Published On: Sat, Oct 24th, 2020

దుర్గ‌మ్మ సేవ‌లో రాష్ట్ర మంత్రులు

ఇంద్ర‌కీలాద్రి, సెల్ఐటి న్యూస్‌: ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా ఇంద్ర‌కీలాద్రిపై 8వ రోజైన శ‌నివారం ‌రెండు అవ‌తారాల్లో కొలు‌వుదీరిన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను రాష్ట్ర ప్ర‌ముఖులు ప‌లువు‌రు ద‌ర్శించుకున్నారు. ఉద‌యం దుర్గాదేవి అలంకారంలో క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను రాష్ట్ర డీజీపి గౌతం స‌వాంగ్ ద‌ర్శించుకున్నారు. అదేవిధంగా శనివారం సాయంత్రం మహిషాసురమర్ధిని అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన దుర్గాదేవిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి
సుచరిత, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే విడుదల రజని స‌హా పలువురు ప్ర‌జాప్రతినిధులు, అధికారులు, తదితరులు అమ్మవారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. ఈ సంద‌ర్భంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖఃసంతోశాలతో ఉండాలని కోరుకున్న‌ట్లు తెలిపారు. మహిళలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ‌ వంటి చట్టాల పట్ల మరింత అవగాహన పెంచుకోవాలని, రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాలని కోరుకున్నట్టు చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రం పాడి పంటలతో విరాజిల్లాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని పేర్కొన్నారు. దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇది ఒక చరిత్ర అని వ్యాఖ్యానించారు.
 

Just In...