Published On: Sat, Oct 24th, 2020

దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది…

* కొండాలమ్మ ఆలయాన్ని ప్రసిద్ధ పుణ్య‌క్షేత్రంగా తీర్చిదిద్దుతా

* నూతన ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారోత్సవ సభలో మంత్రి కొడాలి నాని

గుడ్లవల్లేరు, సెల్ఐటి న్యూస్‌: కృష్ణాజిల్లాలోని గుడ్లవల్లేరు మండలం వేమవరంలో వేంచేసి ఉన్న కొండాలమ్మ అమ్మవారి ఆలయాన్ని రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్య‌క్షేత్రంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శుక్రవారం ఆలయ నూతన ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ విశిష్టమైన దేవత కొండాలమ్మ గుడివాడ నియోజకవర్గంలో కొలువుతీరి ఉండడం ఈ ప్రాంత ప్రజలకు ఒక వరమని అన్నారు. ఈ దేవాలయం త‌న చిన్నప్పుడు ఒక చిన్న దేవాలయంగా ఉండేదని, పరిసర గ్రామాల్లోని ప్రజల కోరికలను నెరవేర్చే దేవతగా భక్తులు నమ్ముతుంటారన్నారు. గ్రామానికి పరిమితమైన కొండాలమ్మ అమ్మవారు రాష్ట్రంలో లక్షలాది మంది భక్తుల నమ్మకాన్ని చూరగొందని చెప్పారు. నేడు అత్యంత ఆదాయం ఉన్న దేవాలయాల స్థానంలో కొండాలమ్మ దేవాలయం త్వరితగతిన చేరిందన్నారు. అటువంటి అమ్మవారిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులు దర్శించుకునేలా అవసరమైన వసతులు, మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దేవాలయం అభివృద్ధి విషయంలో అవసరమైనన్ని నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. రెండేళ్ల పాటు పదవిలో ఉండే ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు దేవాలయానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆలయంలో జరిగే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని భక్తుల మనోభావాలకు అనుగుణంగా నిర్వహించాలని ట్రస్ట్ బోర్డ్‌ను ఆదేశించారు. ఇదిలా ఉండగా విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో జరుగుతున్న దసరా ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని మూలా నక్షత్రం రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించాలని ఆలయ పాలకమండలి సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసిందన్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే గంట ముందు కొండ చరియలు విరిగి పడ్డాయన్నారు. వెంటనే వాటిని తొల‌గించామ‌న్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో విజయదశమికి రూ.45 కోట్లను మంజూరు చేసి సీఎం హోదాలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారని అర్చకులు సీఎం జగన్మోహన్ రెడ్డికి గుర్తు చేశారన్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దేవాలయం డబ్బులను వాడుకున్నాయే తప్పించి అభివృద్ధికి పైసా కూడా ఇవ్వలేదన్నారు. దేవాలయ సమస్యలను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆ కనకదుర్గ అమ్మవారే ఈ కార్యక్రమం చేపట్టి ఉంటారని తాను, రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడుతున్నారన్నారు. రోజు దాదాపు 15 వేల మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారని, సీఎం రాకను దృష్టిలో పెట్టుకొని పోలీసులు విధించిన ఆంక్షలు కారణంగా, అమ్మ వారి ఆశీస్సుల వల్ల కొండ చరియలు విరిగి పడినా ఏ ఒక్క భక్తునికి ఇబ్బంది కలగలేదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలయానికి వచ్చే వరకు రూ. 70 కోట్ల పనులను ఆయన ప్రారంభిస్తారని ఎవరికీ తెలియదన్నారు. కొండచరియల రూపంలో ఆ తల్లి సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి గుడి సమస్యలను తీసుకు వెళ్ళిందని అన్నారు. కాగా ఈ కొండాలమ్మ ఆలయానికి కూడా ట్రస్ట్ బోర్డు సభ్యులను ఆ తల్లి ఎన్నుకుందని భావిస్తున్నానన్నారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన మాస్టర్ ప్లాన్ను తయారు చేయించాలని సూచించారు. అవసరమైతే ఆలయం సమీపంలో కొంత పొలాన్ని కూడా తీసుకుందామని, అమ్మవారి ఆధ్యాత్మిక కార్యక్రమాల సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూద్దామన్నారు. ముఖ్యంగా కొండలమ్మ ఆలయానికి ఎక్కువ మంది భక్తులను తీసుకు రావాల్సి ఉందని, రాష్ట్రంలో టాప్ టెన్ దేవాలయాల్లో కొండాలమ్మ ఆలయాన్ని నిలబెట్టాలని అన్నారు. దేవాలయాలు, చర్చిలు, మసీదుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పాదయాత్ర సమయంలో బొమ్ములూరు వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఆలయ వేద పండితులు కలిసి ఆశీర్వదించి, గుడి సమస్యలను తీసుకువచ్చారని గుర్తు చేశారు.
సమాజంలో మనం ఏదైనా తప్పు చేస్తే మన పిల్లలు, వాళ్ల పిల్లలు అనుభవించే పరిస్థితి ఉంటుందని, అలా తప్పు చేయకుండా చేయగలిగే శక్తి ఒక దేవుడికే ఉందన్నారు. ప్రతి వ్యక్తి తాను నమ్మే దేవుడుని  ఆరాధించేందుకు దేవాలయాలకు వెళ్లాలని సూచించారు. భక్తితో దేవుని ఆరాధిస్తే నేరాలు, ఘోరాలు తగ్గుతాయని సీఎం జగన్మోహన్ రెడ్డి నమ్ముతారన్నారు. ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ముందుగా మంత్రి కొడాలి నానికి ఆలయ మర్యాదలతో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని కొండాలమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంత‌రం మంత్రి కొడాలి నానిని అర్చకులు శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. ఆలయ ఈవో నటరాజన్ షణ్ముగం మంత్రి కొడాలి నానికి, వైసిపి రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్‌లకు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ సమక్షంలో నూతన ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా కనుమూరి రామిరెడ్డి, సభ్యులుగా బాడిగ లీలా సౌజన్య,  మన్నెం అమల, పడవల వెంకటేశ్వరరావు, పామర్తి వెంకటస్వామి, డోకాల భాగ్యలక్ష్మి, వల్లూరి పద్మావతి, నారేపాలెం వెంకట నిర్మల, ఈడే విజయ నిర్మల, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఆర్ఎస్ఎస్ సంతోష్ శర్మ ప్రమాణస్వీకారం చేశారు. నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులను మంత్రి కొడాలి నాని ఘనంగా సత్కరించారు.
ప్రమాణస్వీకారోత్సవ సభకు న్యాయవాది ప్రభాకర్ అధ్యక్షత వహించగా, కార్యక్రమంలో వైసిపి నాయకులు పాలేటి చంటి, పాలడుగు రాంప్రసాద్, కసుకుర్తి జనార్ధన్, కోగంటి ధనుంజయ, సాయన రవికుమార్, వడ్లమూడి చిన్ని, నిమ్మగడ్డ కుటుంబరావు, దుగ్గిరాల శేషుబాబు, పడమట సుజాత, శీరం వెంకట సుబ్బారావు, పి.ప్ర‌భాకర్, అల్లూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

 

Just In...