Published On: Thu, Sep 17th, 2020

ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌కు వైసీపీ ఎంపీలు ఘ‌న నివాళి

* ఏపీ భవన్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో సంతాప సభ

న్యూఢిల్లీ, సెల్ఐటి న్యూస్‌: తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన సంతాప సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, భవన్ అధికారులు పాల్గొని ఘ‌నంగా నివాళులు అర్పించారు. తొలుత వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వి.విజయసాయిరెడ్డి జ్యోతి ప్రజ్వలన గావించి ఎంపీ దుర్గాప్ర‌సాద్ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సంతాప సభకు విచ్చేసిన పార్లమెంటు సభ్యులతో కలసి రెండు ని‌మిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.
కార్యక్రమానికి లోక్‌సభలో వైసీపీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి,  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సత్యవతి, గోరంట్ల మాధవ్, పోచ బ్రహ్మానందరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, అయోధ్య రామిరెడ్డి, బెల్లాన చంద్రశేఖర్, తలారి రంగయ్య,  ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమీషనర్ అభయ్ త్రిపాటి, రెసిడెంట్ కమీషనర్ భావన సక్సేనా, స్పెషల్ కమీషనర్ ఎన్.వి.రమణారెడ్డి, భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొని నివాళులు అర్పించారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ బల్లి దుర్గాప్రసాద్‌తో తనకున్న వ్యక్తిగత అనుబంధం పంచుకున్నారు. 28 ఏళ్లకే రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా
ఎన్నికయ్యారని, ప్రతిసారి తన ఆశీస్సులు తీసుకునేవారని, వారి మరణం ఆయన కుటుంబానికే కాదు, తనకు కూడా వ్యక్తిగతంగా తీరని లోటని ఆవేద‌న వెలిబుచ్చారు. పార్లమెంట్‌లో అందరితో కలివిడిగా ఉండేవార‌ని ఎవరు ఏ సహాయం అడిగినా వెంటనే సిద్ధంగా ఉండేవారని కొనియాడారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ బల్లి దుర్గాప్రసాద్ ఏదైనా భోళాగా మాట్లాడే మనిషి, నిరంతరం ప్రజల కోసం పనిచేసేవారు, ఆయన అకాల మరణం పార్టీకి ప్రజలకు తీరని లోటని సంతాపాన్ని వ్యక్తం చేశారు. అన‌కాప‌ల్లి ఎంపీ సత్యవతి మాట్లాడుతూ సహచర ఎంపీ దుర్గాప్రసాద్ మరణం అందరినీ ఎంతో బాధించిందని, ఆయన
ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

Just In...