Published On: Tue, Aug 11th, 2020

తూర్పు నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యం…

* శాసనసభ్యులు గద్దె రామమోహన్
విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: తూర్పు నియోజకవర్గం అభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నానని, గత తెలుగుదేశం ప్రభుత్వం హ‌యాంలో రామలింగేశ్వరనగర్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం శాసనసభ్యులు గద్దె రామమోహన్ తెలిపారు. మంగళవారం ఉదయం సమస్యల పరిష్కారంలో భాగంగా 15వ డివిజన్ రామలింగేశ్వరనగర్ కృష్ణవేణి రోడ్డు ఏరియాలో పర్యటించి స్థానికుల నుంచి సమస్యలు తెలుసుకున్నారు.
అనంత‌రం ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ రామలింగేశ్వరనగర్‌లో గత తెలుగుదేశం హయాంలో రూ.15 కోట్లతో రోడ్లు, డ్రెయిన్లు నిర్మాణం పనులు, విద్యుత్ పనులతో పాటు పలు అభివృద్ధి పనులు చేయటం జరిగిందని చెప్పారు. అలాగే కృష్ణవేణి రోడ్డు, ఎస్.ఆర్.రోడ్డు, వి.ఎం.రంగా రోడ్డు, నీలవేణి రోడ్డు, సాయిరాం కట్ పీసెస్ రోడ్డు, యర్రపోతు వారి వీధులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు లేక పలు ఇబ్బందులు పడుతుంటే నగరానికి రు.39 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు కేటాయిస్తే దానిలో భాగంగా ప్రధమ ప్రాధాన్యంగా ఈ ఆరు రోడ్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు రోడ్లకు నిధులు మంజూరు చేయించటం జరిగిందని, సగం పనులు పూర్తి అయ్యాక ఎన్నికలు రావడం, పనులు ఆగిపోవడం, వైసిపి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోవడంతో పని కుంటుపడిందని, కాంట్రాక్టర్ తో మాట్లాడటం జరిగిందని, రెండు మూడు రోజుల్లో పనులు ప్రారంభించి త్వరలో పనులు పూర్తి చేస్తారని ఈ రోడ్డులోని వారంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు తప్పనిసరిగా తీసుకోవాలని గద్దె రామమోహన్ కోరారు. రామలింగేశ్వరనగర్ నుంచి భూపేష్‌గుప్తా నగర్ వరకు రిటైనింగ్ వాల్ రు.165 కోట్లతో ఏర్పాటు చేయడం జరిగిందని దీనివల్ల రామలింగేశ్వరనగర్ వాసులంతా కృష్ణనదికి వరద వచ్చినా ప్రశాంతంగా జీవించేందుకు కృషి చేశామన్నారు. అలాగే భూపేష్ గుప్తా నగర్ నుంచి తారకరామానగర్, రణదీవెనగర్ వరకు రిటైనింగ్ వాల్ నిర్మించాల్సి ఉందని, ఇటీవల కాలంలో కొంతమంది మంత్రులు వచ్చి రిటైనింగ్ వాల్ త్వరలోనే నిర్మిస్తామని హామీలు ఇచ్చారని, దాంట్లో భాగంగా ఇళ్ళు పీకేందుకు కొలతలు పెట్టారని, ఇళ్ళు ఏమీ కదల్చకుండానే రిటైనింగ్ వాల్ కట్టాలని, ఇళ్ళు తీసివేసే ఆలోచన మానుకోవాలని గద్దె రామమోహన్ ప్రభుత్వాన్ని కోరారు. రామలింగేశ్వరనగర్ గాయత్రి రోడ్డులో గల కమ్యూనిటీ హాలు స్థలంలో వి.ఎం.రంగా కళ్యాణ మండపం కట్టేందుకు రూ.1.10 కోట్లు మంజూరు చేయించి శంకుస్థాపన కూడా చేయడం జరిగిందని, కానీ ఎన్నికల కోడ్ వచ్చి పని జరగలేదని, కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ఆ నిధులను క్యాన్సిల్ చేయడం జరిగిందని, వి.ఎం.రంగా కళ్యాణ మండపం కట్టే బాధ్యతను తాను తీసుకుంటానని గద్దె రామమోహన్ స్థానికులకు హామీ ఇచ్చారు. నేనేదో ప్రజలలో తిరగనట్లు, అభివృద్ధి అంతా ఈ సంవత్సరంలోనే జరిగినట్లు కొంత మంది ప్రచారం చేసుకుంటున్నారని, తూర్పు నియోజకవర్గంలో ప్రజలకు తన గురించి చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బేతు రామమోహనరావు, రత్నం రమేష్, బేతు లక్ష్మీ, చిన్నం ఈశ్వరరావు, పి.వి.రామరాజు, పెన్నీరు దామోదరరావు, బసంత్,  శ్రీనివాసరావు, యారా జానకిరామయ్య తదితరులు పాల్గొన్నారు.

Just In...