Published On: Sat, Oct 10th, 2020

ఏపీ ఎంసెట్ ఫ‌లితాలు విడుద‌ల‌…

* ఇంజ‌నీరింగ్‌లో 84.78 శాతం ఉత్తీర్ణ‌త‌

విజయవాడ(ఎడ్యుకేష‌న్‌), సెల్ఐటి న్యూస్‌: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నిర్వహించిన‌ ఎంసెట్ ఇంజినీరింగ్‌లో బాలురు తొలి ర్యాంక్ కైవసం చేసుకోగా, అగ్రికల్చర్‌లో బాలికలు తొలి ర్యాంక్ సాధించారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శ‌నివారం ఉద‌యం విజయవాడలోని ఆర్ అండ్ బి భవన సముదాయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ‌ఏపీ ఎంసెట్ 2020 ఫలితాలను మంత్రి విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఆదిమూల‌పు సురేష్ మాట్లాడుతూ ఈ ఏడాది సెప్టెంబర్ 17, 18, 21, 22, 23, అక్టోబర్ 7న నిర్వహించిన ఏపీ ఎంసెట్ 2020 (ఇంజినీరింగ్) ప్రవేశ పరీక్షలకు 1,85,936 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 1,56,953 మంది హాజరయ్యారన్నారు.
మొత్తం 1,33,066 (84.78%) మంది అర్హత సాధించారన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 23, 24, 25 అక్టోబర్ 7న నిర్వహించిన ఏపీ ఎంసెట్ 2020 (అగ్రికల్చర్) ప్రవేశ పరీక్ష లకు 87,652 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 75,858 మంది  హాజరయ్యారన్నారు. మొత్తం 69,616 (91.77) శాతం మంది అర్హత సాధించారన్నారు. ఎంసెట్ మార్కుల ఆధారంగా 75 శాతం, ఇంటర్ మార్కుల ఆధారంగా 25 శాతం వేయిటైజ్  ఇవ్వడం ద్వారా ర్యాంకు లను నిర్ణయించామన్నారు. ఇంజినీరింగ్‌లో మొత్తం 94,558 మంది బాలురు హాజరు కాగా వారిలో 79,030 అర్హత సాధించగా, మొత్తం 62,395 బాలికలు హాజరు కాగా వారిలో 54,036 మంది అర్హత సాధించారన్నారు. అగ్రికల్చర్‌లో మొత్తం 24,635 మంది బాలురు హాజరు కాగా వారిలో 22,420 అర్హత సాధించగా,  మొత్తం 51,223 మంది  బాలికలు హాజరు కాగా వారిలో  47,196 మంది అర్హత సాధించారన్నారు. ఎంసెట్ విజయవంతంగా నిర్వహించిన కాకినాడ జెఎన్టియు అధికారులకు ఈ సంద‌ర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ అభినంద‌న‌లు తెలిపారు. వీసి, కన్వీనర్‌, సిబ్బంది చక్కగా నిర్వహించార‌ని కొనియాడారు. కోవిడ్ బారినపడిన 97 మంది‌ విద్యార్థులు ఎంసెట్ రాయలేకపోయారు.14 ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి (రాష్ట్రంలోని 13 కేంద్రాలు, తెలంగాణ ఒక కేంద్రంలో) వారికి అక్టోబర్ 7న పరీక్షలు నిర్వహించాం. వారిలో 77 మంది పరీక్షలు రాశారని, వారి ఫలితాలు కూడా విడుదల చేసిన‌ట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏపీ ఉన్నత విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య, ఎపి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రరెడ్డి, ఉన్నత విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర,  కమిషనర్ కొలియాగైట్ ఎడ్యుకేషన్ ఎం.ఎం.నాయక్, ఏపిఎస్సిహెచ్ఇకి చెందిన వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కె.రామ్మోహన్‌రావు, వైస్ ఛైర్పర్సన్  ప్రొఫెసర్ టి.లక్ష్మమ్మ, సెక్టార్ ప్రొఫెసర్ బి.సుధీర్ ప్రేమ్‌కుమార్, స్పెషల్ ఆఫీసర్ – సిఇటిఎస్ ప్రొఫెసర్ ఎం.సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.

Just In...