Published On: Fri, Oct 16th, 2020

క‌న‌క‌దుర్గ ఫ్లైఓవ‌ర్ ప్రారంభం…

* వ‌ర్చువ‌ల్ విధానంలో ప్రారంభించిన కేంద్ర‌మంత్రి నితిన్‌గ‌డ్క‌రి

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: విజయవాడకు మకుటాయమానంగా నిలవనున్న కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభమైంది. వర్చువల్ విధానం ద్వారా కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి శుక్ర‌వారం లాంఛనంగా ప్రారంభించారు. అలాగే ఫ్లైఓవ‌ర్‌తో పాటుగా రాష్ట్రంలోని జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతో పాటు 16 వంతెనలకు గడ్కరి శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.15.592 కోట్లతో 61 కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో కేంద్రమంత్రులు వీకే సింగ్, ఆరెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి డిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. ఏపీ మంత్రి శంకర నారాయణ, ఎంపీలు కేశినేని శ్రీనివాస్ (నాని), కనకమేడల రవీంద్రకుమార్, సీఎం రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ న‌గ‌రంలో కొత్తగా నిర్మించిన కనకదుర్గ ఫ్లై ఓవర్‌తో పాటు, బెంజి సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ ప్రారంభించారు. హైవే ప్రాజెక్టులకు సంబంధించి 1411 కి.మీ పొడవైన రహదారుల నిర్మాణం కోసం ఈ–శిలాఫలకాల ఆవిష్కరణతో పాటు, వాటిని జాతికి అంకితం చేశారు. రాష్ట్ర మంత్రులు ఎం.శంకరనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నానితో పాటు, రహదారులు భవనాల శాఖకు చెందిన పలువురు సీనియర్‌ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌మాట్లాడారు.

ఈ ప్రభుత్వ హయాంలో జాతీయ రహదారుల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇది మొత్తం జాతీయ రహదారుల రూపురేఖలనే మారుస్తోంది. 2013–14లో రోజుకు 12 కి.మీ మాత్రమే రహదారుల నిర్మాణం జరగగా, ఇప్పుడు ప్రతి రోజూ 30 కి.మీ రహదారుల నిర్మాణం జరుగుతోంది. ప్రాజెక్టుల కోసం భిన్న మార్గాల్లో నిధుల సేకరించడంతో పాటు, టీఓటీ (టోల్‌–నిర్వహణ–బదిలీ) పద్ధతిలో ప్రాజెక్టులు చేపడుతున్నారు. టీఓటీ ప్రక్రియలో తొలుత 682 కి.మీ.కు సంబంధించి 30 ఏళ్లకు రూ.10 వేల కోట్ల ఆదాయం రావడం సంతోషకరం. అందులో ఆంధ్రప్రదేశ్‌లోనే 442 కి.మీ రహదారులు ఉన్నాయి. ప్రధాని నరేంద్రమోదీ, మంత్రి నితిన్‌ గడ్కరీ దూరదృష్టితో దేశవ్యాప్తంగా 7800 కి.మీ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలను దాదాపు రూ.3.3 లక్షల కోట్లతో చేపట్టారు. రహదారుల కనెక్టివిటీ వల్ల ఆర్థిక రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలలో రాష్ట్రంలో 375 కి.మీ పొడవైన 6 రహదారులు ఉండడం గమనించవలసిన విషయం. మీ హయాంలో 2667 కి.మీ రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చడంతో, రాష్ట్రంలో జాతీయ రహదారులు 6880 కి.మీకు పెరిగాయి.

