Published On: Thu, Oct 22nd, 2020

పదవుల నియామకాల్లో అన్ని జిల్లాలకు ప్రాధాన్యం

* మంత్రి కొడాలి నాని

గుడివాడ‌, సెల్ఐటి న్యూస్‌: బీసీ కార్పొరేషన్ పదవుల నియామకాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం స్థానిక రాజేంద్రనగర్‌లోని ఇంటి దగ్గర మంత్రి కొడాలి నాని ఏపీ స్టేట్ చాత్తాడ శ్రీ వైష్ణవ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన టి సీతారావమ్మను కలిశారు. ఈ సందర్భంగా సీతారావమ్మ మంత్రి కొడాలి నాని దుశ్శాలువతో  ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలోని 139 బిసి కులాలకు ప్రాతినిధ్యం వహించేలా ఒకేసారి 56 ప్రత్యేక కార్పొరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.  వీటికి 56 మంది చైర్మన్లు 672 మంది డైరెక్టర్లను నియమించడం జరిగిందన్నారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం ఇస్తామన్నా మాటను నిలబెట్టుకుంటూ సగానికి సగానికిపైగా 339 డైరెక్టర్ పదవులను మహిళలకు కేటాయించారన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుండి రాష్ట్రంలో బీసీల అభ్యున్నతికి కృషి చేస్తూ వస్తున్నారు. మంత్రివర్గంలోను బీసీలకు పెద్దపీట వేశారన్నారు. ఉపముఖ్యమంత్రి  పదవితో పాటు,  నేడు మంత్రి పదవులు, శాసనసభ స్పీకర్ పదవిని బీసీలకు కట్ట పెట్టాలన్నారు గత 16 నెలల కాలంలో వివిధ పథకాల ద్వారా 2 కోట్ల 71 లక్షల 37 వేల 253 మంది బీసీలకు రూ.33 వేల 500 కోట్ల మేర ప్రయోజనాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. సీఎం  జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి పథకం లోనూ బీసీలకు కు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి, అంకితభావం, నిబద్ధత ఉన్నాయని చెప్పారు. స్వాతంత్రం వచ్చిన నాటినుండి ఎప్పటి వరకు పదవులు దక్కని కులాలకు కూడా బిసి కార్పొరేషన్ల ద్వారా న్యాయం చేయడం జరుగుతుందని చెప్పారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో బీసీల జీవితాల్లో మార్పులు తీసుకు వచ్చేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేశారన్నారు. ఆ తర్వాత సీఎం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో అటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి అని అన్నారు. ముఖ్యంగా రాజకీయంగా ఎదుగుదలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని అన్నారు. బీసీలకు ఎటువంటి సమస్యలు వచ్చిన కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం రానున్న కాలంలో ఆంద్రప్రదేశ్ చరిత్రలో బీసీల అభ్యున్నతికి కార్పొరేషన్‌ల ఏర్పాటు అతిపెద్ద ముందడుగు అవుతుందని మంత్రి నాని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో వైస్సార్ సీపీ నాయకులు టి.రమణకుమార్, సుధీర్‌కుమార్,
కృష్ణమోహన్, కృష్ణ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

 

Just In...