Published On: Sat, Oct 24th, 2020

కృష్ణానదిలో తెప్పోత్సవం ర‌ద్దు…

* కేవ‌లం ఫంట్‌పై ఆచారం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహణ

* పైవంతెన‌పై వాహనాలు, భక్తులను అనుమతి నిరాక‌ర‌ణ‌

* వెల్ల‌డించిన కలెక్టర్ ఇంతియాజ్‌, సీపి శ్రీనివాసులు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: శ్రీదుర్గామల్లేశ్వరస్వామి శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా కృష్ణానదిలో జరిగే తెప్పోత్సవానికి అధికారులు పాక్షికంగా అనుమతినిచ్చారు. కృష్ణానది వరద కొనసాగుతున్న నేప‌‌ధ్యంలో న‌దీ విహారోత్స‌వం ర‌ద్దు చేసి కేవ‌లం హంస వాహనాన్ని నది ఒడ్డునే నిశ్చలంగా నిలబెట్టి అందులో ఆచారం ప్రకారం ఆలయ వేదపండితులు, అర్చకులు విగ్రహాలను తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ విష‌య‌మై శనివారం స్థానిక మోడల్ గెస్ట్‌హౌస్‌లో సీపీ బి.శ్రీనివాసులు, కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ తెప్పోత్సవం నిర్వహణపై ప్రత్యేకంగా సమావేశ‌మ‌య్యారు. ఈ సందర్భంగా కలెక్టర్, నగర సీపిలు మాట్లాడుతూ ప్రస్తుతం వరద నీటి వరవడి కృష్ణానదికి కొనసాగుతుందన్నారు. ప్రకాశం బ్యారేజ్ కి 3 లక్షల 9 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందన్నారు. ఆ నీటినంతటినీ కాలువలు, ప్రకాశం బ్యారేజ్ ద్వారా సముద్రంలోకి వదులుతున్నామన్నారు. అయితే హంస వాహనం పై దుర్గామల్లేశ్వరస్వామి నదీ విహారం చేయాల్సి ఉందన్నారు. పోర్టు అధికారి ధర్మశాస్త్రి, నీటిపారుదల శాఖ ఇఇ స్వరూప్ నదీ విహారానికి అడ్డుచెప్పారు. హంసవాహనం నది ఒడ్డున నిశ్చలంగా నిలబడి అందులో దుర్గామల్లేశ్వర స్వామి, గంగాభవానీ, పార్వతిదేవీల విగ్రహాలను వేదపండితులు, అర్చకులు తీసుకురావడానికి మాత్ర‌మే అనుమతినిచ్చారు. తెప్పోత్సవర నిర్వహించే ఫంట్ సామర్ధ్యాన్ని తనిఖీ చేసి ఫిట్‌నెస్ దృవపత్రం తీసుకునేందుకు అనుమతినిస్తామని చెప్పారు. వరద ఉద్ధృతి ఆదివారం కూడా కొనసాగే అవకాశం ఉందని, ఈ క్ర‌మంలో ప్రకాశం బ్యారేజ్ నుండి మూడు లక్షల క్యూసెక్కుల నీరు వదులుతున్నందువల్ల ప్రవాహానికి హంస వాహనం కూడా నీటిలో కదిలే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. వాహనంపై వేదపండితులు 8 మంది, అర్చకులు ఇద్దరు, కర్రపుస్వాములు ఇద్దరు, కాగడాలు పట్టేవారు ఇద్దరు, బజంత్రీలు ఆరుగురు, ఆచారం ప్రకారం ఒక ఎస్ఐని కూడా అనుమతినిస్తున్నామన్నారు. వీరు మినహా ప్రోటోకాల్ పరంగా ఉన్న వ్యక్తులను మాత్రమే తెప్ప ఎక్కేందుకు అనుమతిస్తామని, కరోనా వ్యాధి ప్రభలుతున్నందున్న తెప్పపైకి ఎక్కువ మందిని అనుమతించడం లేదన్నారు. తెప్పపైకి వచ్చిన వారందరూ కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని ఒకే చోటికి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈఓ సురేష్‌బాబు కోరారు. ఎస్‌డిఆర్ఎఫ్, ఎడిఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ముందుజాగ్రత్త చర్యగా నదిలో నిఘా ఉంటారన్నారు. దాదాపు 30 అడుగుల లోతు నీరు ఉన్నందువల్ల స్వామివారి నదీ విహారానికి అంగీకరించడం లేదని మరోసారి స్పష్టం చేశారు.
సాయంత్రం 6 గంటలకు ప్రారంభ మైయ్యే తెప్పోత్సవం రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి హంస వాహనాన్ని నగర ప్రజలు వీక్షించవచ్చని వారు చెప్పారు. కొత్తగా నిర్మించిన ఫ్లై ఓవర్ పై వాహనాలు, భక్తులను కూడా వీక్షించేందుకు అనుమతించమని స్పష్టం చేశారు. టపాసులు పేల్చడానికి అనుమతినిచ్చారు. అయితే అది హంస వాహనానికి దూరంగా నిర్వహించాలని ఆదేశించారు. తెప్పోత్సవం ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో ఆలయ సాంప్రదాయ, ఆచారాలతో జరుగుతుందని అందుకు భక్తులందరూ సహకరించాలని కోరారు. సమావేశంలో విజయవాడ మున్సిపల్ కమీషనర్ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్లు రెవెన్యూ, ఆసరా కె.మాధవీలత, మోహన్‌కుమార్, దుర్గా ఉత్సవాల ప్రత్యేక అధికారి ఆజాద్, విజయవాడ సబ్ కలెక్టర్ హెచ్.ఎం.ధ్యానచంద్ర, డిఆర్వో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

 

 

Just In...