సంతోషకరం–అభినందనీయం…
రాష్ట్రంలో నేడు రూ.15,592 కోట్ల విలువైన 1411 కి.మీ.కు సంబంధించి మొత్తం 61 ప్రాజెక్టులకు ఈ–శిలాఫలకాల ఆవిష్కరణ, వాటిని జాతికి అంకితం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. గిరిజన ప్రాంతాల్లో నాలుగు లైన్ల రహదారి కనెక్టివిటీ కోసం ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను ఆమోదించినందుకు అభినందనలు. ముఖ్యంగా..
రాజమండ్రి–రంపచోడవరం–కొయ్యూరు–అరకు–బౌడారా–విజయనగరం రహదారి నిర్మాణం. తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలలోని సుదూర గిరిజన ప్రాంతాలను కలిపే దాదాపు 380 కి.మీ రెండు లైన్ల రహదారిని ఆమోదించినందుకు ధన్యవాదాలు. నాలుగు లైన్లమైదుకూరు–బద్వేలు–నెల్లూరు, మదనపల్లె–పీలేరు–తిరుపతి, అనంతపురం–గుంటూరు, కర్నూలు–దోర్నాల, అనంతపురం–మైదుకూరు రహదారులను కూడా అడిగిన వెంటనే మంజూరు చేశారు. అదే విధంగా విజయవాడ, బెంజి సర్కిల్‌ వద్ద పశ్చిమం వైపున మూడు లైన్ల ఫ్లైఓవర్‌కు సంబంధించి నేను వ్యక్తిగతంగా చేసిన విజ్ఞప్తిని మన్నించి, మంజూరు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో రహదారుల కనెక్టివిటీకి సంబంధించి మరికొన్ని ప్రతిపాదనలను మీ ముందు ఉంచుతున్నాను. అవి రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టులు.

ఇవీ ఆ ప్రతిపాదనలు:
1). కేంద్ర రహదారుల నిధి (సీఆర్‌ఎఫ్‌) నుంచి 2014–19 వరకు రూ.2611 కోట్లు మంజూరు చేశారు. కానీ దురదృష్టవశాత్తూ గత ఏడాది 2019–20లో ఏ నిధులూ విడుదల చేయలేదు. కాగా ఇప్పుడు రూ.680 కోట్ల తొలి దశ విడుదలకు సంబంధించి మంత్రిత్వ శాఖ సానుకూలంగా ఉందని, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్పారు. అలాగే రెండో దశకు సంబంధించి రూ.820 కోట్ల ప్రతిపాదనలను కూడా సమర్పించడం జరిగింది. కాబట్టి వాటిని విడుదల చేయాలి.

2). విజయవాడలో శరవేగంగా పెరుగుతున్న ట్రాఫిక్‌ కోసం బైపాస్‌ రహదారులు అవసరం. నగరానికి పశ్చిమం వైపు ఇప్పటికే మంజూరు కాగా, పనులు కూడా త్వరలోనే మొదలు కానున్నాయి. ఇక తూర్పు వైపునకు సంబంధించి గతంలో ప్రతిపాదించిన 189 కి.మీ.కు బదులు 78 కి.మీ. రింగ్‌ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అందులో భాగంగా ఎన్‌హెచ్‌–65, ఎన్‌హెచ్‌–16ను కలుపుతూ కృష్ణా నదిపై 52 కి.మీ వంతెనను తొలి దశలో  నిర్మించాల్సి ఉంది. దీని వల్ల మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఆ రహదారిపై ట్రాఫిక్‌ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, దాని నిర్మాణం కూడా లాభదాయకంగానే ఉంటుంది. అందువల్ల భూసేకరణ భారం రాష్ట్ర ప్రభుత్వంపై మోపకుండా ఆ ప్రాజెక్టును మంజూరు చేయాలని కోరుతున్నాను.

3). వెనకబడిన రాయలసీమ జిల్లాలలోని ప్రాంతాలకు కనెక్టివిటీని ఏర్పాటు చేసే బెంగుళూరు – విజయవాడ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేను భారత్‌మాల–తొలిదశలోనే చేపట్టాలి.  కొడికొండ చెక్‌పోస్టు, పులివెందుల, ముద్దనూరు, మీదుగా ఆ రహదారి నిర్మాణం జరుగుతుంది.

4). అనంతపురంలో రహదారి విస్తరణ, ఎన్‌హెచ్‌–42కు అనుసంధానం, నగరంలో ఆర్‌ఓబీతో సహా నాలుగు లైన్ల రహదారి కోసం 2020–21 జాతీయ రహదారుల వార్షిక ప్రణాళికలో ఇప్పటికే కేటాయించిన రూ.90 కోట్లతో పాటు, అదనంగా రూ.220 కోట్లు మంజూరు చేయాలి.

