Published On: Sat, Sep 12th, 2020

కొండ ప్రాంత ప్రజలకు వెంటనే పట్టాలివ్వండి

* తెదేపా ఎమ్మెల్యే గద్దె రామమోహన్
విజ‌య‌వాడ‌, సెల్‌ఐటి న్యూస్‌: కొండ ప్రాంతాల్లో నివశిస్తున్న వారికి వెంటనే పట్టాలివ్వాలని విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఉదయం 7 వ డివిజన్ లోని కొండ ప్రాంతం , మరియు స్థానిక సమస్యలపై గద్దె రామమోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో గద్దె రామమోహన్ మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో తూర్పు నియోజకవర్గంలో 9300 పట్టాలు తయారుచేసి కొన్ని పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని , ఎన్నికల కోడ్ రావడం వల్ల పట్టాల పంపిణీ ఆగిపోయిందని , జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలయినప్పటికీ ఇంత వరకు మిగతా పట్టాలివ్వలేదని , ఇటీవల కొంత మందికి గజానికి రు .25 వేలు నుంచి రు . 50 వేల వరకు డబ్బులు కట్టమంటూ నోటీసులు జారీ చేశారని , అంత కట్టే స్థోమత వారి వద్ద ఉంటే అనేక బాధలు పడుతూ కొండ ప్రాంతాలలో ఎందుకు నివశిస్తారని ప్రశ్నించారు . కేవలం తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లేందుకే ఇళ్ళు గానీ , పట్టాలు కాని , ఇళ్ళ స్థలాలుగాని ఇచ్చేందుకు జాష్యం చేస్తున్నారని నగరంలో పూర్తయిన ఇళ్ళు , పూర్తయిన పట్టాలు ఇచ్చేందుకు ఎవరు అడ్డంకులు పెట్టారని గద్దె రామమోహన్ ప్రశ్నించారు .
అలాగే ఎస్సీ సబ్ ప్లాన్ క్రింద చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయలు దళితులకు మౌలిక సదుపాయాల కోసం కేటాయించేవారని , కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ఇంత వరకు ఎస్సీ సబ్ ప్లాన్ క్రింద రూపాయి కూడా కేటాయించలేదని , దళితుల ఏరియాల అభివృద్ధికి వెంటనే ఎస్సీ సబ్ ప్లాన్ క్రింద నిధులు కేటాయించాలని గద్దె రామమోహన్ ప్రభుత్వాన్ని కోరారు . అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని , రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట దళితులపై దాడి జరగని రోజు లేదని , ప్రభుత్వం దళితులపై దాడి ఆపకపోతే తగిన మూల్యం చెల్లించాలని గద్దె రామమోహన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గద్దె రామమోహన్‌కు స్థానికులు పలు సమస్యలు తెలిపారు. ముఖ్యంగా ఇళ్ళకోసం డబ్బులు కట్టి 2 సంవత్సరాలు అయిందని ఇంత వరకు ఇళ్ళు కేటాయించలేదని , వెంటనే ఇళ్ళు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అట్లూరి పరమాత్మ వీధిలో కొండపై సైడ్ వాల్ కట్టి రోడ్డు నిర్మాణం చేయాలని , పడమట వారి వీధిలో పైన పైకి మెట్లు ఏర్పాటు చేయాలని, దాసరి రమణానగర్‌లో రోడ్డు పాడైపోయిందని రోడ్డు నిర్మాణం చేపట్టాలని, శివగిరి కొండ మీద కరెంటు స్థంబాలు ఏర్పాటు చేయాలని, గుమ్మడివారి వీధిలో లింకు రోడ్డు మరియు డ్రైనేజీ ఏర్పాటు చేయాలని గద్దె రామమోహన్‌ను కోరారు. కార్యక్రమంలో అన్నే వీరభోగ వంసత రాయులు, సొంగా సంజయ్ వర్మ, దయాల శిరీషా గాంధీ, పడమట సతీష్‌చంద్ర, అమిర్నేని కరుణకుమారి, దోమకొండ రవి, భీమవరపు రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Just In...