Published On: Tue, Sep 22nd, 2020

పప్పుగుత్తితో భర్తని చంపిన భార్య…

* అనంతపురంలో దారుణం

అనంత‌పురం క్రైం, సెల్ఐటి న్యూస్‌: భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్త మనస్థాపానికి గురై మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగొస్తున్నాడంటూ భార్య గొడవపడడం మొదలుపెట్టింది. చివరికి ఆ మహా ఇల్లాలు దారుణానికి పాల్పడింది. అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
ప్రియుడితో కలసి భార్య ఘాతుకానికి పాల్పడింది. క‌ట్టుకున్న భర్తని కిరాతకంగా హత్య చేసింది. పప్పు గుత్తితో తలపై కొట్టి అమానుషంగా అంతమొందించింది. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు హైడ్రామకు తెరతీసి అడ్డంగా బుక్కైంది. ఈ దారుణ ఘటన జిల్లాలోని కల్యాణదుర్గం మండలం దొడగట్ట గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన శ్రీనివాస్ చౌదరి(36)కి తొమ్మిదేళ్ల కిందట అదే ప్రాంతానికి చెందిన సరితతో వివాహమైంది. ఏడేళ్ల కూతురు సంతానం. కొద్దికాలం సాఫీగానే సాగిన కాపురంలో కలతలు మొదలయ్యాయి.
భార్య సరిత అదే గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్య ప్రవర్తన నచ్చని శ్రీనివాస్ చౌదరి మద్యానికి బానిసగా మారాడు. నిత్యం తాగి వస్తుండడంతో భార్య గొడవపడేది. మరోమారు ఫుల్లుగా తాగి రాత్రివేళ ఆలస్యంగా ఇంటికి రావడంతో సరిత భర్తతో గొడవపడింది. ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరగడంతో మద్యం మత్తులో ఉన్న భర్తని పప్పు కాడతో చావబాదింది. తలపై బలంగా కొట్టడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం హత్యని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు హైడ్రామాకు తెరతీసింది. శ్రీనివాస్ శవాన్ని చెట్టుకు వేలాడదీసి ఉరేసుకుని చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కై క‌ట‌క‌టాలు లెక్కిస్తోంది.

Just In...