Published On: Tue, Oct 20th, 2020

ఏపీలో న‌వంబ‌రు 2నుంచి పాఠ‌శాల‌లు ప్రారంభం

* కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని అధికారుల‌కు సీఎం జ‌గ‌న్ ఆదేశం

* ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో హెల్ప్‌ డెస్కులు త‌ప్ప‌నిస‌రి

* ఆరోగ్యమిత్రలు లంచం ఆశించ‌కుండా చూడాలి

* స్పంద‌న కార్య‌క్ర‌మంపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్య‌మంత్రి స‌మీక్ష‌

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: సుదీర్ఘ లాక్‌డౌన్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. నవంబర్ 2వ తేదీ నుంచి పాఠశాలను పునఃప్రారంభించనున్నట్లు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఈ సంద‌ర్భంగా మంగళ‌వారం తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యం నుంచి నిర్వ‌హించిన ‌స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పాఠశాలల పునఃప్రారంభంపై సీఎం స్పందించారు. నవంబరు 2 నుంచి పాఠశాలల్లో రోజు విడిచి రోజు తరగతులకు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించాలని.. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పనిచేయాలని స్పష్టం చేశారు. 1, 3, 5, 7వ తరగతుల విద్యార్థులకు ఒక రోజు … 2, 4, 6, 8వ తరగతుల విద్యార్థులకు మరో రోజు తరగతులు నిర్వహించాల్సిందిగా సీఎం ఆదేశించారు. పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు నిరాకరించినట్లయితే ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. కాగా విద్యార్థుల సంఖ్య. 750కి పైగా ఉంటే మూడు రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలని.. 750కి తక్కువగా ఉన్నట్లయితే రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించాలని సూచించారు. అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం విధిగా అమలు చేయాలని ఆదేశించారు. నవంబరు మొత్తం ఒకపూటే తరగతులు నిర్వహిస్తామని.. పాఠశాలల నిర్వహణ వేళలపై పరిస్థితి మేరకు డిసెంబరులో మరోసారి నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు, సహాయ పునరావాస కార్యక్రమాలు, నష్టంపై అంచనాలు. కోవిడ్ నివారణ చర్యలు, సీజనల్‌ అంటువ్యాధుల నివారణ, ఉపాధి హామీ పనులు: లేబర్‌ బడ్జెట్, గ్రామ సచివాలయాల భవనాలు, ఆర్బీకేల నిర్మాణం, డాక్టర్‌ వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణం. నాడు–నేడు: పాఠశాలలు, అంగన్‌వాడీలు, ఆస్పత్రులు. గ్రామ, వార్డు సచివాలయాలు, అధికారుల తనిఖీలు. జగనన్న తోడు పథకం. వైయస్సార్‌ బీమా నమోదు. ఇంధన శాఖ ప్రత్యక్ష నగదు బదిలీ. (వైయస్సార్‌ ఉచిత విద్యుత్‌)తో పాటు అక్టోబ‌రు, న‌వంబ‌రు మాసాల్లో అమలు చేయనున్న పథకాల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షించారు. అలాగే, వైయస్సార్‌ బీమా , వైయస్సార్‌ రైతు భరోసా, జగనన్న తోడు, రైతులకు సున్నా వడ్డీ రుణాలు, మనబడి నాడు–నేడు, ఆరోగ్యశ్రీ పథకం 6 జిల్లాలలో 2 వేల వ్యాధులకు విస్తరణ, జగనన్న వసతి దీవెన తదితర అంశాలపై సీఎం సమీక్ష జ‌రిపారు. స‌మీక్ష‌లో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, సీఎస్‌ నీలం సాహ్ని, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వరద బాధితులను మానవతా దృక్పథంతో వ్యవహరించాల,. కలెక్టర్లు, జేసీలు ఈ విషయంలో ఉదారంగా ఉండాలి. వరద పీడిత ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు (ముంపునకు గురైన ఇళ్లు) 25 కేజీల బియ్యం, ఒక కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో ఆలుగడ్డలు తప్పనిసరిగా పంపిణీ చేయాలి. అదే విధంగా సహాయ శిబిరాల్లో ఉన్నవారిని వెనక్కి పంపించేటప్పుడు రూ.500 వారి చేతిలో పెట్టండి. ఆ కుటుంబానికి ఆ మొత్తం ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. వారు ఇంటికి వెళ్లగానే ఈ ఇబ్బంది ఉండదు. చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం వెంటనే ఇచ్చే విధంగా చర్యలు చేపట్టండి. ఇప్పటి వరకు 19 మంది చనిపోగా, 14 మందికి ఇచ్చారు. మరో 5 గురు పెండింగ్‌లో ఉన్నాయి, ఆ కుటుంబాలకు కూడా వెంటనే ఆ పరిహారం ఇవ్వండి. పంట నష్టంపై పూర్తి స్థాయిలో అంచనాలు రూపొందించి ఈనెల 31వ తేదీలోగా కలెక్టర్లు నివేదికలు పంపాలి. వరద నష్టం అంచనాలతో పాటు, కావాల్సిన బడ్జెట్‌ ప్రతిపాదనలు కూడా ఈనెల 31లోగా పంపాలి. ఈ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటిస్తూ ఆ రైతుల పేర్లు ఆర్బీకేలలో ప్రదర్శించాలి. ఎవరైనా రైతులు తమ పేర్లు లేవని చెబితే సోషల్‌ ఆడిట్‌ చేయాలి. ఈ–క్రాపింగ్‌ నమోదు ఆధారంగా సాగు చేస్తున్న రైతులను పక్కాగా గుర్తించాలి. వెంటనే రహదారులకు తాత్కాలిక మరమ్మతులు చేయండి. శానిటేషన్, శుభ్రమైన తాగునీరు సరఫరాపై దృష్టి పెట్టండి. