Published On: Mon, Oct 19th, 2020

డిసెంబరులో నైపుణ్య విశ్వవిద్యాల‌యానికి శంకుస్థాపన

* నవంబరు 15కల్లా సమగ్ర పరిశ్రమ సర్వే పూర్తి చేయాలి

* అధికారుల‌ను ఆదేశించిన మంత్రి మేకపాటి

* తొలుత తిరుపతిలో స్కిల్ వర్శిటీ, 5 జిల్లాలలో స్కిల్ కాలేజీల ప్రారంభానికి సన్నద్ధం

* మంత్రి మేకపాటితో చిన్నారుల బొమ్మల తయారీ సంస్థ ‘పాల్స్ పుష్’ ప్రతినిధుల భేటీ

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: ఈ ఏడాది డిసెంబరులో నైపుణ్య విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన జరిగే విధంగా అడుగు ముందుకు వేయాలని పరిశ్రమలు, ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అందకోసం అవసరమైన పరిపాలన విభాగ అనుమతులు పొందేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం   చేశారు. వెలగపూడి సచివాలయంలో త‌మ శాఖపై మంత్రి స‌మీక్ష నిర్వహించారు. స్కిల్ కాలేజీలు, యూనివర్శీటీల ఏర్పాటులో ప్రగతి పనులపై మంత్రి మేకపాటి ప్రధానంగా చర్చించారు. పరిశ్రమల ఆధారిత నైపుణ్య శిక్షణ, ఉపాధికి పెద్దపీట వేసేలా చేపడుతోన్న చర్యలను నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి.అనంతరాము మంత్రి గౌతమ్‌రెడ్డికి వివరించారు. ముందుగా శ్రీసిటీలో మొదలై తరువాత రాష్ట్రమంతటా ఈ ప్రక్రియ వేగంగా పూర్తి చేయనున్నట్లు ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న 20 స్కిల్ కాలేజీలకు ఇప్పటికే భూ కేటాయింపుల ప్రక్రియ పూర్తయిందని ఏపీఎస్ఎస్ డీసీ ఎండీ, సీఈవో అర్జా శ్రీకాంత్ మంత్రి మేకపాటికి వివరించారు. మరో 5 కాలేజీలకు కూడా భూ కేటాయింపుల వ్యవహారం వివిధ దశలలో ఉన్నాయన్నారు. తిరుపతిలో స్కిల్ యూనివర్శిటీ, విశాఖపట్నం, చిత్తూరు, ఏలూరు, నెల్లూరు, కడప జిల్లాలో ముందు స్కిల్ కాలేజీల ప్రారంభిస్తే ఎలా ఉంటుందన్న అంశంపైనా మంత్రి మేకపాటి ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపారు. నైపుణ్యవిశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన నిధుల సమీకరణపైనా ఈ సందర్భంగా చర్చించారు. మంత్రి సమీక్షకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి.అనంతరాము, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీఎస్ఎస్డీసీ సీఈవో, ఎండీ అర్జా శ్రీకాంత్ ,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, తదితరులు హాజరయ్యారు.

