Published On: Sat, Oct 17th, 2020

ఆక్ర‌మ‌ణ‌ల‌కు తావులేకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం

* కృష్ణాన‌ది ప‌రీవాహ‌క ప్రాంతం వ‌ర‌ద ముంపున‌కు గురికాకుండా చూడండి

* లోత‌ట్టు ప్రాంతాల వారికి శాశ్వ‌త పున‌రావాసం క‌ల్పించే దిశ‌గా చ‌ర్య‌లు

* న‌గ‌రాభివృద్ధిపై మంత్రి బొత్స స‌మీక్ష‌

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: కృష్ణానది పరివాహక ప్రాంతాలు వరదనీటి ముంపున‌కు గురికాకుండా శాశ్వత పరిష్కారం కోసం  చేపట్టాల్సిన  చర్యలు, నగరంలో పలు అబివృద్ది అంశాలపై రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శ‌నివారం అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. విజ‌య‌వాడ నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సెంట్రల్ నియోజకవర్గ  శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్, కమిషనర్ ప్రసన్న వెంకటేష్, పలు విభాగాల అధికారులతో క‌లిసి ఆయ‌న వివిధ అంశాలపై సమీక్షించారు. సమావేశంలో భాగంగా మంత్రి కృష్ణానది పరివాహక ప్రాంత వరద ముంపు ప్రదేశాలలో చేపట్టిన సహాయక చర్యలు, భాదితులకు కల్పించిన పునరావాస కేంద్రాలు, సదుపాయాలను అడిగి తెలుసుకొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంతో పాటుగా పలు స్కూల్స్ నందు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ పునరావాసం పొండుతున్న వారితో  పాటు కరకట్టపై ఉన్న వారికీ కలిపి మొత్తం 5వేల మందికి  భోజనం, హెల్త్ క్యాంపులు  ఏర్పాటు, త్రాగునీరు మరియు ఇతర అన్ని మౌలిక వసతులను కల్పించిన‌ట్లు కమిషనర్ వివరించారు. ఈ  సందర్భంలో కృష్ణలంక, రామలింగేశ్వరనగర్ ప్రాంతంలో చేపట్టిన రిటైనింగ్ వాల్ పూర్తి స్థాయిలో అబివృద్ది పరచ‌డంతో పాటు ఆక్రమాణలకు అవకాశం లేకుండా వాల్ ప్రక్కనే రోడ్డు ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలలో గుర్తించిన 2500 కుటుంబాల వారికీ శాశ్వత పునరావాసం కల్పిస్తూ గృహాలు కేటాయించుటకు ఎన్యూమరేషన్ చేయాలని సూచించారు. ఈ సందర్భంలో బుడమేరు ముంపున‌కు గురియగు ప్రాంత వాసులను పరిగణలోనికి తీసుకోవాలని ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు మంత్రి  దృష్టికి తీసుకువచ్చారు. నగరాభివృద్ధిలో భాగంగా బందరు రోడ్డులో ఫుడ్‌కోర్టు, బీసెంట్ రోడ్డును
అబివృద్దిపరిచే అంశంపై చర్చించారు. వాటి  అభివృద్ధికి తయరుచేసిన డిజైన్‌లను పరిశీలించి పలు సూచనలు చేశారు. అదే విధంగా నగరంలో ఎల్ అండ్ టి వారిచే నిర్మాణలో ఉన్న స్ట్రోమ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణాల యొక్క స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో సదరు డ్రెయిన్ నందు గ్యాప్‌లు ఉండుట వల్ల వర్షపునీటి ప్రవాహం సక్రమంగా జరుగ‌డంలేద‌ని అధికారులు తెలిపిన దర్మిలా ఎల్ అండ్ టి అధికారులతో మంత్రి ఫోన్ ద్వారా మాట్లాడి పెండింగ్‌లో ఉన్న అన్ని పనులు తక్ష‌ణం పూర్తి చేయాలని ఆదేశించారు. మరియు నగరంలోని సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లకు సంబందించి శుద్ధి చేసిన నీటిని తరలించేందుకు పైపులైన్ ఏర్పాటుకు సంబందించిన ప్లాన్ వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ఈ సంద‌ర్భంగా ఎన్‌టిటిపీఎస్ అధికారులతో కూడా చర్చించి పూర్తి స్థాయిలో ఎస్.టి.పి ల ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించుకొనే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ (జనరల్) ఎ.మోహనరావు, అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదాదేవి, చీఫ్ ఇంజనీర్ మరియన్న, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.గీతాభాయి, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) వెంకటలక్ష్మి, సిటి ప్లానర్ లక్ష్మణరావు, ఎస్.ఇలు నరసింహమూర్తి, శ్రీరామమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Just In...