Published On: Wed, Nov 4th, 2020

రాష్ట్రంలో నూతన పర్యాటక పాలసీకి త్వరలో శ్రీకారం

* పీపీఏ పద్ధతిలో టూరిజం ప్రాంతాల అభివృద్ధి

* ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏపి టూరిజం బ్రాండ్ అంబాసిడర్

* ఈ నెల 10 నుండి భవానీద్వీపంలో సందర్శకులకు అనుమతి

* ప‌ర్యాట‌క శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్ర, రాష్ట్రేతరులను, విదేశీ సందర్శకులను సైతం ఆకర్షించే విధంగా రాష్ట్రంలో పర్యాటక స్థలాల అభివృద్ధికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. విజయవాడ భవానీపురంలోని హరితారిస్సార్ట్స్ బెరం పార్క్‌లో బుధవారం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ టూరిజానికి సియం వైయస్ జగన్ “బ్రాండ్ అంబాసిడర్” అని మంత్రి శ్రీనివాస్ ప్రకటించారు. సినీనటులు, సెలబ్రెటీలను పెట్టుకుని ఇతర రాష్ట్రాలు పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తుంటే ఆంధ్రరాష్ట్రం మాత్రం సీయంజగన్ అంబాసిడర్‌గా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో త్వరలో నూతన పర్యాటక పాలసీ ప్రవేశపెడుతున్నామని ఆయన తెలిపారు. ఈ పాలసీ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పిపిఏ) పద్ధతిలో బోట్లు, హోటల్స్, రెస్టారెంట్లు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పధకాలతో పాటు ప్రైవేట్ పబ్లిక్ సంస్థల భాగస్వామ్యంతో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారి సృష్టించిన ఉపద్రవం పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. గత 6 నెలల నుండి సుమారు నెలకు కోటి రూపాయల ఆదాయాన్ని పర్యాటక శాఖ కోల్పోయిందన్నారు. కేంద్రప్రభుత్వం ఇటీవలే పర్యాటక ప్రాంతాలకు సందర్శకులను అనుమతించడం జరిగిందన్నారు. పాపికొండలు మినహా మిగిలిన ప్రాంతాల్లో సుమారు 60 బోట్లు నడి పేందుకు అనుమతించడం జరిగిందన్నారు. ప్రకాశంబ్యారేజ్ వరద ప్రవాహం తగ్గిన తర్వాత నీటిపారుదలశాఖ అధికారుల అనుమతి తీసుకుని బోట్లు నడిపేందుకు అనుమతిస్తామన్నారు. రానున్న కార్తీక మాసాన్ని దృష్టిలో ఉంచుకుని భవాని ఐల్యాండ్‌ను అభివృద్ధి చేసి వన భోజనాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు.
ఈ నెల 10వ తేదీన భవానీ ఐల్యాండ్‌కు సందర్శకులను అనుమతిస్తామన్నారు.
రాష్ట్రంలో పర్యాటకులకు కావాల్సిన సదుపాయాలు, భద్రత విషయంలో అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గత అనుభవాలను, సంఘటనలను దృష్టిలో ఉంచుకుని బోట్లు నడిపే 9 ప్రాంతాల్లో పోలీస్, రెవెన్యూ, టూరిజం, ఇరి గేషన్ తదితర శాఖల అధికారులతో కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో బోట్లు నడిపే విధంగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో పర్యాటక శాఖ ద్వారా 38 హోటల్స్ ను నిర్వహిస్తున్నామని కరోనా సమయంలో హోటల్స్ నందు కోవిడ్ సెంటర్ల నిర్వాహణతో పాటు కోవిడ్ కేంద్రాలకు ఆహారం సరఫరా చేయడం ద్వారా రూ.28 కోట్ల ఆదాయాన్ని సమకూర్చినట్లు మంత్రి తెలిపారు. తిరుపతి, విశాఖపట్నంలో స్టార్ హోటల్స్ నిర్మాణానికి ప్రయత్నాలను ముమ్మరం చేసామన్నారు. ఇప్పటికే ఓబరాయ్ సంస్థ ఇందుకు సంబంధించి స్థలాల పరిశీలించడం
కూడా జరిగిందని మంత్రి తెలిపారు. పర్యాటక ప్రాంతాలలో కోవిడ్ నియమనిబంధనలను పాటిస్తూ పర్యాటకులను అనుమతిస్తామన్నారు. రాబోయే రోజుల్లో వాటర్ టూరిజం, ఇకో టూరిజం, బీచ్ టూరిజం, టెంపుల్ టూరిజాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంద‌ని మంత్రి వెల్ల‌డించారు.

Just In...