Published On: Mon, Nov 30th, 2020

ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడం సభ్యుల ప్రాథమిక హక్కు

* శాసనమండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్

* సమావేశాలు ప్రారంభం రోజునే బిల్లులన్నీ సిద్ధం చేయాలి

* స్పీకర్ తమ్మినేని సీతారాం

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: శాసన సభ సమావేశాల్లో అడిగే ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడం సభ్యుల ప్రాథమిక హక్కు అని శాసనమండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ స్పష్టం చేశారు. శాఖల వారీగా సభ్యుల అడిగే ప్రశ్నలకు తప్పనిసరిగా జవాబులు అందించాల్సిన బాధ్యత ఆయా శాఖాధిపతులపై ఉందన్నారు. సోమవారం నుంచి జరగనున్న శాసనసభ సమావేశాల నేపథ్యంలో శనివారం అసెంబ్లీలో పలు శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో కలిసి శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ మాట్లాడుతూ, శాసనసభ సమావేశాలు ఫలప్రదం చేయాల్సిన బాధ్యత ఎక్కువగా అధికారులపై ఉందన్నారు. సమావేశాల్లో జీరో అవర్ ఎంతో ముఖ్యమైన అంశమన్నారు. తమ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలపై జీరో అవర్‌లో ప్రశ్నల రూపంలో సభ దృష్టికి సభ్యులు తీసుకొస్తారన్నారు. వాటికి సమాధానాలు తెలుసుకోవడం వారి ప్రాథమిక హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ఆయా శాఖలు విధిగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు అందజేయాలన్నారు.

సమావేశాలు ప్రారంభం రోజునే బిల్లులన్నీ సిద్ధం చేయాలి…
శాసన సభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేప‌ధ్యంలో ఆ రోజే బిల్లులన్నీ సిద్ధం చేయాలని ఆయా శాఖాధిపతులకు అసెంబ్లీ స్సీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు. కొవిడ్ దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సమావేశాలను పకడ్బంధీగా నిర్వహించాలన్నారు. అసెంబ్లీ సమావేశాలను టీవీల్లో ప్రజలు గమనిస్తుంటారని, దీన్ని గుర్తిస్తూ సభ్యులడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. తామడిగిన ప్రశ్నకు సమాధానం లభించినప్పుడే సభ్యులు సంతృప్తి చెందుతారన్నారు. తమ ప్రాంతానికి సంబంధించిన సమస్యలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలో ప్రస్తావిస్తారనే ఆసక్తి ప్రజల్లో ఉంటుందన్నారు. ఇటువంటి సమయంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు, పరిష్కారాలు లభిస్తే ప్రజలు కూడా సంతృప్తి చెందుతారన్నారు. ఇకపై ప్రతి సెషన్ ముందు గత సెషన్ కు సంబంధించిన ప్రశ్నలు, ఇచ్చిన జవాబులు, ఇవ్వాల్సిన జవాబులపై డిపార్టుమెంట్ల వారీగా సమీక్షలు నిర్వహించడం వల్ల ఎంతో మేలు చేకూరే  అవకాశముందన్నారు. శాసనమండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పలు కారణాల వల్ల గతంలో కంటే చట్టసభల సమావేశాల రోజుల సంఖ్య తగ్గుతూ వస్తోందన్నారు. పిటీషన్ కమిటీ తరుచూ సమావేశం నిర్వహించడం వల్ల సభ్యులడిగే ప్రశ్నలకు సమాధానాలు లభించే అవకాశముందన్నారు. ప్రశ్నలకు సమాధానాలు లభించకుంటే సభ్యులు తాము ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, అసెంబ్లీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణామాచార్యులు, పలు శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు,
కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Just In...