Published On: Fri, Nov 27th, 2020

అల్లోపతి, ఆయుష్‌ల సమన్వయంతో రోగులకు చికిత్సలు

* ఆయుర్వేద వైద్యులకు ప్రీకోవిడ్ చికిత్సా విధానాలపై శిక్షణ

* ఆయుష్ కమిషనర్‌ ఉషాకుమారి

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: అల్లోపతి, ఆయుష్‌ల సమన్వయంతో కోవిడ్ వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్న‌ట్లు ఆయుష్‌ష్ కమిషనర్ పి.ఉషారాణి చెప్పారు. జాతీయ ఆయుష్ మిషన్ సహకారంతో రాష్ట్ర ఆయుష్ శాఖ శుక్రవారం ఉద‌యం విజయవాడ మొగ‌ల్రాజ‌పురంలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియంలో ఆయుష్ డాక్టర్లకు నిర్వహించిన పోస్ట్ కోవిడ్ మేనేజ్‌మెంట్ శిక్షణా కార్యక్రమాన్ని కమిషనర్‌ ఉషాకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కోవిడ్ బారిన పడిన రోగులు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా పాటించే విధానాలపై అవగాహన కల్పిస్తున్నామని, కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 400 మంది ఆయుష్ వైద్యులు అందించిన ముందస్తు చికిత్సావిధానాలు మంచి ఫలితాలు ఇచ్చాయన్నారు. కోవిడ్ వ్యాధి నివారణకు ఈ చికిత్సా విధానాలు దోహదపడతాయని చెప్పారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో సుమారు 2లక్షల మందికి ఆయుర్వేద కోవిడ్ నివారణ మందులను ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. గుడివాడ ప్రాంతంలో చేపట్టిన ప్రయోగాత్మక చర్యల్లో భాగంగా ఉచిత కోవిడ్ మందులు వాడినవారికి కోవిడ్ వ్యాధి సోకలేదని నిర్ధారణ అయినట్లు ఆమె తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి చెందిన శాస్త్రీయ విధానాలపై ఆయుర్వేద వైద్యులకు శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా నిపుణులైన న్యూరో, ఫిజియోథెరఫీ, కోవిడ్ వైద్యులతో కేంద్ర
రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన మార్గదర్శకాల కు అనుగుణంగా పోస్ట్ కోవిడ్ చికిత్సపై ఆయుర్వేద వైద్యాధికారులకు శిక్షణ అందించేందుకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

కోవిడ్ సోకి నెగిటివ్ వచ్చినప్పటికీ రోగులు రోగ నిరోధకశక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై శాస్త్రీయ విధానాలు ద్వారా రోగులు అవలంభించాల్సిన యోగ, ప్రాణాయామం వంటివి ఆచరించాలని కోరారు. ఆహార నియమావళిని కూడా వారికి తెలియజేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆయుఃష్ ఆసుపత్రుల ద్వారా మారుమూల ప్రాంతాలలో ప్రజలకు ప్రేరణ కలిగించి చిన్న చిన్న ఆయుర్వేద వైద్య విధానాలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో 25 ఆయుష్ స్పెషాలిటీస్ కేంద్రాల ద్వారా ప్రజలకు ప్రీకోవిడ్ ముందుజాగ్రత్త చికిత్సలపై అవగాహన ల్పించనున్నామన్నారు. అదేవిధంగా సాధారణ చికిత్సల్లో భాగంగా చంటిబిడ్డలకు సోకే డయోరియా, ఊపిరితిత్తుల వ్యాధులకు చికిత్స అందించనున్నామని, భవిష్యత్తులో తల్లిపాలను పెంచేందుకు గర్భవతులు, బాలింతలకు ఆయుష్ మందులను ఉచితంగా అందించాలనే ఆలోచన చేస్తున్నామన్నారు. తద్వారా బాల్యం నుండే రోగనిరోధకశక్తి పెంచాలన్నదే ఆయుష్ శాఖ ఉద్దేశం అన్నారు. పోస్ట్ కోవిడ్ శిక్షణా కార్యక్రమంలో ఆయుఃష్ శాఖ అడిషినల్ డైరెక్టర్ డాక్ట‌ర్ సాంబమూర్తి, రీజనల్ జాయింట్ డైరెక్టర్లు డాక్ట‌ర్ కె.వి.రమణ, డాక్ట‌ర్ శేఖర్, ఆయుష్ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్ట‌ర్ సాయిసుధాకర్, ఫిజియోథెరఫీ వైద్య నిపుణులు వోలాస్, న్యూరో వైద్యనిపుణులు పవన్‌కుమార్, కోవిడ్ వైద్యనిపుణురాలు శిరీషా, వివిధ ఆయుష్ వైద్యశాలలకు చెందిన వైద్యులు పాల్గొన్నారు.

Just In...