Published On: Fri, Nov 27th, 2020

బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టిన మహిళా ఖైదీలు

* రాజమహేంద్రవరం సిజె నుంచి 19 మంది విడుదల

రాజమహేంద్రవరం, సెల్ఐటి న్యూస్‌: జైలు గోడల నుంచి పలువురు మహిళా ఖైదీలు బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. స్వేఛ్చా విహాంగాలుగా ఊపిరి పీల్చుకున్నారు. వయో వ ద్ధ పండుటాకులు కొందరైతే..జీవిత చరమాంకంలోకి చేరినవారు ఇంకొంత మంది.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగష్టు 15ను పురష్కరించుకుని జీవో నెంబర్‌ 131ని విడుదల చేసింది. ఈ జీవోకు అనుగుణంగా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌ పరిధిలో ఉన్న మహిళా జైలు నుంచి 19 మంది విడుదలకు మార్గం సుగమం అయ్యింది. వాస్తవంగా సత్పవర్తన కల్గిన ఖైదీలను ఆగష్టు 15నే విడుదల చేయాల్సివుంది. అయితే కరోన వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని నాడు విడుదలలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు క్షమాభిక్షతో సత్పవర్తన కలిగిన జీవిత ఖైదీలను శుక్రవారం విడుదల చేసింది. విడుదలైన మహిళా ఖైదీలు తమ కుటుంబాలను కలుసుకోవడంతో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు వద్ద కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు పరిధిలోని మహిళా జైలు నుంచి జీవిత ఖైదీలు సత్పవర్తన జాబితాలో ప్రభుత్వం కల్పించిన క్షమాభిక్ష జాబితాలో ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పుష్కరించుకుని విడుదలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్‌ 131 విడుదల చేసింది. విడుదలైన ఖైదీల జీవిన భ తికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. శిక్ష అనుభవిస్తున్న తరుణంలో జైలు సంస్కరణల నేపథ్యంలో ఖైదీలు తమ కాళ్ళపై తాము నిలబడే విధంగా వివిధ రకాల శిక్షణలు కల్పించడం జరిగింది. విడుదలైన వారందరికీ వారి వారి పరిస్థితిని బట్టి ప్రభుత్వ పథకాలతో ప్రోత్సహాన్ని అందించేందుకు చర్యలు తీసుకున్నారు. మహిళా ఖైదీలు శిక్ష అనుభవించే కాలంలో టైలరింగ్‌ వృత్తిలో శిక్షణ తీసుకున్నారు. సత్పవర్తనతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన క్షమాభిక్షతో విడుదలైన 19 మంది మహిళలకు త్రిదండ చిన్నజియర్‌
స్వామి ట్రస్ట్‌ ఔధార్యంతో కుట్టు మిషన్లను రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ ఎస్‌.రాజారావు, మహిళా జైలు సూపరింటెండెంట్‌ కె.కృష్ణవేణి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి చేతుల మీదుగా పంపిణీ చేశారు. క్షమాభిక్షతో విడుదలైన సత్పవర్తన కలిగిన ఈ ఖైదీలకు స్వచ్ఛంధ సేవా సంస్థకు చెందిన ప్రతినిధులు చీరలు పంపిణీ చేశారు. అలాగే రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ సభ్యులు, వైకాపా పార్లమెంటరీ పార్టీ చీఫ్‌విప్‌ మార్గాని భరత్‌ రామ్‌ ఆర్థిక సహాయంతో జైలు నుంచి విడుదలైన 19 మంది మహిళా ఖైదీలకు నెల రోజులపాటు సరిపడే నిత్యావసర వస్తువులతో పాటు, వారి వారి స్వగృహాలకు చేరుకునేందుకు అయ్యే ఖర్చుల కోసం రూ.500 చొప్పున నగదును అందించారు. విడుదలైన మహిళా ఖైదీల్లో ప్రధానంగా వరకట్న కేసుల్లో శిక్ష అనుభవించినవారున్నారు. సుమారు డెబ్బై ఏళ్ళు పైబడి జీవిత చరమాంకానికి వచ్చిన ఖైదీలు కొంత మంది ఉన్నారు. వీరంతా సత్పవర్తనతో ఎట్టకేలకు విడుదలయ్యారు. కృష్ణా..రామా అంటూ జీవిత చరమాంకాన్ని పూర్తి చేస్తామని, విడుదలై తమ కుటుంబాలను ఈ పరిస్థితులోనైనా కలుసుకుంటున్నందుకు సంతోషంగా ఉందని మహిళా వయోవద్ధ జీవిత ఖైదీలు అభిప్రాయపడ్డారు. జైలులో వివిధ రకాల శిక్షణ తీసుకున్న మహిళా ఖైదీల్లో ఇద్దరు పీజీ చేయగా, మరో ఇద్దరు డిగ్రీ పట్టాను అందుకున్నారు. క్షణికావేశంలో చేసిన సంఘటనల్లో శిక్ష పడి జైలుకు వచ్చిన వీరు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా పిజీ, డిగ్రీలు జైలులోనే చేసి విద్యా వంతులుగా విడుదల అయ్యారు. విడుదలైన తర్వాత తమ కాళ్ళపై తాము నిలబడే ఆత్మస్థైర్యం వచ్చిందని, జైలులో ఏదో పని నేర్చుకున్నామని పలువురు మహిళా ఖైదీలు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పెట్టిన క్షమాభిక్ష తమ కుటుంబాల్లో ఎంతో ఆనందాన్ని నింపిందని సంతోషం వ్యక్తం చేశారు.

జైలు నుంచి విడుదలైన వారు వీరే….
కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన కరణం పార్వతి, విజయనగరం జిల్లా గుర్ల మండలం చింతలపేటకు చెందిన దాసరి అప్పలకొండ, పిల్లి సత్యం, విశాఖ జిల్లా కోటపాడు మండలం కె.గులేపల్లికి చెందిన వంటకు దేముడమ్మ, విశాఖ జిల్లా హుకుంపేట మండలం అడ్డుమంద గ్రామానికి చెందిన బకురి లక్ష్మి, కృష్ణా జిల్లా ఇబ్రహీం పట్నంకు చెందిన మత్తుల నాగమణి, విజయనగరం జిల్లా సాలూరు మండలం బాగువలస గ్రామానికి చెందిన కోట లక్ష్మి, ధారాబత్తుల లక్ష్మి, పశ్చిమ
గోదావరి జిల్లా పెనుమట్ర మండలం నత్త రామేశ్వరం గ్రామానికి చెందిన చిత్తూరి గోవర్ధన, పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన కడలి సత్యవాణి, విశాఖ జిల్లా అచ్చుతాపురం మండలం నారాయణమ్మపేటకు చెందిన జగరాపు రాములమ్మ, జగరపు సత్యవతి, జగరపు వరహలమ్మ, జగరపు దేవుడమ్మ, రాజన వరహలమ్మ, పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన సీరా శైలజ, విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం మద్దిగరువు గ్రామానికి చెందిన లింగేరి రూపవతి, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరానికి చెందిన పెరుం హైమావతి, విశాఖ జిల్లా కొత్త గొర్లెవానిపాలెంకు చెందిన కుడ్రపు రమణమ్మ విడుదలయ్యారు.

Just In...