Published On: Sat, Nov 21st, 2020

రూ.3500 కోట్ల‌తో ‌మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ స‌దుపాయం

* ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గన్‌ ప్రకటన

* తొలి విడతలో 4 ఫిషింగ్‌ హార్బర్లు, 25 ఆక్వాహబ్‌ల నిర్మాణానికి శంకుస్థాపన

* వర్చువల్ విధానంలో శంకుస్ధాపన చేసిన సీఎం

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: ఫిషింగ్‌ హార్బర్లు, ఆక్వాహబ్‌లు, జనతా బజార్లలో మత్స్య ఉత్పత్తుల మార్కెటింగ్‌ సదుపాయాల కోసం రూ.3500 కోట్లు వెచ్చించ‌నున్న‌ట్లు సీఎం వైయస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి ప్రకటించారు. తొలివిడతలో 4 ఫిషింగ్‌ హార్బర్లు, 25 ఆక్వాహబ్‌ల నిర్మాణానికి తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి శ‌నివారం ఉద‌యం వర్చువల్ విధానంలో సీఎం జ‌గ‌న్ శంకుస్ధాపన చేశారు. డిసెంబర్‌ 15లోగా టెండర్ల ఖరారు, పనులు ప్రారంభించి త్వరలో మిగిలిన 4 ఫిషింగ్‌ హార్బర్లకు టెండర్లు పిలుస్తామ‌ని సీఎం వెల్లడించారు. ఈ సందర్బంగా సీఎం శ్రీ వైయస్ జగన్ మాట్లాడుతూ… ఈ రోజు ప్రపంచ మత్స్య దినోత్సవం. దీనిని మనం ఒకపండుగగా జరుపుకుంటున్నాం. మన దేశానికి 7516 కిలోమీటర్ల తీరప్రాంతం వుంటే, మన రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీరప్రాంతం వుంది. దేశంలోనే సముద్రతీరంలో మనరాష్ట్రం రెండో స్థానంలో వుంది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారుల జీవితాలు మాత్రం పెద్దగా ఎందుకు మారలేదని, మనమంతా మనస్పాక్షితో.. గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించాలి. మత్స్యకారుల జీవితాలు ఎంత దయనీయమైన స్థితిలో వున్నాయి అనేది నా పాదయాత్రలో నా కళ్ళారా చూశాను. మంచి చదువులు చదువుకోలేని పరిస్థితి… పక్కా ఇళ్ళు లేని పరిస్థితి… సరైన ఆరోగ్యవసతి లేని పరిస్థితి…. కష్టానికి తగ్గ ప్రతిఫలం లేని పరిస్థితి… పట్టిన చేపలకు తగిన ధర రాని పరిస్థితి… మన కళ్ళ ఎదుటే ఇవ్వన్నీ కనిపిస్తున్నాయి. మన మత్స్యకారులు అతి తక్కువ జీతానికి ఎక్కడో వున్న గుజరాత్ వంటి రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ బతుకు దెరవు కోసం ఉద్యోగాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ అంతర్జాతీయ జలాల్లో చేపల వేట సాగిస్తున్న వారిని… పాకిస్తాన్, బంగ్లాదేశ్ పోలీసులు పట్టుకుని జైళ్లకు పంపితే, అక్కడ మనవాళ్లు మగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పాదయాత్రలో తీరప్రాంతాలకు వెళ్ళినప్పుడు మత్స్యకార కుటుంబాలు చెప్పిన ఈ కన్నీటి గాథ చలింపచేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రప్రభుత్వంపై మన ఎంపీలు తీవ్రమైన వత్తిడి తేవడంతో పాటు, నేను కూడా ప్రత్యేకంగా కేంద్రంతో మాట్లాడాను. ఆ జైళ్ళలో మగ్గిపోతున్న మనవారిని తిరిగి ఇక్కడకు తీసుకురావడానికి పెద్ద ప్రయత్నమే చేశాం. వారు తిరిగి వచ్చినప్పుడు వారి ముఖాల్లో కనిపించిన ఆనందం చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఎందుకు మన మత్య్సకారులకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆలోచిస్తే బాధ కలిగింది. పెద్ద సముద్రతీరం వున్నా… మన రాష్ట్రంకు అవసరమైన పోర్ట్‌లను తెచ్చుకోలేక పోయాం, ఫిషింగ్ హార్బర్‌లను కట్టుకోలేక పోయాం. ఇన్ని సంవత్సరాల తరబడి మత్స్యకారులను పట్టించుకోవాలన్న ఆలోచన చేయలేదు. మత్స్యకారుల సమస్యలకు సమాధానాలు ఏమిటీ, మొత్తంగా మత్స్యపరిశ్రమ పరంగా విస్తారంగా వున్న అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఒక రాష్ట్రంగా మనం ఎందుకు వెనుకబడి