Published On: Sat, Oct 24th, 2020

వేద పఠనంతో రాష్ట్ర పురోభివృద్ధి…

* ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గిరిజా శంకర్

ఇంద్రకీలాద్రి, సెల్ఐటి న్యూస్‌: ఇంద్రకీలాద్రిపై శనివారం సాయంత్రం చతుర్వేద పండితులతో అత్యంత ఘనంగా వేద సభను నిర్వహించారు. వేద సభ‌కు ముఖ్య అతిథిగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎం.గిరిజా శంకర్, దేవాదాయ శాఖ కమిషనర్ పి.అర్జునరావు, ఆలయ ఈవో  ఎం.వి.సురేష్‌బాబు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా గిరిజా శంకర్ మాట్లాడుతూ, దుర్గాష్టమి, మహర్నవమి పుణ్యదినాన‌ వేద సభలో పాల్గొనడం వేద పండితుల ఆశీర్వాదం అమ్మవారి సన్నిధిలో అందుకోవడం త‌న అదృష్టం అన్నారు. వేద పఠనం రాష్ట్ర పురోభివృద్ధి, దేవాలయాలు అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని, వాటి మనుగడను కాపాడుకోవాలి, అందుకు త‌న వంతు కృషి చేస్తానని తెలిపారు. వేద సభను వ‌చ్చే ఏడాది మరింత చ‌క్క‌గా నిర్వహించడం జరుగుతుందని కమిషనర్ పి.అర్జునరావు తెలిపారు. కరోనా వల్ల ఈ ఏడాది పరిమితి సంఖ్యలోనే నిర్వహిస్తున్నామ‌ని, వేద పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు తగిన ప్రోత్సాహకాలు అందించి, వేదాలు పరిరక్షణకు, వేద విద్యను ప్రోత్సహించేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పాఠశాలతో సమన్వయం చేసుకునే, వాటి సిలబస్‌ను అన్ని వేద పాఠశాల ల్లో భోదించేందుకు చర్యలు తీసుకుంటునట్లు తెలిపారు. ఆలయ ఇఓ ఎంవి సురేష్‌బాబు మాట్లాడుతూ, దేవస్థానం ఆధ్వర్యంలో గత 30 ఏళ్ళు నుంచి వేద సభ నిర్వహించి వేద పండితులను సత్కరించటం ఆనవాయితీగా ఉందన్నారు. ప్రతి ఏడాది 400 మంది వేదపండితులను సత్కరించటం జరిగేదని తెలిపారు. వేద పండితుల వల్లనే దేవాలయాలు భక్తులతో విరాజిల్లుతున్నట్లు తెలిపారు. దేవాలయాల్లో వేద పండితులు జూనియర్ అసిస్టెంట్‌లుగా ఉంటున్నారని, వారి పోస్ట్ యొక్క గ్రేడ్‌ను పెంచాలని కోరారు. కరోన నేపథ్యంలో ఎక్కువ మంది వేద పండితులను తీసుకురాలేకపోయాయమని తెలిపారు. సభ కార్యక్రమంలో భాగంగా వేద సభలో ప్రవచనాలను డి.గురునాధ్ వేద పఠనంతో రాష్ట్ర పురోభివృద్ధి…ఘనాపాటి, సీహెచ్ ఆంజనేయ ఘనాపాటీలు అందించారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలైన అన్నవరం, శ్రీశైలం, అమరావతి, సింహాచలం, కనకదుర్గమ్మ తదితర దేవస్థానాలకు సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం, అధర్వణ వేదం అభ్యాసం చేసిన 50 వేద పండితులను వేద సభలో సన్మానించారు. ఇందులో విజయవాడలో ని కనకదుర్గమ్మ దేవస్థానం కు చెంది 18 మంది వేద పండితులను సన్మానించారు. ఈ సందర్భంగా వేద పండితులకు రూ.4వేలు చొప్పున నగదు పురస్కారాన్ని, అమ్మవారి ప్రసాదాన్ని ఇచ్చి శాలువాతో ఘనంగా దేవస్థానం తరపున సత్కరించారు. కార్యక్రమంలో స్థానాచార్యులు విష్ణుభట్ల శివ ప్రసాద్ శర్మ, ముఖ్య ఉత్సవ అధికారి చంద్రశేఖర్ అజాద్, సీతా డైరెక్టర్ డి.రామచంద్రమూర్తి, వైదిక కమిటీ మంగినపుడి షణ్ముఖ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

 

Just In...