Published On: Mon, Sep 21st, 2020

టైమ్ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స…

* 7.25 కిలోల అండాశయ కణితిని విజయవంతంగా తొలగించిన ఉషాలత, కరుణ వైద్యబృందం

విజయవాడ, సెల్ఐటి న్యూస్‌: విజ‌య‌వాడ‌లోని టైమ్ హాస్పిటల్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. అండాశయంలో ఏర్పడిన 7.25 కిలోల భారీ కణితిని ప్రఖ్యాత గైనకాలజిస్టులు డాక్టర్ పువ్వాడ ఉషాలత, డాక్టర్ వెల్లంకి కరుణ నేతృత్వంలోని వైద్యబృందం విజయవంతంగా తొలగించింది.
వివరాల్లోకి వెళితే.. గుడివాడకు చెందిన జ్యోతి (25) మహిళ గడచిన ఐదారు నెలలుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ, చికిత్స నిమిత్తం టైమ్ హాస్పిటల్లో చేరారు. స్కానింగ్ తదితర నిర్ధారణ పరీక్షల ద్వారా జ్యోతి అండాశయంలో భారీ కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. టైమ్ హాస్పిటల్ కు చెందిన సీనియర్ గైనకాలజిస్టులు శస్త్రచికిత్స నిర్వహించి, జ్యోతి అండాశయంలోని 7.25 కిలోల భారీ కణితిని విజయవంతంగా తొలగించారు. అశోక్‌నగర్‌లోని టైమ్ హాస్పిటల్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ఉషాలత మాట్లాడుతూ పేషేంట్ జ్యోతికి మూడుసార్లు సిజేరియన్ ఆపరేషన్ జరిగినట్లు తెలిపారు. ఆమె ఇద్దరు బిడ్డలు చనిపోగా, భర్త కూడా ఇటీవలే మృతిచెందాడని అన్నారు. జ్యోతి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా శస్త్రచికిత్సను నిర్వహించమన్నారు. అండాశయంలో సాధారణంగా ఒకటి నుండి రెండు కిలోల వరకు కణితిలు ఏర్పడతాయని, జ్యోతి అండాశయంలో 7.25 కిలోల బరువుతో అసాధారణ స్థాయిలో ఏర్పడిన కణితిని తొలగించడం అత్యంత సంక్లిష్టతతో కూడుకున్నదని అన్నారు. కరోనా కారణంగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకుని, అవసరమైన అన్ని జాగ్రత్తలతో ఈ శస్త్రచికిత్సను పూర్తిచేసామని చెప్పారు. ఎనస్థీషియన్ డాక్టర్ శైలజ సహకారంతో ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని డాక్టర్ ఉషాలత పేర్కొన్నారు. అత్యంత క్లిష్టమైన ఈ శస్త్రచికిత్సను గర్భాశయాన్ని తొలగించాల్సిన అవసరం లేకుండా పూర్తిచేసి, కణితిని తొలగించగలిగామని, శస్త్రచికిత్స అనంతరం పేషేంట్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా వుందని డాక్టర్ వెల్లంకి కరుణ తెలిపారు. విలేకరుల సమావేశంలో టైమ్ హాస్పిటల్ సీఎండీ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ పాల్గొని శస్త్రచికిత్స నిర్వహించిన గైనకాలజిస్టుల బృందాన్ని అభినందించారు.

Just In...