సమగ్ర పరిశ్రమ సర్వేపై మంత్రి మేకపాటి ఆరా…
పరిశ్రమలకు సంబంధించిన సమగ్ర పరిశ్రమ సర్వే జరుగుతున్న తీరుపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆరా తీశారు. ఇప్పటికే సుమారు 98వేల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలలో దాదాపు 28వేల పరిశ్రమలకు సంబంధించిన సర్వే పూర్తయినట్లు అధికారులు మంత్రికి వివరించారు. దాదాపు 900 పెద్ద, భారీ పరిశ్రమలలో 86 పరిశ్రమలకు సంబంధించిన సర్వే పూర్తయినట్లు మంత్రికి స్పష్టం చేశారు. సర్వే సందర్భంగా ప్రతి పరిశ్రమకూ ఆధార్‌ నంబర్‌లా 11 అంకెలతో ఓ ప్రత్యేక అంకెను కేటాయించడంతో పాటు పరిశ్రమల అవసరాలకు సంబంధించిన తొమ్మిది రకాల కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఏ రంగం, ఎంత ఉపాధి, హానికర రసాయనాల నిల్వ వివరాలు, పరిశ్రమలకు కావలసిన నైపుణ్యం సహా మొత్తం తొమ్మిది అంశాలపై నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలోని 13 జిల్లాలలో జరుగుతున్న సమగ్ర పరిశ్రమల సర్వేలో చిత్తూరు, విశాఖ, కర్నూలు, తూర్పుగోదావరి, నెల్లూరు పోటీ పడుతున్నట్లు అర్థమవుతుందని మంత్రి పేర్కొన్నారు. అత్యధికంగా కృష్ణా, విశాఖపట్నం జిల్లాలలో సగం సర్వే పూర్తయినట్లు మంత్రికి పరిశ్రమల శాఖ అధికారులు వివరించారు. పరిశ్రమలను బట్టి ఆరంజ్, గ్రీన్, రెడ్ గా గుర్తించడం కూడా సర్వేలో ఒక భాగం. అయితే, మెగా, భారీ పరిశ్రమలలో సర్వేకు ఎక్కువ సమయం పడుతుందని పేర్కొన్నారు. అయితే నిర్దేశించుకున్న లక్షా 2 వేల పరిశ్రమలకు సంబంధించిన సర్వే ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ 15 కల్లా పూర్తి చేయాలని మంత్రి మేకపాటి ఆదేశించారు.

మంత్రి మేకపాటిని కలిసిన షుగర్స్ డైరెక్టర్….
నైపుణ్య శాఖతో సమీక్ష అనంతరం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో షుగర్స్ డైరెక్టర్ వెంకటరావు కలిశారు. గత వారం విశాఖలో మంత్రుల బృందం చక్కెర కర్మాగారాలను సందర్శించడం అనంతరం చేపడుతోన్న ప్రక్రియపై డైరెక్టర్ తో మంత్రి గౌతమ్ రెడ్డి చర్చించారు. తాండవ, ఏటికొప్పాక చక్కెర కర్మాగారాల గురించి మాట్లాడారు. చక్కెర రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చెరకును తరలించే ప్రత్యామ్నాయాలపై ప్రత్యేకంగా మంత్రి మేకపాటి ఆరా తీశారు.

మంత్రితో చిన్నారుల ఆటబొమ్మల తయారీ సంస్థ ‘పాల్స్ పుష్’ ప్రతినిధుల భేటీ…
చిన్నారులు ఆడుకునే ఆట బొమ్మల తయారీ సంస్థ ‘పాల్స్ పుష్’ ప్రతినిధులు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని సోమవారం సచివాలయంలో కలిశారు. సంగీతం వినిపించే రంగురంగులతో తీర్చిదిద్దిన పిల్లల ఆట బొమ్మలను ప్రతినిధులు మంత్రికి చూపించారు. చైనాకు చెందిన ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు ప్రతినిధులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ టాయ్ మ్యానుఫాక్చరింగ్ బోర్డును ఏర్పాటు చేస్తే వాణిజ్యం, పెట్టుబడులకు అనువుగా ఉంటుందని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఫ్యాబ్రిక్, స్ట్రిచ్చింగ్ వంటి వాటిలో ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఉపాధి అవకాశాలుంటాయని మంత్రికి తెలిపారు. మహిళా సాధికారతకు కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యమవడానికి ఆసక్తి ప్రదర్శించారు. చైనా నుంచి దిగుమతులపై ఆంక్షల నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఇక్కడే తయారీ చేయడానికి గల అవకాశాలపై మంత్రి మేకపాటి చర్చించారు. ఎంత పెట్టుబడులు, ఎంత మందికి ఉపాధి, నైపుణ్య శిక్షణ ఇచ్చే అంశాలపై స్పష్టంగా ఒక నివేదిక అందించమని పాల్స్ పుష్ సంస్థ ప్రతినిధులను కోరారు. బొమ్మల తయారీకి దిగుమతి చేసే సంస్థలపైనా మంత్రి ఆరా తీశారు. నివేదిక తీసుకుని వస్తే పరిశీలించి , ముఖ్యమంత్రితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి గౌతమ్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

Just In...