Published On: Sat, Nov 21st, 2020

సలాం కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్‌

* అండ‌గా ఉండాల‌ని ఎస్పీకి ఆదేశం‌

నంద్యాల‌, సెల్ఐటి న్యూస్‌: అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారుకులైన దోషులపై చట్టప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పోలీసుల వేధింపులు తాళ‌లేక నంద్యాలలో ఇటీవల కుటుంబసభ్యులతో సహా ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ సలాం అత్త మాబున్నీసా, ఆమె కొడుకు శంషావలి, కూతురు సాజీదాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్ర‌వారం స్వ‌యంగా క‌లిసి ప‌రామ‌ర్శించారు. క‌ర్నూలులోని తుంగభ‌ద్ర పుష్క‌రాలు ప్రారంభించిన అనంత‌రం తిరుగు ప్రయాణంలో ఏపీఎస్పీ గెస్ట్ హౌస్ వద్ద వారిని సీఎం జ‌గ‌న్ పరామర్శించారు. సలాం అత్త మాబున్నీసా మాట్లాడుతూ ఇటీవల ప్ర‌కటించిన రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ద్వారా అందించి తమ కుటుంబానికి న్యాయం చేశార‌ని, త‌న కూతురు సాజీదాకు ఉద్యోగం ఇవ్వాలని, వైద్య ఆరోగ్య శాఖలో సీనియర్ అసిస్టెంటుగా ఉన్న తన కొడుకుని అనంతపురం నుండి నంద్యాలకు బదిలీ చేయాలని, దోషులను శిక్షించాలని సీఎం జ‌గ‌న్‌ను కోరారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ సలాం కుటుంబ ఆత్మహత్యకు కారకులైన దోషులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, కుటుంబానికి అండగా ఉంటామని మాబున్నీసాకు ధైర్యం చెప్పి హామీ ఇచ్చారు. మాబున్నీసా కూతురు సాజీదాకు ఔట్ సోర్సింగ్ కింద ఉద్యోగాన్ని ఇవ్వాలని, కొడుకు శంషావలిని అనంతపురం నుండి నంద్యాలకు బదిలీ చేయాల‌ని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్‌కు, మాబున్నీసా కుటుంబానికి అండగా ఉండాలని ఎస్పీ కె.ఫక్కీరప్పను సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు శంషావలిని అనంతపురం డిఎంహెచ్ఓ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ నుండి నంద్యాల వైద్య ఆరోగ్య శాఖకు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ క్షణాల్లో డెప్యూటేషన్ ఆర్డర్స్ ఇప్పించారు. కార్య‌క్ర‌మంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, హఫీజ్ ఖాన్, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప, జేసీ(సంక్షేమం) సయ్యద్ ఖాజా మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Just In...