Published On: Fri, Oct 16th, 2020

కోవిడ్ నిబంధ‌న‌లు అనుస‌రించి న‌వ‌రాత్రులు నిర్వ‌హ‌ణ‌

* నే‌టి నుండి ఇంద్ర‌కీలాద్రిపై ద‌స‌రా ఉత్స‌వాలు ప్రారంభం

* వీఐపిల కోసం ప్రత్యేక స‌మయం కేటాయింపు

* ఇక‌పై మ‌ల్లేశ్వ‌రుని ద‌ర్శ‌నం పునఃప్రారంభం

* టైం స్లాట్ ప్రకారమే అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి అనుమ‌తి

* దుర్గ‌గుడి ఛైర్మ‌న్ పైలా సోమినాయుడు, ఈవో సురేష్‌బాబు వెల్ల‌డి‌

ఇంద్ర‌కీలాద్రి, సెల్ఐటి న్యూస్‌: శ్రీ దుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామివార్ల దేవ‌స్థానం ఇంద్ర‌కీలాద్రిపై ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల‌ను కోవిడ్ నిబంధ‌న‌లు అనుస‌రించి శ‌నివారం నుండి ఈ నెల 25వ తేదీ వ‌ర‌కు వైభ‌వంగా నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు. శుక్ర‌వారం మ‌ల్లికార్జున మ‌హామండ‌పంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆల‌య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి ఎం.వి.సురేష్‌బాబుతో క‌లిసి ఆయ‌న మాట్లాడారు. నవరాత్రులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామ‌న్నారు. దర్శనానికి వచ్చే భ‌క్తులు ఖ‌‌చ్చితంగా కరోన నిబంధనలు పాటించాల‌న్నారు. త‌ప్ప‌నిస‌రిగా మాస్క్‌లు ధ‌రించి రావాల‌న్నారు. ఇంద్ర‌కీలాద్రిపై ఏడాది నుండి నిర్మాణంలో ఉన్న శివాలయం కూడా పూర్తైన నేప‌ధ్యంలో శ‌నివారం నుండి శివాలయంలో మ‌ల్లేశ్వ‌రుని ద‌ర్శించుకునేందుకు వీలుగా భ‌క్తులను అనుమతిస్తామ‌ని పేర్కొన్నారు. దసరాకి 74 వేల టికెట్స్ ఇప్పటికే ఆన్‌లైన్‌లో బుక్ అయ్యాయ‌ని తెలిపారు. ఇంకా కేవలం1500 టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయ‌ని భక్తులు వినియోగించుకోవాల‌ని కోరారు. ఆల‌య ఈఓ సురేష్‌బాబు మాట్లాడుతూ దర్శనానికి వచ్చే భక్తులు సామాజిక దూరం పాటిస్తూ వినాయక గుడి నుండి రావాల్సి ఉంటుంద‌ని చెప్పారు. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఐడి ఉంటేనే అనుమతిస్తామని పేర్కొ‌న్నారు. అమ్మ‌వారి జ‌న్మ న‌క్ష‌త్ర‌మైన మూల నక్షత్రం రోజున ప్ర‌భుత్వం త‌ర‌ఫున ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అమ్మవారికి పట్టువ‌స్త్రాలు స‌మర్పిస్తార‌ని తెలిపారు. ఆన్‌లైన్ టికెట్ సమస్యలు ఎదురైన భ‌క్తుల సౌక‌ర్యార్థం పున్నమిఘాట్, మాడపాటి సత్రం వద్ద టికెట్ కౌంటర్స్  ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. కోవిడ్ నేఫ‌ధ్యంలో ఈ ఏడాది సామూహిక పూజలు లేవ‌న్నారు. పరోక్ష పూజలు మాత్ర‌మే అందుబాటులో ఉంటాయ‌ని పేర్కొన్నారు. ఘాట్‌రోడ్డులో ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. వీఐపిలకు ఉదయం 7 నుండి 9 వరకు, మ‌ధ్యాహ్నం 3నుండి 5 గంటలు వరకే అనుమతిస్తామ‌ని, వీఐపిలు కూడా ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకోవాల‌ని, టైం స్లాట్ ప్రకారమే రావాల‌ని సూచించారు. విలేక‌రుల స‌మావేశంలో ఆలయ ప్రధానార్చకులు మరియు ఎక్స్‌అఫీషియో సభ్యులు లింగంభోట్ల దుర్గాప్రసాద్, ధర్మకర్త మండలి సభ్యులు బుసిరెడ్డి సుబ్బాయమ్మ, ఎన్.అంబిక, పులి చంద్రకళ, కనుగుల వెంకటరమణ(బాలా), ఎన్.సతీష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...