Published On: Fri, Sep 11th, 2020

వైఎస్‌ జగన్‌ విజన్‌ను అభినందించిన కేంద్ర మంత్రి

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రెండో రోజు జరిగిన సమావేశాల్లో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి అజయ్ సాహ్నీని కలిసిన మంత్రి ‘డిజిటల్ ఇండియా’ పై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘డేటా సెంటర్’ ఏర్పాటుకు సహకారం కోరిన మంత్రి గౌతమ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న గ్రామ సచివాలయం తరహా ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టులకు నిధులు అందించాలని కోరారు. గత 14 నెలల్లో రాష్ట్రాన్ని డిజిటలైజేషన్‌కు తీసుకువచ్చేందుకు అనేక చర్యలు చేపట్టామన్న మంత్రి ఎలక్ట్రానిక్ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ఈ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని వివరించారు. విశాఖపట్నంలో జాతీయ స్థాయి ఐటీ సదస్సు కోవిడ్ కారణంగా జరగలేదని ప్రస్తావించిన మంత్రి మేకపాటిమరో ఎలక్ట్రానిక్ మానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర ఐ.టీ కార్యదర్శి అజయ్ సాహ్నీని కోరారు. అదే విధంగా కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మన్ సుఖ్ లక్ష్మణ్ భాయ్ మాండవీయతోమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమావేశమయ్యారు.
‘సాగరమాల’ పథకం కింద కాకినాడ పోర్టులో వసతుల కల్పన అభివృద్ధికి సహకరించాలని కోరిన మంత్రి ‘భారతమాల’ కార్యక్రమంలో భాగంగా పోర్టుల చుట్టూ జాతీయ రహదారుల అనుసంధానంపై చర్చించారు. భావనపాడు, కాకినాడ సెజ్ పోర్ట్, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టుల సమీపంలో జాతీయ రహదారుల నిర్మాణంపై కేంద్ర సాయాన్ని కోరారు. ఫిషింగ్ హార్బర్‌లో సరకు రవాణా, డీడబ్ల్యూటీ సామర్థ్యం పెంపు, హార్బర్ నిర్వహణలకు ఆర్థిక సహకారం అందించాలని కేంద్రమంత్రి మన్ సుఖ్ మాండవీయను కోరారు.
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో సమావేశమైన మంత్రి ఆంధ్రప్రదేశ్‌లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు గురించి కేంద్ర సహకారంపై చర్చించారు. ఏపీలోని నైపుణ్య విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన నిధులు అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో
పర్యటించాలని అనురాగ్ ఠాకూర్‌కు ఆహ్వానం అందించారు. పారిశ్రామిక వేత్తలతో ఒకసారి సమావేశం అవ్వాలని కోరారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్‌తో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ ముగిసింది. కరోనా సంక్షోభ కాలంలో చిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను పీయుష్ గోయల్ అభినందించారు. విశాఖ చెన్నై కారిడార్ అభివృద్ధి గురించి చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం పది ఫిషింగ్ హార్బర్ లను ఏర్పాటు చేయబోతుందని, దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. ఫిషింగ్ హార్బర్‌లో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ నిధులు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఒక మేజర్ పోర్టులో కేంద్ర ప్రభుత్వం భాగస్వామి కావాలనుకుంటుందని, దానిపై ముఖ్యమంత్రితో మాట్లాడి ముందుకెళ్తామని తెలిపారు.
ఏపీకి అభినందనలు : ‘బొబర్తి ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటుపై చర్చించాము. దీన్ని అతిపెద్ద ఎలక్ట్రానిక్ క్లస్టర్ గా అభివృద్ధి చేస్తాం. ఎలక్ట్రానిక్ క్లస్టర్లో ఏపీ ఒక లీడింగ్ స్టేట్‌గా ఉంటుంది. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం కస్టమ్ మెడ్ పాలసీ తీసుకువస్తాం. అసోసియేటెడ్ డ్రగ్స్ పార్కు కోసం ప్రత్యేక పార్కు తీసుకు వస్తున్నాం. పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు గురించి చర్చించాం. దీని పైన ఒక కమిటీ వేసి చెబుతామని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ రంగాల్లో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. సులభతర వాణిజ్యంలో నెంబర్ వన్‌గా నిలిచిన ఏపీని అభినందించారు. మరింత యూజర్ ఫ్రెండ్లీగా మెరుగుపరచాలని కోరారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ ఈ రంగానికి 1,100 కోట్ల రూపాయలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. మూడు నెలల పాటు ఫిక్స్డ్ ఛార్జీలు తీసివేయడం వల్ల చాలా పరిశ్రమలకు ప్రయోజనం కలిగింది.’‘పరిశ్రమలకు రాయితీలు కల్పిస్తున్న సీఎం విజన్‌ను గోయల్ అభినందించారు. పెట్టుబడులకు రాష్ట్రాల సన్నద్ధత, ఈ – గవర్నెన్స్ గురించి
చర్చించాం. రక్షణ రంగానికి సంబంధించి 108 వస్తువులను దేశీయంగా తయారు చేసే అంశంపై ఒక బ్లూప్రింట్ రూపొందిస్తున్నారు. దొనకొండను రక్షణ పరికరాల తయారీ క్లస్టర్ గా మారుస్తాం. దీనిపై రేపు ఎయిర్ చీఫ్ మార్షల్, నేవీ చీఫ్ తో  మాట్లాడుతా. విశాఖపట్నంలో సబ్మెరైన్ బేస్ ఉంది. ఈ రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ అంశంపై కూడా చర్చిస్తాం.’ అని మంత్రి గౌతమ్‌ రెడ్డి తెలిపారు.

Just In...