Published On: Thu, Oct 15th, 2020

డ్రైవింగ్ స్కూళ్ల‌లో డిటిసి ఆక‌స్మిక త‌నిఖీ

* వారంలోగా సరిదిద్ద‌కుంటే క‌ఠిన చ‌ర్య‌లు
* డ్రైవింగ్ స్కూల్ నిర్వహణ, మౌలిక వసతులపై సూచనల జారీ
* శిక్షణ అనంతరం ఫారం-5 పాటుగా ఫారం 5ఎను అందజేయాలి
* హెచ్చ‌రించిన డీటీసీ పురేంద్ర‌
విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: రవాణా డ్రైవింగ్ స్కూళ్ల‌ పనితీరుపై ఆకస్మిక తనిఖీలను డిటీసీ యం.పురేంద్ర చేపట్టారు. జిల్లాలోని డ్రైవింగ్ స్కూల్ల నిర్వాహకులకు నోటీసులను జారీచేశారు. గతవారం రోజులుగా జిల్లాలోని రవాణా కేటగిరి కి చెందిన డ్రైవింగ్ స్కూల్స్ పై ఆకస్మిక తనిఖీలు చేపట్టిన సందర్భంగా గురువారం నాడు డిటీసీ యం పురేంద్ర మాట్లాడుతూ భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు జిల్లా వ్యాప్తంగా 13 డ్రైవింగ్ స్కూల్ ల అనుమతులు ఇవ్వడం జరిగిందని, వాటిలో ఏపీఎస్ ఆర్టీసి డ్రైవింగ్ శిక్షణ కేంద్రం విజయవాడ, మచిలీపట్నంతో పాటుగా 11 ప్రైవేటు సంస్థలతో రవాణా వాహనాలపై శిక్షణలను నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు.
ప్రభుత్వం నిర్ణయించిన మార్గదర్శకాలను అతిక్రమించి డ్రైవింగ్ స్కూల్స్ నడుపుతునట్లు గుర్తించడంతో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి వార్యులు, రాష్ట్ర రవాణాశాఖ కమీషనర్ అదేశాలమేరకు ఈ తనిఖీలను చేపట్టామని ఆయన చెప్పారు. డ్రైవింగ్ స్కూల్ ల నిర్వహణ, మౌలిక వసతులు ప్రభుత్వ మార్గదర్శకాలపై తనిఖీలను చేపట్టామన్నారు. భారీ వాహన డ్రైవింగ్ లో శిక్షణ పొందిన వ్యక్తి కి ఫారం 5 తో పాటుగా ఫారం 5A ను కూడా తప్పనిసరిగా జారిచెయ్యవలసి ఉండగా కేవలం ఫారం 5 మాత్రమే జారి చేస్తున్నట్లు గమనించడం జరిగిందన్నారు. శిక్షణ సమయంలోనే భారీ వాహనముల యొక్క ఇంధన పొదుపు మరియు సమర్థవంతమైన డ్రైవింగ్ పై శిక్షణను కూడా ఇవ్వాల్సి ఉంటుందని, శిక్షణ అనంతరం ఫారం 5A ను కూడా జారీ చేయాలన్నారు. ఈ విషయంలో సంబంధిత నిర్వాహకులు ప్రాధాన్యత ఇవ్వాలని పత్రాల జారీలో కూడా ఉల్లంఘనలకు అతిక్రమించవద్దని సూచించారు. ఇందుకు సంబంధించి సంబంధిత డ్రైవింగ్ స్కూల్ యాజమాన్యంలకు నోటీసులను జారీ చేశారు. ఏడు రోజుల లోపు ఇంధనం పొదుపు శిక్షణ నిమిత్తం ఇంధన వినియోగ కొలత పరికరమును శిక్షణనిచ్చే ప్రతి భారీ వాహనంలో ఏర్పాటు చేసుకోవాలని ఆయన నోటీసులో పేర్కొన్నారు. జిల్లాలోని ఒక డ్రైవింగ్ స్కూల్ లో 4 బ్యాచ్ లకు శిక్షణ ఇవ్వడానికి అనుమతి పొంది, కేవలం ఒక బ్యాచ్ మాత్రమే నిర్వహిస్తున్నారని, త‌ద్వారా ప్రభుత్వ మార్గదర్శకాలను అతిక్రమించి పక్క ద్రోవ పట్టించడమేనని, ఇలాంటివి పునరావృతం అయితే డ్రైవింగ్ స్కూల్ ల లైసెన్సులను కూడా రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. వాహన తనిఖీ అధికారులు సంజీవ్‌కుమార్, డి.ఎస్.ఎస్.నాయక్, కె.ఎస్.ఎన్.ప్రసాద్, బి.ఎస్.ఎస్.నాయక్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...