Published On: Tue, Oct 20th, 2020

సౌర‌, ప‌‌వ‌న విద్యుత్తుకు ప్రోత్సాహం క‌ల్పిస్తాం…

* నెరెడ్‌క్యాప్ వైస్ ఛైర్మ‌న్‌, మేనేజింగ్ డైరెక్ట‌ర్ ర‌మ‌ణారెడ్డి

విజ‌య‌వాడ, సెల్ఐటి న్యూస్‌‌: రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్తు ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని ఆంధ్రప్రదేశ్ రెన్యూవబుల్ ఎనర్జి కార్పోరేషన్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌ యస్.రమణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని తమ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్‌పోర్టు పాలసి-2020, సౌర, పవన విద్యుత్తు ప్రాజెక్టులు ఏర్పాటు, తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కర్నూలు, కడప, అనంతపురం వంటి జిల్లాలో సోలార్ మరియు విండ్ పవర్ ప్రాజెక్టులకు అనువైన ప్రాంతాలు గుర్తించడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువుగా మెట్ట, సాగుచేయలేని భూములు ఉన్నాయని వాటిని దీర్ఘకాలిక లీజుకు తీసుకుని పెద్దఎత్తున సౌర, పవన మరియు పవన-సౌర హైబ్రీడ్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇక్కడ డవలపర్లు పవర్ ప్లాంట్లు నిర్మిస్తే అక్కడ ఉత్పత్త‌య్యే విద్యుత్తును ఇతర రాష్ట్రాలకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చొరవ తీసుకుంటుందన్నారు. సింగిల్ విండో విధానంతో ఇందుకు సంబంధించిన ఎనర్జీ ఎక్స్‌ప‌ర్టు పాలసీని రూపొందించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా కర్నూలు, వైయస్ఆర్ కడప, అనంతపురం జిల్లాల్లో 3 నుంచి 5 వేల మెగావాట్ల సామర్ధ్యం గల ఆల్ట్రా మెగా రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ పార్క్‌లను ప్రోత్సహించడానికి ప్రతిపాదించడమైనదని చెప్పారు. నూతన పాలసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, రైతులకు బహుళ ప్రయోజనాలు కలుగుతాయన్నారు. 3 నుంచి 5 వేల మెగావాట్ల సామర్ధ్యం స్థాపించడం ద్వారా వేలకోట్ల రూపాయలు పెట్టుబడులు ద్వారా కరువు పీడిత ప్రాంతం అయిన రాయలసీమ జిల్లాలు అభివృద్ధి చెందుతాయని ఆయన వివరించారు. రాష్ట్రంలో 1 ప్రాంతాలలో 6,300 మెగావాట్ల పంపుడ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసామన్నారు. వైయస్ఆర్ కడప జిల్లాలో గండికోటలో 600 మెగావాట్లు, అనంతపురం జిల్లా చిత్రావతిలో 500 మెగావాట్లు, నెల్లూరు జిల్లా సోమశిలలో 1200 మెగావాట్లు, కర్నూలు జిల్లా వోక్‌లో 800 మెగావాట్లు, విజయనగరం జిల్లాలో కురుకుట్టిలో 1200 మెగావాట్లు, కర్రివలసలో 1000 మెగావాట్లు, విశాఖపట్నం జిల్లా ఎర్రవరంలో 1000 మెగావాట్లుతో పంపుడ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఏర్పాటుకు అవసరమైన సాధ్యత డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు, ఇతర వివరణాత్మక నివేదికలను 30 నెలల కాలపరిమితిలో వాటిని అందించేందుకు బిడ్డర్లను ఎంపిక చేసామన్నారు.

రాష్ట్రంలో ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు, ఐఐటి, దేవాలయాలు, కళాశాలలు, పాఠశాలలు వంటి ప్రభుత్వ విభాగాలలో ఇంతవరకూ 19.50 మెగావాట్ల గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్స్ ప్రోత్సహించడం జరిగిందన్నారు. క్రొత్త జాతీయ బయోగ్యాస్, సేంద్రీయ ఎరువు కార్యక్రమం క్రింద రాష్ట్రంలో 3 లక్షల బయోగ్యాస్ ప్లాంట్లు నిర్మించబడ్డాయన్నారు. రాష్ట్రంలో మొదటి దశలో ప్రస్తుతం 300 ఎలక్ట్రిక్ కార్లు వినియోగంలో ఉన్నాయన్నారు. రెండవదశ క్రింద రాష్ట్రంలో తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలతో పాటు ప్రధాన జిల్లా కేంద్రాలలోని 83 ప్రాంతాల్లో 460 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. వీటి ఏర్పాటుకు ముందుకు వచ్చేవారి సమాచారం నిమిత్తం జాబితాలను అందజేయడం జరిగిందన్నారు. అదేవిధంగా తమ సంస్థ హర్యానాలోని మనేసార్ లోని ఐక్యాట్ తో సమన్వయం చేసుకుని ఆటోకాంపోనెంట్స్, వెహికల్స్, ఇంటిలిజెన్స్ టెస్టింగ్ ట్రాక్‌లు ఏర్పాటుకు రూ.250 కోట్లు పెట్టుబడితో టెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటు కోసం ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమేటివ్ టెక్నాలజీ నుండి ప్రభుత్వం యల్‌ఓఐ పొందిందన్నారు. ఆటోలకు ఎలక్ట్రిక్ రిక్ట్రో ఫిట్ కిట్స్ అందించే విషయంలో కూడా అధ్యయనం జరుగుతుంద‌ని పేర్కొన్నారు. ఇప్పటికే క్రొత్త ఆటోలు రూపొందుతుండగా, పాతవాటిని బ్యాటరీలతో కూడిన ఎలక్ట్రిక్ రెట్రో ఫిట్ కిట్స్ తో ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వాటి మార్పుకు ఒక ఆటోకు రూ.50 నుండి రూ.60 వేలు ఖర్చుకాగలదని, అయితే దీర్ఘకాలికంగా ఇంధనంపై ఖర్చును నియంత్రించుకోవచ్చ‌ని తెలిపారు. ఈ సందర్భంగా సోలార్, విండ్ ప్రాజెక్ట్స్, విండ్-సోలార్ హైబ్రీడ్ పవర్ ప్రాజెక్ట్స్, స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్స్ తదితర ప్రాజెక్టులను నెరెడ్ క్యాప్ (యన్‌ఆర్‌ఇడిసిఏపి) ప్రోత్సహిస్తున్న
తీరును ఆయన వివరించారు.

Just In...