Published On: Sat, Oct 24th, 2020

స్థానిక ఎన్నికలను నిర్వహించే ఆలోచన లేదు..!

* ప్రజల శ్రేయస్సే ముఖ్యమన్న మంత్రి కొడాలి నాని

గుడ్ల‌వ‌ల్లేరు, సెల్ఐటి న్యూస్‌: స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించే ఆలోచన లేదని రాష్ట్ర ప్రజల శ్రేయస్సే ప్రభుత్వానికి ముఖ్యమని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి  శ్రీవెంకటేశ్వరరావు (నాని) స్పష్టం చేశారు. శనివారం గుడ్లవల్లేరు మండలం వేమవరంలో వేంచేసి ఉన్న శ్రీ కొండాలమ్మ తల్లి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మార్గదర్శకాల మేరకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకుంటూన్నాయన్నారు. వచ్చే నవంబర్, డిసెంబర్ నెలల్లో మరోసారి వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు ఇప్పటికే హెచ్చరించారన్నారు. గతంలో మాదిరిగా ఎన్నికల నిర్వహణకు ఎక్కువ మందిని తరలించడం సాధ్యం కాదన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో వాటిని రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా నిర్వహించాల్సిన పరిస్థితి ఉందన్నారు. వాటితో ఏపీలోని స్థానిక ఎన్నికలను పోల్చకూడదు అన్నారు.
రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందేనని మంత్రి వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో కొండాలమ్మ దేవస్థానం ట్రస్ట్‌బోర్డు చైర్మన్ కనుమూరి రామిరెడ్డి, వైసిపి నేత పాలడుగు రాంప్రసాద్, గుడ్లవల్లేరు మండల అధ్యక్షుడు రవికుమార్, మండల ప్రముఖులు పెన్నేరు ప్రభాకర్, మాధవ, అల్లూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Just In...