Published On: Mon, Nov 9th, 2020

భారీ వర్షాలు, వరదలకు రూ.664 కో‌ట్ల మేర నష్టం

* కృష్ణా జిల్లాలో కేంద్ర బృందం ప‌ర్య‌ట‌న‌
* జిల్లాలో జరిగిన అపారనష్ణాన్ని వివరించిన కలెక్టర్ ఇంతియాజ్
విజయవాడ, సెల్ఐటి న్యూస్‌: జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు, వరదలకు రూ.664 కో‌ట్ల మేర నష్టం వాటిల్లిందని కృష్ణా ‌జిల్లా కలెక్టర్‌ ఏఎండి ఇంతియాజ్ కేంద్ర బృందానికి వివరించారు. అందులో ప్రధానంగా పండ్ల తోటలకు రూ.290 కోట్లు, వ్యవసాయానికి రూ.138 కోట్లు, ఆర్ అండ్ బీకి రహదారులకు రూ.197 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.143 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు.  సోమవారం విజ‌య‌వాడ‌లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వచ్చిన భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన పంటలు, రహదారులు, ఇతర నష్టాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను కలెక్టర్ ఇంతియాజ్ వరద నష్టంపై అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృంద సభ్యులు, జాయింట్ సెక్రటరీ సౌరవ్‌రాయ్‌కు పూర్తి స్థాయిలో వివరించారు. బృందంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి అసిస్టెంట్ కమీషనర్ ఆయుష్ పునియ, నేషనల్ హైవేస్ స్పెషల్ కమీషనర్ శ్రావణ్‌కుమార్ సింగ్ ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తెలంగాణ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల 93 రోజుల పాటు నిరంతరం ప్రకాశం బ్యారేజ్‌కి వరద నీరు అధిక స్థాయిలో వచ్చి చేరిందన్నారు. ప్రకాశం బ్యారేజ్ ద్వారా సుమారు 1005 టీఎంసీల నీటిని సముద్రంలో వదిలామన్నారు. కృష్ణానదికి అధికంగా 8 లక్షల క్యూ సెక్కుల వరద నీరు చేరిందన్నారు. రెండో ప్రమాద హెచ్చరికకు 6 లక్షల క్యూసెక్కులుగా ఉన్నప్పటికీ 8 లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో ఆందోళన చెందామన్నారు. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో వున్న 18 మండలాలతో పాటు జిల్లాలోని మరో 15 మండలాలు కూడా భారీ వర్షాలకు నష్టపోయాయన్నారు. వరదల్లో ఇళ్లు కూలి ఒకరు, నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి మరొకరు మరణించారన్నారు. జిల్లాలో పంట నష్టాలపై వివరిస్తూ వరి, ప్రత్తి, కంది, మినుములు, పెసర వంటి పప్పుధాన్యాలతో పాటు మొక్కజొన్న, వేర శెనగ వంటి మెట్ట ప్రాంతాల్లో కూడా సుమారు 11 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జరిగిన పంట నష్టానికి ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ కూడా మంజూరు చేసిందన్నారు. పండ్ల తోటల్లోని పొలాల్లో నీరు వారం రోజులపాటు నిలబడి పోవడంతో వాణిజ్య పంటలకు అపార నష్టం వాటిల్లిందన్నారు. జిల్లాలో అరటి, బొప్పాయి సాగు చేసే వాణిజ్య పంటలకు ఎక్కువ మొత్తంలో నష్టం జరిగిందని, పొలాలకు రూ.3.51 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని కూడా ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. వీటితో పాటుగా అక్టోబర్ నెలలో సంభవించిన వరద నష్టానికి సుమారు రూ.20 కోట్లు పంపిణీ చేయాల్సి ఉందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో మత్స్యశాఖలో జరిగిన నష్టాలను వివరిస్తూ జిల్లాలో 475 ముత్స్యకార బోట్లు, వలలు నష్టపోయాయన్నారు. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రోడ్లు కూడా దెబ్బ‌తిన్నాయ‌న్నారు. జిల్లాలో పశుసంవర్థకశాఖ, సెరీ కల్చర్, గృహాలు తదితర శాఖలకు సంబంధించి నష్టాలు వాటిల్లాయ‌ని కలెక్టర్ కేంద్ర బందానికి వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్లు కె.మాధవీలత, శివశంకర్, మోహన్‌కుమార్, డిఆర్వో వెంకటేశ్వర్లు, ముఖ్య ప్రణాళికాధికారి శర్మ, వ్యవసాయ శాఖ జేడి మోహన్‌రావు, మత్స్యశాఖ జేడి లాల్ మహ్మద్, పశుసంవర్ధక శాఖ జేడి, హార్టీకల్చర్ డీడీ, పంచాయతీరాజ్ ఎస్ఇ ప్రకాష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు,వరదల కారణంగా సంభవించిన పంట నష్టం అంచన వేసేందుకు  కేంద్ర బృందం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటీంచింది. కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, చంద‌ర్ల‌పాడు మండలాల్లో పలు గ్రామాల్లో బృందం పర్యటించింది. ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడికి చేరుకున్న బృందం వరదల వలన నష్టపోయిన ప్రత్తి, మినుము, బెండ, వంగ పంటలను పరిశీలించింది. కలెక్టర్‌ ఏ.యండి.ఇంతియాజ్‌, జేసీ మాధవీలత వరద వల్ల నష్టపోయిన పంట వివరాలను వారికి వివరించారు. వరదలతో కష్టాల్లో కూరుకుపోయిన తమను ఆదుకోవాలని ఈ సందర్భంగా రైతులు  కేంద్ర బృందాన్ని కోరారు. అనంతరం, కంచికచర్లకు వెళ్లే మార్గంలో నేల కొరిగిన వరిపంటను సైతం కేంద్ర బృందం పరిశీలించింది. వర్షాల కారణంగా, పంట కాలువ పొంగటం కార‌ణంగా మరికొంత మేన ‌వరికి నష్టం జరిగిందని కలెక్టర్ వివరించారు. నందిగామ ఎమ్మెల్యే యం.జగన్మోహన్‌రావు కేంద్ర బృందాన్ని కలిసి పంట నష్టం వివరాలు తెలియజేసి రైతులను ఆదుకోవాలని కోరారు. వర్షానికి దెబ్బతిన్న రోడ్లలో కేంద్ర బృందం ముందుకు సాగింది. కాగా, వరదల కారణంగా కొటికలపూడిలో 177 ఎకరాల్లో పత్తి,162 ఎకరాల్లో మినుము పంట నష్టం సంభవించింది.  పంట నష్టానికి సంబంధించిన వివరాలతో పాటు రైతుల నుంచి మరికొన్ని వివరాలు అడిగి  తెలుసుకున్నారు.

    

Just In...