Published On: Wed, Aug 12th, 2020

మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ధ్యేయం

* ఒక అన్నగా, తమ్ముడిగా మీ చేయి పట్టి నడిపిస్తాను

* ప్రతి అక్క చెల్లెమ్మల చేతుల్లో ఏటా రూ.18,750

* నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సహాయం

* వైయస్సార్‌ చేయూత పథకం ప్రారంభోత్స‌వంలో సీఎం జ‌గ‌న్

అమరావతి బ్యూరో, సెల్ఐటి న్యూస్‌: అక్క చెల్లెమ్మల భవితను మార్చే ‘వైయస్సార్‌ చేయూత’ పథకాన్ని సీఎం వైయస్‌ జగన్ బుధ‌వారం ప్రారంభించారు. 45 నుంచి 60 ఏళ్ల మ«ధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఈ పథకంలో నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సహాయం చేస్తారు. దాదాపు 23 లక్షల మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నగదు బదిలీ చేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.4687 కోట్లు వ్యయం చేస్తోంది. తాడేప‌ల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, వైయస్సార్‌ చేయూత పథకం ప్రారంభించారు. ఆ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 23 లక్షల
మహిళల ఖాతాల్లో రూ.18,750 చొప్పున నగదు జమ అయింది. మహిళలకు ఆదాయం సమకూర్చేలా అమూల్, పీ అండ్‌ జీ వంటి సంస్థలతో కూడా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

వారికి ఏ పథకమూ లేదు!
ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు మేలు చేసే వైయస్సార్‌ చేయూత పథకం ప్రారంభిస్తున్నందుకు ఒక అన్నగా, తమ్ముడిగా తన అదృష్టంగా భావిస్తున్నట్లు సీఎం వైయస్‌ తెలిపారు. ప్రభుత్వ పథకాల్లో ఏదీ కూడా 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న అక్క చెల్లెమ్మలకు లేదని, ఆ విషయాన్ని తన పాదయాత్రలో గమనించానన్నసీఎం, నిజానికి ఆ వయసులో ఉన్న మహిళలు కుటుంబ బా«ధ్యత వహిస్తారని
చెప్పారు.

గతంలో అస్తవ్యస్తం
గతంలో కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇచ్చేవారని, ఊళ్లో ఒకరో, ఇద్దరికో మాత్రమే వచ్చేదని, అది కూడా లంచం ఇస్తేనే సహాయం అందేదని సీఎం గుర్తు చేశారు. దాని వల్ల ఎవరికీ ఉపయోగం లేకపోగా, మిగిలిన వర్గాలకు ఈర్ష్య కలిగించే విధంగా కొనసాగిందని ఆయన పేర్కొన్నారు. అందుకే పూర్తి ప్రక్షాళన చేస్తూ, కార్పొరేషన్లను కూడా మార్చామని తెలిపారు.

వెటకారం చేశారు:
అప్పుడు వారికి పెన్షన్‌ రూపంలో డబ్బు ఇద్దామనుకున్నామన్న ముఖ్యమంత్రి, ఆ విధంగా నెలకు రూ.1000 చొప్పున ఇస్తే ఏటా రూ.12 వేలు అయ్యేదని చెప్పారు.
అయితే 45 ఏళ్లకే పెన్షన్‌ ఏమిటని చాలా మంది వెటకారం చేశారని, అందుకే వారికి పెన్షన్‌ రూపంలో ఏటా ఇచ్చే రూ.12 వేలకు బదులుగా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు. దీని వల్ల ప్రతి అక్క, చెల్లెమ్మ తమ భవితను మార్చుకుంటారని భావిస్తూ పథకం ప్రకటించామని తెలిపారు. ఆ పథకాన్ని ఎన్నికల ప్రణాళికలో చేర్చడంతో పాటు,
అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో ఏడాది నుంచి అమలు చేస్తామని హామీ ఇచ్చామని, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటున్నామని వివరించారు.

నేరుగా నగదు జమ:
వైయస్సార్‌ చేయూత పథకంలో మహిళలకు చేస్తున్న ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నామని సీఎం వైయస్‌ జగన్‌ తెలిపారు. ఆ మొత్తాన్ని బ్యాంకులు ఇతర రుణాల కింద జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాల్లో వేస్తున్నామని చెప్పారు.

పలు సంస్థలతో ఎంఓయూ:
అక్క చెల్లెమ్మలకు వ్యాపార అవకాశాలు కల్పించే ప్రక్రియ చేపట్టామన్నముఖ్యమంత్రి, అందు కోసం దేశంలోనే దిగ్గజమైన అమూల్, రిలయన్స్, ఐటీసీ, ప్రొక్టర్‌ అండ్‌ గ్యాంబుల్, హిందుస్తాన్‌ యూనియన్‌ లీవర్‌ వంటి సంస్థలతో ప్రభుత్వం అవగాహన (ఎంఓయూ) కుదుర్చుకుందని వెల్లడించారు.

