Published On: Fri, Nov 20th, 2020

నాడు-నేడుతో పాఠశాలల రూపు రేఖల్లో మార్పు…

* కృష్ణా ‌‌కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: నాడు-నేడు కార్యక్రమం ద్వారా జిల్లాలోని పాఠశాలల రూపు రేఖలు ఎంతో మారుతున్నాయని, గత రోజులు గుర్తొచ్చాయని కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఏ.యండి. ఇంతియాజ్ పేర్కొన్నారు. విజ‌య‌వాడ‌లోని ఇరిగేషన్ కార్యాలయ రైతు శిక్షణా కేంద్రంలో యంపిడివోలు, యంఇఓలు, ఇంజినీరింగ్ అధికారులతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం అమలుపై శుక్ర‌వారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ కృష్ణాజిల్లాలోని వివిధ పాఠశాలలు నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఆధునికీకరించడం జరిగిందన్నారు. పాఠశాల ప్రాంగణాలను, భవనాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం ద్వారా చక్కని వాతావరణాన్ని క‌ల్పించామ‌న్నారు. జిల్లాలోని వివిధ పాఠశాలలను క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా తాను పరిశీలించ‌గా పాత రోజులు గుర్తొచ్చాయన్నారు. చక్కని తరగతిగదులు, బల్లలు, తదితర అంశాలతో అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఇంజినీరింగ్ అధికారులు సైతం నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. గతం కంటే మిన్నగా రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతోందని వాటికి అనుగుణంగానే అధి కారులు కూడా అడుగులు వేయాల్సి ఉందన్నారు.జిల్లాలో యస్ఆర్ ఇజియస్ ద్వారా కోటి పనిదినాలు

లక్ష్యం అధిగమించాం …
కృష్ణాజిల్లాలో యస్ఆర్ ఇజియస్ ద్వారా ఉపాధి హామీ పధకం క్రింద పనిదినాలకల్పనలో గతంలో పురోగతి ఉండేది కాదని, గత ఏడాది కాలంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా చేపడుతున్న చర్యలు మూలంగా కోటి పనిదినాల లక్ష్యాన్ని అధిగమించి రాష్ట్రంలో ఉపాధి హామీ పనులకల్పనలో రెండవ స్థానంలో నిలవడం జరిగిందన్నారు. ఉపాధి హామీ పధకం ద్వారా చేపట్టే ఎక్కువ పనిదినాల లక్ష్యాన్ని సాధిస్తే వాటికి సమాంతరంగా మెటీరియల్ కాంపోనెంట్ క్రింద పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకోగల‌మ‌ని తెలిపారు. ఆ దిశలో రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలవడం ద్వారా కృష్ణాజిల్లా లక్ష్యాలను అధి గమించే దిశగా అడుగులు వేసిందన్నారు. ఇందుకు అధికారుల సమ‌ష్టి కృషి ప్రశంసనీయమన్నారు. నరేగా నిధులతో కాంపోనెంట్ మెటీరియల్ క్రింద సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వైయస్ఆర్ హెల్త్ కేంద్రాలు, తదితర నిర్మాణాలు చేపట్టే వెసులుబాటు ఉందని కలెక్టరు తెలిపారు. అయితే నరేగా నిధులను సమర్ధవంతంగా వినియోగించడంలో ఇంజినీరింగ్ అధికారులు మరింత చొరవ చూపాలని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని అడుగులు వేయాలని కలెక్టరు సూచించారు.

ఆర్‌డబ్ల్యుయస్ ద్వారా 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక …
గ్రామీణ రక్షిత నీటి సరఫరా సంస్థ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలకు పైపులైన్ ద్వారా రక్షితమంచినీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని కలెక్టర్ ఇంతియాజ్ తెలియజేసారు. కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ అనుబంధ రంగ సంస్థలు, అంగన్ వాడి కేంద్రాలు, కమ్యూనిటి సెంటర్లు, హాస్పటల్స్, జిల్లా, డివిజన్, మండల పరిధిలోని కార్యాలయాలకు పైపులైన్ ద్వారా నీటి సరఫరా వ్యవస్థను అందుబాటులోనికి తీసుకువచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నామన్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలోని అధికారులు ముఖ్యంగా యంపిడివోలు తగిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని కలెక్టరు తెలిపారు.

ఇంటింటికీ నిత్యావసరాల పంపిణి …
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా త్వరలో అమలు చేయనున్న ఇంటింటికీ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 850 వాహనాలను అందుబాటులోనికి తీసుకురావడం జరుగుతోందని కలెక్టర్‌ ఇంతియాజ్ తెలిపారు. ఇందుకోసం ఆసక్తి ఉన్న యువతకు సదరు వాహనాలను అందించడం ద్వారా వారికి జీవనోపాధి కల్పించే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తున్నదన్నారు.
మార్గదర్శకాలకు లోబడి సంబంధిత మండల స్థాయి యంపిడివోలు ఆసక్తి ఉన్న యువత నుండి ధరఖాస్తులు స్వీకరించాలని కలెక్టరు స్పష్టం చేశారు. జాయింట్ కలెక్టరు (అభివృద్ధి) యల్. శివశంకర్ మాట్లాడుతూ జిల్లాలో మనబడి, నాడు-నేడు క్రింద మొదటి విడతలో రూ. 238 కోట్లతో 1155 పాఠశాలల్లో పదిరకాల మౌలిక సదుపాయాల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. రూ. 16.82 కోట్లతో 198 పాఠశాలల్లో నిర్మాణం చేపట్టిన ప్రహారీగోడల పనులను నవంబరు నెలాఖరుకు పూర్తి కావాలన్నారు. నాడు-నేడు పనుల్లో కృష్ణాజిల్లాను ప్రధమస్థానంలో నిలిపేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్‌ (సంక్షేమం) కె.మోహన్‌కుమార్, డ్వామా పిడి సూర్యనారాయణ, డియంహెచ్‌ఓ యం.సుహాసిని, పంచాయతీరాజ్ యస్.ప్రకాష్‌నాయుడు, ఆర్‌డబ్ల్యుయస్ ఎస్ఈ రఘునాధ్, డిఇఓ రాజ్యలక్ష్మి, సమగ్ర శిక్షా ఏపిడి రవీంద్ర‌బాబు తదితరులు పాల్గొన్నారు.

 

Just In...