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒక సీజన్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీని అదే సీజన్‌లో ఇస్తున్నాం. ఈ ఏడాది ఖరీఫ్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీని వైయస్సార్‌ రైతు భరోసా రెండో విడత చెల్లింపులతో పాటు ఇవ్వబోతున్నాం. జూన్, జూలై, ఆగస్టుతో పాటు, సెప్టెంబరు నెల ఇన్‌పుట్‌ సబ్సిడీని ఈనెల 27న ఇస్తున్నాం. ఖరీఫ్‌ పంటలకు సంబంధించి రూ.113 కోట్లు, ఉద్యాన పంటలకు సంబంధించి మరో రూ.32 కోట్లు. మొత్తం రూ.145 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని రైతులకు చెల్లించబోతున్నాం. అక్టోబరు నెలకు సంబంధించిన ఇన్‌పుట్‌ సబ్సిడీపై నవంబరు 15లోగా నివేదిక ఇవ్వాలి.
అటవీ భూముల పట్టాలు (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) ఇచ్చిన గిరిజనులకు కూడా వైయస్సార్‌ రైతు భరోసా కింద ఈనెల 27న రూ.11,500 చొప్పున ఇవ్వబోతున్నాం. రాష్ట్రంలో ఇప్పుడు రోజూ దాదాపు 70 వేల పరీక్షలు చేస్తున్నాము, మరోవైపు పాజిటివిటీ రేటు కూడా గణనీయంగా తగ్గింది. నిన్న (19వ తేదీ) పాజిటివిటీ రేటు 4.76 శాతం మాత్రమే. ఇదే గత వారంలో 5.5 శాతంగా నమోదైంది. ప్రతి 10 లక్షల మందిలో 1,33,474 మందికి వైద్య పరీక్షలు చేస్తూ, దే«శంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. రికవరీ రేటు 94.5 శాతం కూడా రాష్ట్రమే తొలి స్థానంలో ఉంది. కోవిడ్‌ తగ్గిన తర్వాత కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశానికి సంబంధించిన సర్వే చూస్తే, కోవిడ్‌ వచ్చి తగ్గిన తర్వాత కూడా ఒక 10 శాతం కేసుల్లో మళ్లీ కొత్తగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కిడ్నీ, బ్రెయిన్, చెవుడు వంటి పలు సమస్యలు వస్తున్నాయి. కోవిడ్‌ తగ్గిన తర్వాత కూడా కనీసం 6 వారాల నుంచి 8 వారాల పాటు రోగులు జాగ్రత్తగా ఉండాలన్న దానిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. వారికి ఓరియెంటేషన్‌ నిర్వహించాలి. పోస్టు కోవిడ్‌ అనారోగ్య సమస్యలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాము. ఆ మేరకు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశాము. 104 నంబరుపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాలి. ఆ నెంబరుకు ఫోన్‌ చేస్తే 30 నిమిషాల్లో బెడ్‌ కేటాయించాలి. దాదాపు 200కు పైగా ఉన్న కోవిడ్‌ ఆస్పత్రుల్లో ఆహార నాణ్యత, శానిటేషన్, వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటు ఎలా ఉంది?. ఈ 4 అంశాలపై కోవిడ్‌ ఆస్పత్రుల్లో డ్రైవ్‌ కంటిన్యూ కావాలి. ప్రతి ఆస్పత్రిలో హెల్ప్‌ డెస్క్‌లు ఉండేలా చూడాలి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్యశ్రీ  ఆస్పత్రుల్లో తప్పనిసరిగా హెల్ప్‌ డెస్కులు ఉండాలి, వచ్చే 15 రోజుల్లో ఆ ఏర్పాట్లు జరిగి తీరాలి. ప్రతి హెల్ప్‌ డెస్క్‌ వెనక పోస్టర్‌ కూడా పూర్తి వివరాలతో ఉండాలి. డెస్కులో ఇద్దరు ఆరోగ్యమిత్రలు ఉండాలి. ఆ విధంగా రోజంతా ఆరోగ్యమిత్రలు సేవలందించాలి.
ప్రతి ఆస్పత్రిలో హెల్ప్‌ డెస్కులను గమనించేలా సీసీ కెమెరాలు ఉండాలి, వాటిని జేసీలు పర్యవేక్షించాలి. ప్రతి ఆరోగ్య శ్రీ ఆస్పత్రి (ప్రభుత్వ, ప్రైవేటు)లో సీసీ కెమెరాలు ఉండి తీరాలి. ఆ హెల్ప్‌ డెస్కులలో కేవలం కూర్చోవడమే కాకుండా, ఆరోగ్యమిత్రలు ఏం చేయాలన్న దానిపై ఒక నిర్దిష్ట ఎస్‌ఓపీ ఖరారు చేయండి. తను ఎందుకు కూర్చున్నాడు? తాను ఏం చేయాలి? తనపై సీసీ కెమెరా నిఘా ఎందుకు ఉంది? తాను రోగులకు ఏ రకంగా సహాయం చేయాలి? అన్న దానిపై ఆరోగ్యమిత్రలకు స్పష్టమైన అవగాహన ఉండాలి. రోగుల నుంచి కానీ, ఆస్పత్రి నుంచి కానీ ఆరోగ్యమిత్రలు లంచం ఆశించకుండా చూడాలి. ఎవరైనా లంచం అడిగితే, ఎవరికి ఫిర్యాదు చేయాలో, ఆ నెంబర్‌ను పోస్టర్‌ ద్వారా ప్రదర్శించాలి. మనం ఒక రోగిగా ఆస్పత్రికి వెళ్తే, ఏ సహాయ, సహకారాలు కోరుకుంటామో, అవన్నీ ఆరోగ్యమిత్రలు చేయాలి. ఆ మేరకు ఎస్‌ఓపీ ఖరారు చేయాలి. ప్రతి ఆరోగ్యమిత్ర ప్రతి రోజూ జిల్లా వైద్యాధికారికి 4 అంశాలపై నివేదిక ఇవ్వాలి. ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటు, మందుల అందుబాటు. వైద్య సేవలపై ఆరోగ్యమిత్రలు రోజూ నివేదిక ఇవ్వాలి. ఆ విధంగా ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో సేవలందేలా చూడడం కలెక్టర్లు, జేసీలు, ఆరోగ్య శాఖ కార్యదర్శి బాధ్యత.