5). ఉభయ గోదావరి జిల్లాలకు మంచి అనుసంధానంగా నిల్చే ఎన్‌హెచ్‌–216పై నరసాపురం బైపాస్‌ నిర్మాణంలో భాగంగా వశిష్ట గోదావరిపై వంతెన నిర్మించాల్సి ఉంది.

6). ఎన్‌హెచ్‌–67లో భాగంగా కావలి, ఉదయగిరి, సీతారామపురం మధ్య ఉన్న రెండు లైన్ల రహదారిని అభివృద్ధి చేయాలి. ఇందుకోసం దాదాపు రూ.450 కోట్లు వ్యయం అవుతాయని అంచనా వేయగా, 2020–21 జాతీయ రహదారుల వార్షిక ప్రణాళికలో ఆ మేరకు అదనంగా నిధులు మంజూరు చేయాల్సి ఉంది. ఈ రహదారి వల్ల నెల్లూరు, వైయస్సార్‌ కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాల మధ్య కనెక్టివిటీ ఏర్పడుతుంది.

7). రాష్ట్రంలోని అయిదు ప్రధాన పోర్టులను  జాతీయ రహదారులకు అనుసంధానించే విధంగా 400 కి.మీ. పొడవైన 25 రహదారుల నిర్మాణం. వాటి నిర్మాణం వల్ల పోర్టులకు, పారిశ్రామిక రంగానికి అనుసంధానం ఏర్పడుతుంది. దీని వల్ల ఆర్థికంగా కూడా అభివృద్ది చెందవచ్చు.

8). విశాఖపట్నం నుంచి విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు బీచ్‌ రోడ్డు అభివృద్ది చేయాలి. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో ఈ రహదారి నిర్మాణం ఎంతో అవసరం. అని ఎనిమిది ప్రతిపాదనలను సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ కేంద్ర మంత్రికి నివేదించారు.

రాష్ట్రాన్ని సందర్శించండి:
– ఇంకా రాష్ట్రంపై మీరు చూపుతున్న మమకారం, మంజూరు చేస్తున్న ప్రాజెక్టులకు మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
– వీలైనంత త్వరగా ఆయా ప్రాజెక్టులు చేపట్టి, సకాలంలో పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహయ, సహకారాలు అందజేస్తుంది.
– స్థానికంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారంతో పాటు, భూసేకరణలో కూడా నిరంతరం మీకు తోడుగా నిలుస్తాము.
– రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులను పరిశీలించడానికి ఒకసారి ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. అంటూ ముఖ్యమంత్రి తన ప్రసంగం ముగించారు.

