Published On: Sun, Oct 25th, 2020

నీట మునిగిన ఇళ్ల జాబితా ప్ర‌కారం నష్టపరిహారం అందిస్తాం

* దెబ్బతిన్న రోడ్లను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపడతాం

* పంట నష్టపోయిన రైతుల‌కు ఇన్‌పుట్ సబ్సిడీ అందించడం జిల్లాలోనే ప్రథమం

* కృష్ణా క‌లెక్టర్ ఇంతియాజ్

కృష్ణా(మండ‌వ‌ల్లి), సెల్ఐటి న్యూస్‌: గత పదిరోజుల క్రితం కురిసిన భారీ వర్షాల వలన బుడమేరు, ఉప్పుటేరు పొంగడం వలన కైకలూరు, మండవల్లి ప్రాంతాల్లోని రోడ్లు పాడైయ్యాయని వాటిని యుద్ధ ప్రాతికదికన మరమ్మతులు‌ చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ అన్నారు. శనివారం సాయంత్రం కైకలూరు నియోజకవర్గం మండవల్లి, కైకలూరు మండలాల్లోని లోకుమూడి, పులపర్రు, నుర్చిమిల్లి, తక్కెళ్లపాడు, ఆనందపురం, నాగభూషణపురం, పెనూమాకలంక, దెయ్యంపాడు, చింతపాడు గ్రామాలను కలెక్టర్ , స్థానిక శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీవర్షాల వలన కైకలూరు నుండి ఏలూరు, కైకలూరు నుంచి భీమవరం వెళ్లే రహదారులు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయన్నారు.అదేవిధంగా మండవల్లి మండలం పులపర్రు, తక్కెళ్లపాడు, నుర్చిమిల్లి గ్రామాల్లో రోడ్లు జలమయమై నీటిలో మునిగిన ఇళ్లను కలెక్టర్ పరిశీలించి  రామస్థులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్ధిక సహాయాన్ని తక్షణమే అందించడం జరుగుతుందని స్థానిక మండవల్లి తహసీల్దారుకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో వరద కారణంగా పాడైన ఇళ్ల జాబితాను పూర్తిస్థాయిలో సేకరించి నివేదిక త్వరితగతిన పంపించాలని కలెక్టర్ అన్నారు. ఈ ప్రాంతంలో ప్రజల జీవన శైలి దెబ్బతిందని వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన వ్యవసాయంతో పాటు ఈ ప్రాంతంలోని ఆక్వా కల్చర్ కూడా దెబ్బతిందన్నారు.
జిల్లాలో గత ఏడాది నష్టపోయిన రైతాంగానికి ఈ నెల 21న వారి ఖాతాల్లో నష్టపరిహారం జమ చేయడం జరిగిందన్నారు. గత సెప్టెంబర్ మాసంలో కురిసిన భారీ వర్షాల వలన 17 వేల ఎకరాల్లో వరిసాగు, 6 వేల ఎకరాల్లో ఉద్యానవన తోటలు దెబ్బతిన్నాయని ఆయా శాఖాధికారులు గుర్తించారని తెలిపారు.
వీరికి ఈ నెల  27న అందించే వై.యస్.ఆర్ రైతు భరోసాతో పాటు ప్రస్తుతం నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని కూడా అదే రోజు వారి ఖాతాల్లో జమచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఏ రైతు పేరైనా నమోదు కాకపోతే వెంటనే సంబంధిత అధికారికి తెలిపి రైతు భరోసా కేంద్రంలో నమోదు చేయించుకోవాలని అన్నారు. జిల్లాలో ఖరీఫ్‌లో నష్టపోయిన 10 వేల మందికి నవంబర్ 20వ తేదీలోగా ఇన్‌పుట్ సబ్సిడీని అందించడం జరుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో పంట నష్టపోయిన అదే ఏడాదిలో ఇన్ పుట్ సబ్సిడీ అందించడమనేది జిల్లా చరిత్రలో ఇది మొదటిసారని కలెక్టర్ అన్నారు.                            ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గం మండవల్లి, కైకలూరు, కలిదిండి మండలాల్లో ఆక్వా సాగు రైతులు ఎక్కువగా ఉన్నారని ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా అటు పశ్చిమగోదావరి జిల్లా ఆకువీడు ప్రాంతంలో, ఇటు కృష్ణాజిల్లా కైకలూరు, మండవల్లి, కలిదిండి ప్రాంతాలలో కోట్లాది రూపాయలు చేపలు జలమయం అయ్యాయన్నారు. ఆక్వా రంగం అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. గతంలో బుడమేరు, ఉప్పుటేరులలో 10.6 టీఎంసి నీరు వస్తే ఈ ఏడాది 11.7 టీఎంసి నీరు రావడం వల్ల ఈ ప్రాంతాలు జలమయమయ్యాయని డ్రైనేజ్ అధికారులు చెపుతున్నారని తెలిపారు. తక్కెళ్లపాడు గ్రామంలో మంచినీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరగా ఎమ్మెల్యే స్పం‌దిస్తూ మండవల్లి మండలంలో పులపర్రు, నుర్చిమిల్లి, ఆనందపురం తదితర గ్రామాల్లో జేజేఎం పథకం క్రింద ప్రతి ఇంటికి త్రాగునీటిని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట గుడివాడ తహసీల్దారు శ్రీను, మండవల్లి తహసీల్దార్ జి.రవికాంత్, కైకలూరు మార్కెట్ యార్డు డైరెక్టర్ గోకర్నయాదవ్, స్థానిక నాయకులు చేబోయిన వీరరాజు, పెద్దిరెడ్డి శ్రీను, గుడివాడ బాబ్ది, బొంగా రాణి, అగ్రికల్చర్ అచ్చుత శివ, మండవల్లి కైకలూరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. 

Just In...