Published On: Sun, Aug 9th, 2020

బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

* ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాల‌కు రూ.50 లక్షల పరిహారం

* మృతుల్లో ముగ్గురు మహిళలు, ఏడుగురు పురుషులు

* 48 గంటల్లో విచారణ నివేదిక, ఇందుకోసం రెండు కమిటీలు

* ప్రజలు ప్రభుత్వం నిర్వహించే కోవిడ్ ఆసుపత్రులలోనే చికిత్స పొందాలి

* ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్‌లో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదం దురదృష్టకరమని, ప్రమాదానికి నిర్లక్ష్యం కారణమైతే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ సృష్టం చేశారు. విజయవాడలోని కలెక్టరు క్యాంపు కార్యాలయం ఆవరణలో హోంమంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర మం‌త్రులు పేర్ని వెంకట్రామయ్య వెలంపల్లి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణతో కలిసి మంత్రి ఆళ్ల నాని విలేఖరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్ర‌మాద ఘటన తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి తీవ్ర దిగ్ర్భాంతి
వ్యక్తం చేసి మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారన్నారు.

అదేవిధంగా ఘటనలో గాయపడినవారిని మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారన్నారు. ఈ ఘటనలో బాధ్యులైన వారు ఎంత ఉన్నతస్థాయిలో ఉన్నా ఉషేక్షించవద్దని సీఎం తెలిపారన్నారు. వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం జ‌గ‌న్ ఆదేశించార‌ని మంత్రి తెలిపారు. ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాల‌కు రూ.50 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించడం జరిగిందన్నారు.

ఘటనపై తక్షణం విచారణ జరిపించి 48 గంటలలో నివేదికను తెప్పించుకొని పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి తెలియజేశారు. పూర్తి స్థాయి విచారణ కోసం రెండు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని వైద్య రంగానికి సంబంధించి ఆరోగ్యశ్రీ సిఈవో, మల్లిఖార్జున్, మెడికల్ హెల్త్ డైరెక్టర్ డా.అరుణకుమారితో ఒక కమిటీని వేయడం జరిగిందన్నారు. అదేవిధంగా షార్ట్ సర్క్యూట్‌కు సంబంధించి హోం, విద్యుత్ తదితర శాఖలతో మరొక కమిటీని నియమించిన‌ట్లు తెలిపారు. కోవిడ్ వివత్కర పరిస్థితుల్లో కోవిడ్ కేర్ సెంటర్ల నిర్వహణకు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు స్వచ్చందంగా భాగస్వాములవడానికి ముందుకు వచ్చాయని అందుకు అనుగుణంగా జిల్లాస్థాయిలో అనుమతులివ్వడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఐసియంజర్ మార్గదర్శకాలకు అనుగుణంగానే ప్రైవేటు ఆసుపత్రుల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొని అనుమతులిచ్చామని అయితే స్వర్ణ ప్యాలెస్ హోట‌ల్‌లో రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేర్ సెంటర్‌లో మార్గదర్శకాల ఉల్లంఘన జరిగిందని తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయిందన్నారు. విజయవాడ నగరంలో ఎటువంటి 16 కేర్ సెంటర్లు నిర్వహించడానికి ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతిచ్చారని వాటి నిర్వహణ విషయాన్ని పరిశీలించడం జరుగుతుందని పేర్కొన్నారు. కేవలం స్వల్ప లక్షణాలున్న బాధితులకు మాత్రమే ఈ కేంద్రాల ద్వారా చికిత్సకు అనుమతి ఉందని, కోవిడ్ లక్షణాలున్న బాధితులకు కోవిడ్ కేర్ సెంటర్లలోను, తీవ్ర లక్షణాలున్న వారికి కోవిడ్ ఆసుపత్రులలో మాత్రమే చికిత్సను అందించాల్సి ఉంటుందన్నారు. కరోనా వ్యాధి లక్షణాలు ఉంటే వారి సమీపంలోని ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్లు, కోవిడ్ ఆసుపత్రులలో మాత్రమే చికిత్స పొందాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో 188 కోవిడ్ ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు ప్రభుత్వం సుమారు 20 వేల మంది దాక్టర్లను నియమించుకోవడం జరిగిందన్నారు. కోవిడ్ బాధితులకు అర గంటలోనే బెడ్ అందించే
ఏర్పాట్లు చేస్తున్నామన్నారు వైద్య సేవలు, మందులు, ఆహారం, వసతులు వంటి వాటి నిర్వహణలో చిన్నచిన్న లోపాలుంటే తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఉదయం 4-45 నిముషాల నుండి 5 గంటలలోపు అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ డిపార్టుమెంటు వారికి 5-09 నిమిషాలకు ఫోన్ వచ్చిందన్నారు. కొద్ది నిముషాల వ్యవధిలోనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని 18 మందిని కాపాడగలిగారన్నారు.

రమేష్ ఆసుపత్రి వారికి స్వర్ణ ప్యాలెస్ లో 40 బెడ్ల నిర్వహణ కోసం అనుమతిచ్చామన్నారు. హోటల్ లో మొత్తం 31 మంది చికిత్స పొందుతున్నారని వారిలో 10 మంది మరణించగా 15 మందిని రమేష్ ఆసుపత్రికి తరలించార‌ని వారి ప్రాణాలకు ఎటువంటి అపాయం లేదన్నారు. మిగిలిన ఆరుగురు వారి వారి ఇళ్ళకు వెళ్ళి సురక్షితంగా ఉన్నారన్నారు. మాటలకు సంబంధించిన ఆరుగురు, ఆసుపత్రికి సంబంధించిన ఏడుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారన్నారు.

Just In...