వున్నామనే ఆలోచనతోనే అధికారంలోకి వచ్చిన ఈ పదిహేడు నెలల పరిపాలనలో ఆలోచన చేశాం. వీరి జీవితాలు ఎలాగైనా మార్చాలనే ఆలోచనలతో అడుగులు ముందుకు వేశాం. నవరత్నాల్లోని ప్రతి పథకాన్ని కూడా మత్స్యకారులకు అందించడంతో పాటు ప్రత్యేకించి మత్స్యకారులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా మనందరి ప్రభుత్వం మొట్ట మొదటి ఏడాదిలోనే ఆచరణలోకి తీసుకువచ్చింది. ఎన్నికల మేనిఫెస్టో అంటే ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి, చెప్పిన ప్రతి దానిని నెరవేరిస్తేనే, మత్స్యకారుల జీవితాలు బాగుపడతాయని భావించి అడుగులు ముందుకు వేశాం. మత్స్యకారుల జీవితాలు, ఇటు రాష్ట్రంలోని మత్స్యపరిశ్రమ రూపురేఖలను కూడా మార్చేందుకు 4 ఫిషింగ్‌ హార్బర్లుకుఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం. దాదాపు రూ.1510 కోట్ల వ్యయంతో నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నె, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరుజిల్లా నిజాంపట్నం, కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నాలుగు ఫిషింగ్ హార్బర్‌ లకు నేడు శంకుస్థాపన చేస్తున్నాం. డిసెంబర్ 15 నాటికి ఈ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని, పనులు కూడా ప్రారంభమవుతాయి. త్వరలోనే శ్రీకాకుళం జిల్లాలో బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరిజిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం కొత్తపట్నంలో మరో నాలుగు ఫిషింగ్ హార్బర్లును ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో అవసరమైన అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక ఆక్వాహబ్‌ చొప్పున నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. దీనికోసం రూ.225 కోట్లు ఖర్చుచేయనున్నాం. తొలిదశలో భాగంగా 25 ఆక్వా హబ్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాం. రాష్ట్రంలో అవకాశం వున్న ప్రతి నియోజకవర్గంలోనూ ఆక్వాహబ్ ను నిర్మించే కార్యక్రమం చేస్తున్నాం. వినియోగదారులకు నాణ్యమైన చేపలు, రొయ్యలు అందుబాటులోకి తీసుకువచ్చి, పౌష్టికాహార భద్రతను కల్పించడంతో పాటు, జనతాబజార్లకు అనుసంధానం చేసి, మత్స్య, ఆక్వారైతులకు గిట్టుబాటు ధర కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో భాగంగా 8 ఫిషింగ్ హార్బర్లు, ఆక్వా హబ్‌లు, జనతా బజార్లులోమత్స్య ఉత్పత్తులకుమార్కెటింగ్ సౌకర్యాలు.. వీటన్నింటికీ కలిపి దాదాపు రూ.3500 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. రాబోయే ఏడాదిలోనే రాష్ట్రంలో చేపలు, పీతలు, రొయ్యలను సాగుచేస్తున్న రైతుల జీవితాలను పూర్తిగా మార్చే దిశగా… కనీసం ముప్పై శాతం మన రాష్ట్రంలోనే వాటి కొనుగోళ్ళు జరిగేలా జనతాబజార్లకు అనుసంధానం చేస్తున్నాం. ప్రతి గ్రామం, మున్సిపాలిటీ, వార్డుల్లో గ్రామ సచివాలయాల పక్కనే జనతాబజార్లు, వాటిల్లో ఆక్వా ఉత్పత్తుల విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఒక ఏడాది కాలంలోనే వీటి రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడులో దాదాపు మరో రూ.పదివేల కోట్లతో మరో మూడు పోర్ట్‌లను నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. వీటికి సంబంధించి మరో రెండు, మూడు నెలల్లోనే టెండర్లను ఫైనలైజ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. 2019 ఎన్నికల సమయంలో మత్స్యకారుల సంక్షేమం కోసం మేనిఫేస్టోలో మూడు వాగ్ధానాలు చేశాం. వాటిని నెరవేర్చడంతో పాటు మత్స్యకారుల అక్కచెల్లెమ్మల కోసం ఇంకా ఏమేం చేశామో ఈ సందర్బంగా వివరిస్తాను.