కోవిడ్‌ నేపథ్యంలో వచ్చే 10 రోజులు డ్రైవ్‌
చేపట్టాలి. కోవిడ్‌ వస్తే ఏం చేయాలన్న దానిపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలి. 104 నెంబర్‌. తప్పనిసరిగా మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులు తరుచూ శభ్రంగా కడుక్కోవడం. ఈ నాలుగింటిపై స్కూళ్లు తెరిచిన తర్వాత పిల్లలకు ఓరియెంటేషన్‌ చేయాలి. వర్షాలు, వరదలు తగ్గిన తర్వాత అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి శానిటేషన్, పరిశుభ్రమైన నీరుపై దృష్టి పెట్టాలి. అవసరమైన అన్ని మందులు.. పాముకాటుకు విరుగుడు ఇంజెక్షన్, కుక్క కరిస్తే ఇచ్చే ఇంజెక్షన్లు కూడా ఉండాలి. అన్ని మందులు డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలు కలిగి ఉండాలి. 104 నెంబరు కేవలం కోవిడ్‌కు మాత్రమే కాకుండా, ఇతర వైద్య సేవలకు కూడా సేవలందించేలా ఉండాలి. ముఖ్యంగా అంటువ్యాధుల విషయంలో కలెక్టర్లు పూర్తి అప్రమత్తంగా ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, వైయస్సార్‌ ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, స్కూళ్లకు ప్రహరీల నిర్మాణం వచ్చే ఏడాది మార్చి 31 వరకు పూర్తి కావాలి. ప్రతి జిల్లాకు రూ.10 కోట్ల విలువైన పని దినాలు ఇస్తున్నాం. వారు సకాలంలో అన్నీ పూర్తి చేస్తే, అదనంగా మరో 5 కోట్ల పని దినాలు ఇస్తాము.

Just In...