వ్యాపార అవకాశాలు:
‘మహిళలకు వ్యాపార అవకాశాలను అందుబాటులోకి తీసుకు రావడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రతి అక్కకు, చెల్లెమ్మకు గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా 2 పేజీల లేఖ కూడా పంపిస్తున్నాం. ప్రభుత్వం చూపుతున్న వ్యాపార అవకాశాలను ఉపయోగించుకోవాలని, దాని ద్వారా మేలు పొందాలని అనుకుంటే అందుకు ఆప్షన్‌ ఇవ్వొచ్చు. ఆ తర్వాత మెప్మా, సెర్ప్‌ ప్రతినిధులు మిమ్మల్ని కలుస్తారు.
మీరు సొంతంగా వ్యాపారం ప్రారంభించేలా సహకరిస్తారు’. ‘దీని కోసం బ్యాంకులతో కూడా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. కంపెనీలు తమ ఏజెన్సీలకు ఇచ్చే రేటు కన్నా తక్కువ రేటుకు (ఎక్కువ మార్జిన్‌తో) తమ ఉత్పత్తులను ఇస్తారు. దీని వల్ల మహిళలు ఎక్కువ లాభాలను పొందే అవకాశం ఉంటుంది.
వీటన్నింటి వల్ల వారు ఆర్థికంగా వృద్ది చెందేలా సుస్థిర జీవనోపాధి కూడా పొందవచ్చు. రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని సంస్థలతో ఒప్పందం చేసుకుంటాం’ అని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.

సస్టెయినబుల్‌ లైవ్‌లీ హుడ్‌:
అక్క చెల్లెమ్మలు ఒక వేళ పాల వ్యాపారం చేయాలంటే అమూల్‌ సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని, గేదెలు కొనివ్వడంతో పాటు, ఆ తర్వాత పాలు కూడా కొంటుందని సీఎం ఉదహరించారు. మహిళలు వ్యాపారం లేదా యూనిట్ల స్థాపన కోసం అవసరమైన ఆర్థిక సహాయం చేసేలా ప్రభుత్వం బ్యాంకులతో కూడా మాట్లాడిందని ముఖ్యమంత్రి తెలిపారు. మహిళల సస్టెయినబుల్‌ లైవ్‌లీహుడ్‌ కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్న ఆయన, ప్రతి అవకాశాన్ని నేరుగా అక్క చెల్లెమ్మలకు అందజేస్తామని స్పష్టం చేశారు.

ఈ సహాయం మీద ఏ ఆంక్షలు లేవు:
వైయస్సార్‌ చేయూత పథకంలో ప్రభుత్వం ఇస్తున్న డబ్బును సద్వినియోగం చేసుకోవాలన్న ముఖ్యమంత్రి, అక్క, చెల్లెమ్మలు తమ కాళ్లమీద తాము నిలబడాలని ఆకాంక్షించారు. అయితే ఈ సహాయంలో ఇదే చేయాలని ఏ అక్క మీద కూడా ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. ఈ డబ్బు దేనికి వాడుకోవాలన్నది పూర్తిగా అక్క చెల్లెమ్మల ఇష్టమని చెప్పారు.

ఆర్థిక ఇబ్బందులున్నా!
ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, కష్టాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల చేతిలో ఈ డబ్బు పెడితే వారికి మేలు జరుగుతుందని చెప్పి నాలుగు అడుగులు ముందుకు వేశామని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ తెలిపారు.

ఇంకా ఎవరైనా మిగిలిపోతే?:
ఇవాళ 22,28,909 మంది అక్క చెల్లెమ్మలకు ఈ పథకంలో ఆర్థిక సహాయం అందుతోందని సీఎం తెలిపారు. ఇంకా ఎవరైనా మిగిలిపోతే, గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని, వారు అర్హులైతే ఆ వెంటనే వెరిఫికేషన్‌ పూర్తి చేసి, వచ్చే నెలలో పథకాన్ని వర్తింప చేస్తామని వెల్లడించారు.

60 ఏళ్లకు వృద్ధాప్య పెన్షన్‌:
ఇక 60 ఏళ్లకు చేరువలో ఉన్న అక్క చెల్లెమ్మలకు, 60 ఏళ్లు రాగానే వృద్ధాప్య పింఛను వస్తుందన్న సీఎం, అదే సమయంలో 45 ఏళ్లు వచ్చిన వారికి కొత్తగా అర్హతలను బట్టి పథకంలో చేరుస్తామని చెప్పారు. అక్క చెల్లెమ్మలకు నాలుగేళ్లు తోడుగా ఉంటామని, కచ్చితంగా ఆర్థిక సహాయం చేస్తామన్నముఖ్యమంత్రి, అందరికి మంచి జరగాలంటూ.. అందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి
పనులు ఎన్నో చేయాలని కోరుకుంటున్నా అంటూ తన ప్రసంగం ముగించారు.

కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా పలువురు మహిళలు ప్రత్యక్ష ప్రసారంలో చూశారు. కార్య‌క్ర‌మంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఎం.శంకరనారాయణ, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పి.విశ్వరూప్, ఎంపీ మార్గాని భరత్, సీఎస్‌ నీలం సాహ్ని, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

Just In...