Published On: Sat, Oct 24th, 2020

శ్రీరాజ‌రాజేశ్వ‌రి దేవిగా నేడు దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం

* నేటితో ముగియ‌నున్న ద‌స‌రా మ‌హోత్స‌వాలు

* జ‌ల‌విహారం ర‌ద్దు… హంస‌వాహ‌నంపై కేవ‌లం పూజ‌ల‌కే ప‌రిమితం

ఇంద్ర‌కీలాద్రి, సెల్‌ఐటి న్యూస్‌: ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా 9వ రోజైన నిజ ఆశ్వ‌యుజ శుద్ధ న‌వ‌‌మి ఆదివారంనాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ శ్రీరాజ‌రాజేశ్వ‌రి దేవిగా ద‌ర్శ‌న‌మిస్తుంది. అనంత శ‌క్తి స్వ‌రూప‌మైన శ్రీచ‌క్రానికి క‌న‌క‌దుర్గ‌మ్మ అధిష్టాన‌దేవ‌త. శాంతి స్వ‌రూపంతో చిరున‌వ్వులు చిందిస్తూ ప‌సుపు, ఆకుప‌చ్చ‌, నీలం, గోధుమ‌, ఎరుపు రంగుల చీర‌లు ధ‌రించి చెర‌కుగ‌డ చేతిలో ప‌ట్టుకుని భ‌క్తుల‌కు దుర్గ‌మ్మ ద‌ర్శ‌న‌మిస్తుంది. ఇచ్ఛా, జ్ఞాన‌, క్రియా శ‌క్తుల‌ను భ‌క్తుల‌కు అనుగ్ర‌హించే ఈ శ‌క్తి స్వ‌రూపిణికి పాయ‌సం, చ‌క్రాన్నం, ద‌ద్యోజ‌నం, గారెలు, పూర్ణాలు, క‌దంబం పులిహోర‌, కేస‌రి … ఇలా ప‌దిర‌కాల రాజ‌భోగాల‌ను నైవేద్యంగా స‌మ‌ర్పిస్తారు. ఉత్స‌వాల ముగింపు సంద‌ర్భంగా విజ‌య‌ద‌శ‌మి రోజున సాయం సంధ్యా స‌మ‌యంలో దుర్గాదేవిని హంస వాహ‌నంపై ప‌విత్ర కృష్ణా తీరంలో ఊరేగిస్తారు. విద్యుత్తు దీపకాంతులు, మంగ‌ళ‌హార‌తులు, వేద‌మంత్రాలు, బాణాసంచా వెలుగుల న‌డుమ అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగే ఈ తెప్పోత్స‌వాన్ని తిల‌కించేందుకు భ‌క్తులు ఎంత‌గానో ఉవ్విళ్లూరుతారు.. కానీ.. కృష్ణా న‌దిలో వ‌ర‌ద‌నీరు భారీగా త‌ర‌లివ‌స్తున్న నేప‌ధ్యంలో హంస వాహ‌నంపై ఉత్స‌వ‌మూర్తుల జ‌ల విహారాన్ని నిలిపివేసి కేవ‌లం పూజ‌ల‌కే ప‌రిమితం చేయాల‌ని అధికార యంత్రాంగం నిర్ణ‌యం తీసుకుంది. జై భ‌వానీ.. జైజై జ‌గ‌జ్జ‌న‌నీ…!

Just In...