ఆ తర్వాత మాట్లాడిన కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ, ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ చేసిన పలు ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించారు. దాదాపు రూ.7500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆమోదిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యంగా బెంగళూరు–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ హైవే ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఇంకా ఏమన్నారంటే..:
– ఏపీలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.
– 2014లో మేము అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది.
– ఈ అయిదేళ్లలో కొత్తగా 2667 కి.మీ. జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది.
– రాష్ట్రంలో మొత్తం 28 ప్రాజెక్టులు. రూ.8869 కోట్లతో చేపడుతున్నాం.
– రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.
– రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతికి ఎంతో అవకాశం ఉంది.
– రాష్ట్రంలో 2209 కి.మీ. రహదారుల నిర్మాణానికి రూ.32,175 కోట్లు వ్యయం కానుంది.
– వాటికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తుది దశలో ఉంది. వచ్చే ఏడాదిలో పనులు మొదలవుతాయి.
– రూ.5 వేల కోట్లకు పైగా వ్యయం అయ్యే బెంగళూరు–చెన్నై హైవే ఏపీకి ఎంతో కీలకం.
– పోర్టు కనెక్టివిటీకి కూడా ప్రాధాన్యం ఇస్తాం. ఆ జాబితా ఇప్పటికే మా దగ్గర ఉంది. ఆ మేరకు పనులు చేపడతాము.
– అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వే. నాలుగు జిల్లాలలో పనులు కొనసాగుతాయి.
– అదే విధంగా విజయవాడ ఔటర్‌ రింగ్‌ రోడ్డు కూడా చేపడదాము.
– అన్ని ప్రాజెక్టులకు సంబంధించి మీరు ఢిల్లీకి రండి. అక్కడ అన్నీ చర్చిద్దాము.
– భూసేకరణలో మీ వాటా 50 శాతం కొంత భారం అంటున్నారు కాబట్టి, రోడ్డు నిర్మాణంలో వాడే వాటి మీద మైనింగ్‌ సెస్‌ లేక రాయల్టీ, ఆ తర్వాత స్టీల్, సిమెంట్‌ వంటి వాటిపై జీఎస్టీలో మినహాయింపు ఇవ్వండి. తద్వారా కేంద్రంపై ప్రాజెక్టు భారం కాస్త తగ్గుతుంది.
– మీరు ఢిల్లీకి వస్తే అక్కడ అన్నీ చర్చించుకుందాం.
– విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ ఇవాళ దేశానికే గర్వకారణం. నేను కూడా చూశాను. అమ్మవారిని దర్శించుకున్నాను.
– దేశంలో ఏటా 5 లక్షల ప్రమాదాల్లో లక్ష మంది చనిపోతున్నారు.
– ఏపీలో కూడా బ్లాక్‌ స్పాట్లు ఉన్నాయి. వాటిలో చాలా వరకు ఇప్పటికే మార్చాము.
– అన్ని ప్రాజెక్టుల ద్వారా ఏపీ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
– ఏపీలో మరింత ఉపాధి కల్పనకు ప్రాధాన్యం. ఎంఎస్‌ఎంఈ, ఖాదీ పరిశ్రమలకు మేము పూర్తి అండగా నిలుస్తాం.
– ఎంఎస్‌ఎంఈ మంత్రిగా చెబుతున్నాను. చేనేత, హస్తకళల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తాము. ఇక్కడ వాటికి కొదవ లేదు.
– రాష్ట్రంలో ఉన్న పోర్టులు కూడా అభివృద్ధిలో ఎంతో దోహదం చేస్తున్నాయి.
– మీ విజ్ఞప్తికి పూర్తి అండగా నిలుస్తాము.
– వచ్చే నెలలో నేను ఢిల్లీకి వస్తాను. మీరూ, అధికారులు రండి. మీ ఎంపీలు కూడా నన్ను కలుస్తున్నారు.
– మీరు ఢిల్లీకి వస్తే, అన్నీ మాట్లాడుకుందాం. సమస్యలు పరిష్కరించుకుందాం. అంటూ నితిన్‌ గడ్కరీ ప్రసంగం ముగించారు.

కాగా, దేశంలో అనేక రహదారుల నెట్‌వర్క్‌కు ఆంధ్రప్రదేశ్‌ హబ్‌గా ఉందని, దీని వల్ల రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి రిటైర్డ్‌ జనరల్‌ డాక్టర్‌ వీకే సింగ్‌ పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ ఒక మైలురాయి: జి.కిషన్‌రెడ్డి. కేంద్ర మంత్రి
– ‘నితిన్‌ గడ్కరీ నేతృత్వంలో దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం చాలా వేగంగా జరుగుతోంది. ఏపీలో ఇవాళ ఒక మైలు రాయి. 2014 వరకు రాష్ట్రంలో జాతీయ రహదారులు చాలా తక్కువగా ఉండేవి. ఆ తర్వాత ఈ ఆరేళ్లలో 2666 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. అంటే ఇది   64 శాతం పురోగతి. మరో ఏడాదిలో 688 కి.మీ రహదారుల నిర్మాణం జరగబోతోంది. రాష్ట్రంలో ఇంకా కొత్తగా పలు రహదారులు వస్తున్నాయి.
కనకదుర్గ ఫ్లై ఓవర్‌ వల్ల విజయవాడలో ట్రాఫిక్‌ సమస్య చాలా వరకు తొలగిపోతుంది. రాష్ట్రంలో ఇంకా చాలా కేంద్ర సంస్థలు ఏర్పాటవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రధాని ఎంతో కృషి చేస్తున్నారు. రెండు రాష్ట్రాలలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం మంత్రి గడ్కరీ కూడా ఎంతో సహాయ, సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ఆయన సహాయ, సహకారాలు ఎంతో ఉన్నాయి. అందుకు గడ్కరీకి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’.

 

Just In...