మత్స్యకారుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు…
1) ఏప్రిల్ 15 నుంచి జూన్ 15వ తేదీ వరకు సముద్రంలో చేపల వేట నిషేద సమయం. ఈ సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు గత ప్రభుత్వం ఎప్పుడు సకాలంలో వారికి సాయం అందించలేదు. కొన్నిసార్లు సాయంగా ఇచ్చినా, అది కూడా అరకొరగా, దానిని కూడా అందిరికీ ఇచ్చేవారు కాదు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వేట నిషేద సమయంలో ఆదాయాన్ని కోల్పోయే ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.పదివేలు సాయంగా ఇస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ, 2019-20లో మొత్తం1,02,332 కుటుంబాలకు రూ.102.47 కోట్లు అందించాం. అదికూడా అధికారంలోకి వచ్చిన కేవలం ఆరు నెలల్లోనే అందించామని మీ బిడ్డగా గర్వంగా చెబుతున్నాను.

ఈ ఏడాది కోవిడ్ సమయంలో గంగపుత్రుల కుటుంబాలు దెబ్బతినకుండా, వేట నిషేద సమయంలో ఇచ్చే సాయం కోసం మళ్ళీ సంవత్సరం పాటు వేచి వుండకుండా, ఈ ఏడాది మే నెలలోనే చెల్లించాం. గత ఏడాది నవంబర్ లో ఇచ్చాం, మళ్ళీ నవంబర్ లోనే
ఇస్తామనే ఆలోచన చేయకుండా వారి కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకుని ఆరు నెలల్లోపే వేట నిషేద కాలంలో ఇచ్చే సాయంను గత ఏడాది ఇచ్చిన దానికన్నా ఎక్కువగా అంటే 1.10 లక్షల కుటుంబాలకు దాదాపు రూ.110 కోట్లు వరుసగా రెండో
ఏడాది నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేశామని గర్వంగా మీ బిడ్డగా చెబుతున్నాను.

2) గతంలో మరపడవల్లో చేపల వేటకు వెళ్లే వారికే ఈ సాయం అందించేవారు. అదికూడా రిజిస్ట్రేషన్ చేయకుండా అష్టకష్టాలు పెట్టే వారు. ఆ పరిస్థితులను పూర్తిగా మారుస్తూ, దేశీయ, నాటు, తెడ్డు, తెరచాప సహాయంతో వేటకు వెళ్ళే మత్స్యకారులకు కూడా వేట నిషేద సమయంలో పదివేల సాయం అందిస్తున్న ప్రభుత్వం మనది. అది ఎప్పుడూ లేని విధంగా దాదాపు లక్షా పదివేల కుటుంబాలకు అందిస్తున్నామని గర్వంగా చెబుతున్నాను.

3) మనం అధికారంలోకి రాకముందు మత్స్యకారుల బోట్లకు డీజిల్ లీటర్ కు ఆరు రూపాయలు సబ్సిడీ ఇచ్చేవారు. అది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. ఈ రోజు మన ప్రభుత్వం డీజిల్ సబ్సిడీని ఆరు నుంచి తొమ్మిది రూపాయలకు పెంచింది. ఆ రాయితీని బంకులో డీజిల్ కొట్టే సమయంలోనే తగ్గించి తీసుకునేలా చర్యలు తీసుకున్నాం.

4) సముద్రంలో వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు మత్స్యకార సోదరులు మరణిస్తే, గతంలో వారి కుటుంబానికి అందించే రూ.5 లక్షల పరిహారంను రూ.10 లక్షలకు పెంచాం. మీ బిడ్డగా, మీమీద మమకారంతో ఈ కార్యక్రమాన్ని చేశాను.

5) గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పోరేషన్ 2012 సంవత్సరంలో మన రాష్ట్రంలోని సముద్రతీరంలో డ్రిల్లింగ్ చేసిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది మండలాల్లో 68 మత్స్యకార గ్రామాల్లోని 16,559 మత్స్యకార కుటుంబాలు జీవన భృతి కోల్పోయాయి. పదమూడు నెలల పాటు డ్రిల్లింగ్ జరిగింది. అయితే గుజరాత్ పెట్రోలియం సంస్థ ఆరు నెలల కాలానికి రూ.68 కోట్లు మాత్రమే చెల్లించింది. మిగిలిన ఏడు నెలలకు చెల్లించాల్సిన రూ. 78 కోట్లు బకాయి పెట్టింది. దీనిని అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. నా పాదయాత్రలో బాధిత మత్స్యకార కుటుంబాలు చెప్పిన ఈ సమస్యను గుర్తు పెట్టుకుని, గత ఏడాది ఇదే మత్స్య దినోత్సవం రోజున గుజరాత్ పెట్రోలియం సంస్థ చెల్లించాల్సిన మొత్తం రూ.78 కోట్లను మన రాష్ట్రప్రభుత్వమే చెల్లించింది. కేంద్రం నుంచి ఈ మొత్తం ఎప్పుడు వస్తుందో తెలియదు, అప్పటి వరకు మత్స్యకార కుటుంబాలు ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ సొమ్మును చెల్లించింది.

