Published On: Mon, Nov 30th, 2020

ఆర్త‌జ‌న సేవ‌లో ఆశాజ్యోతి..!

* ఆద‌ర్శం ME2WE సంస్థ సేవాభావం

* సంపూర్ణ ఆరోగ్యంతో చిన్నారి రిషిత‌ డిశ్చార్జ్‌

* *సెల్ఐటి న్యూస్* వాట్సాప్ ‌గ్రూపు స‌మాచారానికి విశేష స్పంద‌న‌

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: అభం శుభం తెలియ‌ని రెండు సంవ‌త్స‌రాల చిన్నారి శ్వాస‌లో మేయ‌లేని భారాన్ని మోసింది. గాలి పీల్చుకోవ‌డానికి న‌ర‌క‌యాత‌న ప‌డిన చిన్నారి ప్రాణ సంక‌ట ప‌రిస్థితిని చూసిన త‌ల్లి హృద‌యం త‌ల్ల‌డిల్లిపోయింది. త‌న బిడ్డ‌ను బ్ర‌తికించ‌డానికి ఏ దేవుడు దిగి వ‌స్తాడో అని క‌ళ్ల‌ల్లో ఒత్తులేసుకొని నిరీక్షించింది. ఎగ శ్వాస.. దిగ శ్వాస‌తో ఊపిరి స‌ల్ప‌క పూర్తిగా మాట‌లు కూడా రాని ఆ చిన్నారి క‌డుపులో నెల‌కొన్న అనిశ్చితిని త‌ల్లికి చెప్పుకోలేక న‌ర‌క‌యాత‌న అనుభ‌వించింది. ఆ ప‌సి హృద‌యం ఎట్ట‌కేల‌కు తేరుకుంది. *సెల్ఐటి న్యూస్ వాట్సాప్ గ్రూపులో* వ‌చ్చిన స‌మాచారాన్ని అందుకున్న ME2WE సంస్థ బృందం ప‌సిపాప‌ను అక్కున చేర్చుకొని మ‌ణిపాల్ వైద్యుల‌తో శ‌స్త్ర చికిత్స చేయించి పాప‌కు ఊపిరిపోసింది. సంపూర్ణ ఆరోగ్యంతో పాప, ప‌ట్ట‌లేని సంతోషంతో కుటుంబస‌భ్యులు శ‌నివారం ఇంటికి ప‌య‌న‌మ‌య్యారు. ఈ నెల 6వ తేదీన *సెల్ఐటి న్యూస్‌* వాట్సాప్ ‌గ్రూపులో పం‌పిన స‌మాచారానికి విశేష స్పంద‌న ల‌భించింది. ప‌శ్చిమ గోదావరి జిల్లా పోల‌వ‌రానికి చెందిన రెండేళ్ల జె.రిషిత శ్వాస సంబంధిత స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంది. శ్వాస తీసుకోవ‌టం క‌ష్టంగా మారిన బాలిక‌ను కుటుంబం స‌భ్యులు గుంటూరు జిల్లా తాడేప‌ల్లిలోని మ‌ణిపాల్ హాస్పిట‌ల్‌కు తీసుకువ‌చ్చారు. బాలిక‌ను ప‌రీక్షించిన వైద్యులు పాప ఊప‌రితిత్తుల్లో అతి భ‌యంక‌ర‌మైన గ‌డ్డ ఉంద‌ని అది సుమారు కేజి బ‌రువు ఉంద‌ని చెప్పారు. వెంట‌నే పాప‌కు ఆప‌రేష‌న్ చేసి గ‌డ్డ‌ను తొల‌గించాల‌ని సూచించారు. ఆప‌రేష‌న్‌కు రూ.1,48,366 ఖ‌ర్చ‌వుతుంద‌ని వెంట‌నే ఆ మొత్తాన్ని ఏర్పాటు చేసుకోవాల‌ని తెలిపారు. ఈ విష‌య‌మే *సెల్ఐటి న్యూస్* గ్రూపులో స‌మాచారం రాగానే.. విష‌యాన్ని హైద‌రాబాద్‌కు చెందిన ME2WE స్వ‌చ్ఛంద సేవా ‌సంస్థకు విజ‌య‌వాడ కోఆర్డినేట‌ర్‌గా ఉన్న గోదావ‌రి వెంక‌టేష్ సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్ర‌మంలో ME2WE సంస్థ నిర్వాహ‌కులైన కిర‌ణ్, మ‌రొక ప్ర‌ముఖులైన సాగ‌ర్ వెంట‌నే స్పందించి పాప ఆప‌రేష‌న్‌కు ఏర్పాట్లు చేశారు. అయితే పోల‌వ‌రంలో కొంతమంది దాత‌లు బేబీ రిషిత ప‌రిస్థితిని తెలుసుకొని సుమారు రూ.61వేలు వ‌ర‌కు చందాలు పోగుచేసి ME2WE సంస్థ‌కు అందించారు. మిగిలిన మొత్తం రూ.87,366 వ్య‌యాన్ని ME2WE సంస్థ భ‌రించింది. ఈ క్ర‌మంలో మ‌ణిపాల్ ఆసుప‌త్రి వైద్యులు రిషిత‌కు ఆప‌రేష‌న్ చేసి ఊప‌రితిత్తుల్లో ఉన్న గ‌డ్డ‌ను తొల‌గించారు. ఆప‌రేష‌న్ విజ‌య‌వంత‌మైన‌ పాపను మ‌ణిపాల్ ఆసుప‌త్రి వైద్యులు శ‌నివారం డిశ్చార్జ్ చేశారు. ఇటువంటి బృహ‌త్తర‌ స‌మాచారాన్ని అందించి పాప ప్రాణాలు నిల‌బెట్టిన *సెల్ఐటి న్యూస్‌* యాజ‌మాన్యానికి, ప్ర‌జాసేవ‌నే ప‌ర‌మావ‌ధిగా కాంక్షించి చిన్నారికి ఆప‌రేష‌న్ విష‌యంలో ఉదార‌త చాటిన ME2WE సంస్థ బృందాన్ని అభినందిస్తూ రిషిత కుటుంబస‌భ్యులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Just In...