Published On: Thu, Oct 22nd, 2020

దుర్గ‌గుడి అభివృద్ధికి రూ.70 కోట్లు నిధులు మంజూరు

* సీఎం చిత్త‌శుద్ధికి నిద‌ర్శ‌న‌మ‌న్న మంత్రి వెలంప‌ల్లి

* ఇంద్ర‌కీలాద్రిపై విరిగిప‌డిన కొండ‌చ‌రియ‌లు

* ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించిన అనంత‌రం నిధులు ప్ర‌క‌టించిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌

* మీడియాకు తెలిపిన ఆల‌య ఛైర్మ‌న్ పైలా సోమినాయుడు

ఇంద్ర‌కీలాద్రి‌, సెల్ఐటి న్యూస్‌: శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల  దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి రూ.70 కోట్లు ప్రకటించిన‌ట్లు ఆల‌య ఛైర్మ‌న్ పైలా సోమినాయుడు మీడియాకు తెలిపారు. బుధ‌వారం మూలా న‌క్ష‌త్రం సంద‌ర్భంగా క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు సీఎం జ‌గ‌న్ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున పట్టు వస్త్రాలు సమర్పించారు.
ముఖ్య‌మంత్రి రాకమునుపు మ‌ధ్యాహ్నం 3గంట‌ల స‌మ‌యంలో ఇంద్ర‌కీలాద్రిపై దుర్గ‌గుడికి అత్యంత స‌మీపంలో మీడియా సెంట‌ర్ వ‌ద్ద పెళ‌పెళ‌మంటూ పెద్ద శ‌బ్ధంతో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.
క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వెంట‌నే క్రేన్‌ను ర‌ప్పించి శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా? లేదా? అనే విషయాన్ని ప‌రిశీలించారు. ఎవ‌రూ లేక‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. కొండ చరియలు విరిగిపడటంతో ఓ రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయారా? అనే కోణంలో శిథిలాలను వేగంగా తొలగించి ప‌రిశీలించారు. కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో దర్శనాలు నిలిపివేశారు. ఈ క్ర‌మంలో దసరా ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఇంద్రకీలాద్రికి సీఎం పర్యటన నేపథ్యంలో ఆ ప్రదేశంలో రాకపోకలు నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘ‌ట‌న జ‌రిగిన ‌కొద్ది స‌మ‌యం త‌రువాత ఇంద్ర‌కీలాద్రికి వ‌చ్చిన సీఎం జ‌గ‌న్ ‌దేవస్థానం అభివృద్ధికి రూ.70 కోట్లు నిధులు మంజూరు చేశారని సీఎం పర్యటన అనంతరం మీడియా పైలా సోమినాయుడు ‌మీడియా ప్రతినిధులకు వివరించారు. ఈ నిధులకు సంబందించి త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎం అన్నారని తెలిపారు. ఆలయ అభివృద్దిలో భాగంగా కొండప్రాంతాన్ని పటిష్ట పరిచేందుకు రివిట్మెంట్ పనులకు, నిత్యాన్నదానం వంటశాలకు సంబందించి సోలార్ విద్యుత్ ఏర్పాటుకు, కేశఖండనశాల నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు ఈ నిధులను వినియోగించడం జరుగుతుందని చైర్మన్ సోమినాయుడు, ఆలయ కార్యనిర్వాహణాధికారి, యం.వి.సురేష్‌బాబు తెలిపారు. మీడియా సమావేశంలో జిల్లా కలెక్టరు ఏ.ఎండి.ఇంతియాజ్, ఆల‌య కమిటీ సభ్యులు సుజాత, కనుగుల బాల త‌దిత‌రులు పాల్గొన్నారు.

సీఎం చిత్త‌శుద్ధికి ఇదో నిద‌ర్శ‌నం… (మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు)
దుర్గ‌గుడి అభివృద్ధి కి రూ.70 కోట్లు నిధులు మంజూరు చేయడం పట్ల రాష్ట్ర దేవాదాయ ధ‌ర్మాదాయ శాఖా మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు స్పందించారు. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి ని‌ధులు మంజూరు చేయడం పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేవాలయాల అభివృద్ధి పట్ల సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో పూర్తీ ఆరోగ్యంతో కోలుకొని తాను అపోలో హాస్పిటల్ నుంచి డిశ్ఛార్జ్ అయినట్లు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. త‌న‌పై అభిమానంతో అండగా నిలిచిన సీఎం జగన్ మోహన్ రెడ్డికి, సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు, అభిమానులకు ఆయ‌న పేరుపేరున ధన్యవాదాలు
తెలిపారు. త్వ‌రలో అందరం కలిసి ప్రజా సేవకు అంకితం అవుదామని పేర్కొన్నారు.

 

Just In...