Published On: Sun, Aug 9th, 2020

ప్ర‌జ‌ల్లో ఐక్య‌త‌ను పెంచేలా అమ్మవారి బోనాల జాతర

* ఎమ్మెల్యే గద్దె రామమోహన్

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: అమ్మవారి బోనాల జాతర కార్యక్రమం ప్రజల్లో ఐక్యతను పెంచుతుంద‌ని, భక్తిభావంతో చేసే ఇటువంటి కార్యక్రమాలు భక్తుల్లో మంచి సాంప్రదాయలు, సద్గుణాలు వెల్లివెరిసే విధంగా ఉండేందుకు ఎంతో దోహదపడతాయని విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం శాసనసభ్యులు గద్దె రామమోహన్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 18వ డివిజన్ రాణిగారితోటలోని కనకదుర్గమ్మ అమ్మవారి బోనాల కార్యక్రమంలో ఆయ‌న ముఖ్య అతిధిగా పాల్గొని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో రాణిగారితోటలో వడ్డెర కులంవారు బోనాల కార్యక్రమం నిర్వహించటం, వారితో పాటు స్థానికులు కూడా పెద్దఎత్తున కార్యక్రమంలో పాల్గొని బోనాలు సమపర్పించటం అభినందనీయమని, ఇటువంటి కార్యక్రమాలు స్థానికులందరూ ఐక్యంగా ఉండేందుకు తోడ్పడతాయని తెలిపారు.
కనకదుర్గమ్మ అందరినీ చల్లగా చూడాలని గద్దె రామమోహన్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్థానికులు ఉదయం 11 గంటల వరకే వ్యాపారాలకు అనుమతిస్తున్నారని, తమకు సాయంత్రం వరకు వ్యాపారాలు చేసుకునేందుకు అధికారులతో మాట్లాడి అనుమతి ఇప్పించాలని కోరగా, కరోనా వైరస్ కృష్ణలంక ఏరియాలో ఉదృతంగా ఉందని, వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని, కరోనా నుంచి రక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని, వ్యాపారుల విషయంలో అధికారులతో మాట్లాడి ఎవరికీ ఇబ్బంది లేకుండా వ్యాపారాలు చేసుకునేదిశలో పరిష్కరిస్తానని గద్దె రామమోహన్ తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షుడు వేముల దుర్గారావు, మైలవరపు పీరుబాబు, మర్రి వెంకటసుబ్బయ్య, కొమరి శ్రీను, రాంబాబు, వెంకట్, డి.శ్రీను, ప్రసాద్, నాగయ్య, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

Just In...