవిడ్ ఆసుపత్రులలో లోపాలను ఎత్తి చూపుతున్నారు. సాక్షాత్తూ మంత్రులు, ఎమ్మెల్యేలే కరోనా వైద్యం కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లారు. కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇంతటి ప్రమాదకర పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం పలు వివాదాస్పద అంశాల పైనే దృష్టి కేంద్రీకరించింది. ఎప్పుడెప్పుడు రాజధానిని విశాఖ తరలిద్దామా అనే ఆత్రుత తప్ప ప్రజల ప్రాణాలపై ఏ మాత్రం శ్రద్ధ లేకపోవడం విచారకరం. ఇదే విధంగా కరోనా కట్టడిలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తే కరోనా మరణాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాల్సి వస్తుంది. ఇప్పటికైనా వివాదాస్పద ఎజెండాలను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టాలి. ప్రజల ఆరోగ్యమే ఎజెండాగా ముందుకు సాగాలి. కరోనా నియంత్రణ పై దృష్టి కేంద్రీకరించాలని కోరుతున్నాం.

Just In...