6) మొత్తంగా మత్స్యకార రంగానికి మద్దతుగా నిలుస్తున్నాం. ఆక్వా రైతులకు కరెంట్ యూనిట్ రూ.1.50 లకే అందిస్తున్నాం. ఇందుకోసం ఏకంగా రూ. 720 కోట్ల సబ్సిడీని ఆక్వారైతుల కోసం చిరునవ్వుతోనే ప్రభుత్వం భరిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు, మూడు నెలలు కూడా ఆగకుండా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీనివల్ల సుమారు 55 వేల ఆక్వా రైతులకు
ప్రయోజనం కలుగుతోంది.

7) మత్స్యకారులకు అండగా నిలిచేందుకు సంబంధిత గ్రామ సచివాలయాల్లో 794 మంది మత్స్య సహాయకులను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నియమించాం. ఆర్బీకేల్లో రైతులకే కాదు, మత్స్యకారులు, ఆక్వారైతులకు కూడా తోడుగా వుండి, వారిని చేయిపట్టుకని మత్స్య సహాయకులు నడిపిస్తున్నారు.

నాణ్యత కోసం ఎపి ఫిష్ ఫీడ్ యాక్ట్‌, ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు

ఇవి మాత్రమే కాకుండా నాణ్యమైన చేపలు, రొయ్యల మేత అందుబాటులో లేక రైతులు ఎలా ఇబ్బందిపడ్డారో పాదయాత్రలో నా కళ్ళారా చూశాను. క్వాలిటీ అనేది తెలియక, ఆ ఫీడ్ లో ఫెస్టిసైట్స్, కెమికల్స్ వుండటం వల్ల ఆక్వా ఉత్పత్తులు అమ్ముడు పోక రకరకాలుగా ఆక్వా రైతులు ఇబ్బంది పడ్డారు. ఆక్వారైతులకు నాణ్యమైన మేత అందించాలనే ఉద్దేశంతో, నకిలీలను అడ్డుకునేందుకు దేశంలోనే మొట్టమొదటి సారిగా ఎపి ఫిష్ ఫీడ్ చట్టాన్ని కూడా చేశాం. ఇందుకోసం ఆక్వా రైతులకు నాణ్యమైన చేప, రొయ్యపిల్లల సరఫరాకు ఎపి ఫీష్ సీడ్ కంట్రోల్ ఆర్డినెన్స్‌ కూడా జారీ చేశాం. ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ చట్టాన్ని కూడా తీసుకువచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ. 50 కోట్లతో ముప్పై అయిదు ఆక్వా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశాం. నాణ్యమైన ఆక్వా ఉత్సత్తులను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. నా పాదయాత్రలో ఆక్వా రైతుల కష్టాలను చూశాను. ఎక్కడా ల్యాబ్‌లు లేవు. కృష్ణాజిల్లాలో సమస్య వస్తే…ఎక్కడికో కాకినాడ వరకు తీసుకుపోవాల్సి వచ్చేది. అంతదూరం పోలేక, ఎవరి దగ్గర దొరికితే… వారి దగ్గర సీడ్ తీసుకునేవారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. క్వాలిటీ అనేది ప్రతి ఆక్వా రైతుకు కూడా అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేసింది.

ప.గో.జిల్లాలో ఎపి ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు
మత్స్య, ఆక్వా రంగాల్లో నిపుణులను తయారు చేయడానికి, నైపూణ్యం పెంచడానికి, పశ్చిమగోదావరి జిల్లాలో ఎపి ఫిషరీస్ విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేయడానికి ఆర్డినన్స్ జారీ చేశాం. మరో మూడు, నాలుగు నెలల్లో ఈ పనులు ప్రారంభమవుతాయి. ఇవ్వన్నీ కూడా మంచి మనస్సుతో చేశాం. దేవుడి ఆశీస్సులు, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం మరింతగా మీ అందరికీ మేలు చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను అంటూ సీఎం తన ప్రసంగం ముగించారు. కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, అగ్రికల్చర్‌ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవియస్‌ నాగిరెడ్డి, మత్స్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, కమిషనర్ కన్నబాబు, ఇతర
ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Just In...